
వేసవి సెలవుల్లో అలా విదేశాలు తిరుగుతూ మెక్సికన్ ఫుడ్ తినాలనుకుంటున్నారా..! అవసరం లేదు, తామే మెక్సికన్ రుచులను నగరానికి తీసుకొస్తున్నామని ప్రముఖ చెఫ్ అమన్నా రాజు అంటున్నారు. మే నెల వేసవిలో వారాంతాలను అలా మెక్సికన్ స్మోకీ మెరినేడ్ రుచులను ఆస్వాదించాలనే వారికి తాము ప్రత్యేక వంటలను అందిస్తున్నట్లు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని నోవోటెల్ ఎయిర్‌పోర్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మెక్సికన్ ఫుడ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. మెక్సికోలోని ఓక్సాకా, వెరాక్రూజ్ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన విభిన్న రుచులను మెక్సికన్ గ్రిల్ నైట్స్‌తో నగరానికి పరిచయం చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకూ ప్రతి శనివారం ఈ మెక్సికన్ ఫుడ్ ఫెస్ట్ అలరించనుంది.
ఓ వైపు భాగ్యనగరం వేదికగా ఈ నెల 31వ తేదీ వరకూ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మెక్సికన్ ఫుడ్ వెరైటీలు నగర వాసులను, నగరానికి విచ్చేస్తున్న విదేశీ అతిథులను ఆతీ్మయ విందుకు ఆహ్వానిస్తోంది.
అంతేకాకుండా ఈ ఫెస్ట్ నగరంలోని ఆహార వైవిధ్యానికి, విభిన్న సంస్కృతులకు చెందిన రుచుల సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుందని నోవోటెల్ ఎయిర్‌పోర్ట్ జనరల్ మేనేజర్ సుఖ్‌బీర్ సింగ్ పేర్కొన్నారు.
గ్యాస్ట్రోనమిక్ సంతృప్తి..
అంతర్జాతీయంగా మెక్సికన్ వంటలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఫ్లేమ్–గ్రిల్డ్ మాంసాహారాలు, స్మోకీ మెరినేడ్‌లు, అరుదైన సుగంధ ద్రవ్యాల కలయికే ఈ వంటల ప్రత్యేకత. ఈ గ్యాస్ట్రోనమిక్ రుచుల వైవిధ్యాన్ని వేసవి ప్రత్యేకంగా నగరంలో ఆవిష్కరిస్తున్నారు.
ఈ ఫుడ్ ఫెస్ట్‌లో అతిథులు వెజిటబుల్ బౌల్, బీన్ ఎన్చిలాడా సూప్‌తో ప్రారంభిస్తారు. అనంతరం మినీ కార్న్ డాగ్స్ వంటి ఆహ్లాదకరమైన స్టార్టర్స్‌ను పచ్చి మిరపకాయ, ఆవాలు, రుచికరమైన గుమ్మడికాయ ఎంపనాడాస్‌తో కలిపి వడ్డిస్తారు. ప్రత్యేకంగా అందించే సలాడ్ టెక్స్చర్స్, వినూత్న రుచుల మిశ్రమంతో అలరిస్తుంది.
ప్రత్యేక దినుసులు..
ఫెస్ట్‌లో భాగంగా సీఫుడ్ సెవిచే, శ్రీరాచా డ్రెస్సింగ్‌తో స్పైసీ మెక్సికన్ చికెన్ సలాడ్, చిపోటిల్ డ్రెస్సింగ్‌లో కలిపి కాల్చిన బెల్ పెప్పర్ సలాడ్ జిహ్వకు సరికొత్త రుచిని అందిస్తుంది. గ్వాకామోల్, పైనాపిల్ సల్సా, టొమాటో సల్సా వంటి క్లాసిక్ మెక్సికన్ రుచులు ఈ మెనూలో మరో ప్రత్యేకం.
మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని మసాలాలు దక్షిణాది మసాల రుచులకు భిన్నమైన అనుభూతిని అందిస్తాయి. చికెన్ క్యూసాడిల్లాస్, కాలాబాసిటాస్ కాన్ క్వెసో – చీజ్, వెజిటబుల్ చీజ్ ఎన్చిలాడాస్‌తో వండిన గుమ్మడికాయ, రుచికరమైన మొక్కజొన్న మిశ్రమాల్లో మసాల పరిమళం నగరవాసులను ఓక్సాకా, వెరాక్రూజ్ ప్రాంతాలకు తీసుకెళుతుంది. సీ ఫుడ్ లవర్స్ కోసం మెక్సికన్ రొయ్యలు, చేపల బిస్క్యూ పిసికాడో, కామరాన్ పోజోల్‌ను ఆస్వాదిస్తారు.
(చదవండి: మిస్ వరల్డ్ మధురమైన పాట)