
మిస్ వరల్డ్ 2025
మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ టాలెంట్, బ్యూటి విత్ ఎ పర్పస్, బెస్ట్ స్విమ్ సూట్, నైట్ గౌన్, మిస్ ఫొటోజెనిక్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ హెయిర్.. స్కిన్ వంటి రౌండ్స్ ఉన్నట్టే స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్ కూడా ఉంటుంది.
మిస్ వరల్డ్ 2025 పోటీలో భాగంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో ఘనంగా జరిగిన ఈ రౌండ్‌లో మిస్ ఎస్టోనియా.. ఎలిస్ రాండ్మా విజయం అందుకున్నారు. మొదటి రన్నరప్‌గా మిస్ మార్టీనిక్ ఆరేలీ జోచిమ్, రెండో రన్నరప్‌గా మిస్ కెనడా మారిసన్ నిలిచారు. వాళ్ల వివరాలు..
మిస్ ఎస్టోనియా.. ఎలిస్ రాండ్మా
1999 నుంచి ఇప్పటివరకు ఎస్టోనియా దేశం.. మిస్ వరల్డ్ పోటీల్లో స్పోర్ట్స్ ఈవెంట్‌లో గెలిచి, ఈ బ్యూటీ పాజెంట్‌లోని తర్వాత రౌండ్స్‌కి అర్హత పొందడం ఇదే మొదటిసారి. ఈ విజయంతో మిస్ ఎస్టోనియా ఎలిస్ రాండ్మా.. యూరప్ టాప్ టెన్ ఫైనలిస్ట్స్, టాప్ 40 ఫైనలిస్ట్స్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఎస్టోనియాలోని కిర్నాకు చెందిన ఎలిస్.. ఐటీ సిస్టమ్ డెవలప్‌మెంట్ గ్రాడ్యుయేట్.
సేల్స్ కన్సల్టెంట్‌గా, స్టోర్ మేనేజర్‌గా, రాడిసన్ మెరిటన్ పార్క్ ఇన్ హోటల్‌లో హోస్టెస్‌గా, జూనియర్ ఐటీ డెవలప్‌మెంట్ స్పెషలిస్ట్‌గా.. రకరకాల ఉద్యోగాలు చేసింది. మోడలింగ్ అవకాశాలనూ అందిపుచ్చుకుంది. ఆన్‌లైన్ చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆమె వాటినే తన బ్యూటీ విత్ ఎ పర్పస్‌గా పేర్కొంది. ‘స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించడం చాలా సంతోషంగా ఉంది. గెలుస్తానో లేదో అనుకున్నా కానీ సులభంగానే గెలిచాను. నిజానికిదో చాలెంజ్.. గొప్ప అనుభవం! జీవితంలోని ఒడిదుడుకులను ఎలా అధిగమించవచ్చో నేర్పే ఈవెంట్ ఇది. లైఫ్‌కి చాలా ఉపయోగపడుతుంది!’ అని ఆ ఈవెంట్ గురించి చెప్పింది ఎలిస్.
మిస్ మార్టీనిక్.. ఆరేలీ జోచిమ్..
మార్టీనిక్‌లోని డ్యూకోస్ పట్టణానికి చెందిన ఆరేలీ జోచిమ్.. హైజీన్ సేఫ్టీ ఎన్వైర్‌మెంట్ స్టడీస్‌లో డి΄్లోమా చేసింది. నిత్యం నవ్వుతూ ఉండే ఆరేలీకి ప్రకృతి అంటేప్రాణం. జీవితాన్ని చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటా నంటోంది. తన జీవితానుభవాలు, తన భావోద్వేగ ప్రయాణాల స్ఫూర్తితో ‘మెసొన్ లాన్మూర్ (ప్రేమాలయం)’ అనే సంస్థను స్థాపించి మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.
దీని గురించే ఆమె ‘బ్యూటీ విత్ ఎ పర్పస్ రౌండ్’లో ముచ్చటించనుంది. ‘బాడీ ఫిట్‌గా ఉండాలంటే స్పోర్ట్స్ చాలా అవసరం. ఏప్రొఫెషన్‌లో ఉన్నా ఆటల పట్ల ఆసక్తి పెంచుకుని ఏదో ఒక స్పోర్ట్‌ని ప్రాక్టీస్ చేస్తే శారీరకంగానే కాదు మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటాం. ఇది మన రెగ్యులర్‌ప్రొఫెషన్‌లో సక్సెస్‌కి చాలా ఉపయోగపడుతుంది’ అంటుంది ఆరేలీ జోచిమ్.
మిస్ కెనడా.. ఎమ్మా మారిసన్..
కెనడా, ఓంటారియోలోని ఓ చిన్న పట్టణం (Chapleau) లో పుట్టి, పెరిగిన ఎమ్మా.. మిస్ కెనడా కిరీటాన్ని ధరించిన స్థానిక ఆదిమ తెగకు చెందిన తొలి యువతి. ఇండిజినస్ ప్రిపరేటరీ స్టడీస్ అండ్ టూరిజంలో డిగ్రీ చేసింది. ఈస్థటిక్స్ అండ్ హెయిర్‌కి సంబంధించిన కోర్స్ కూడా చదివింది. అందాల పోటీ అంటే స్కిన్ షో కాదని, సామాజిక బాధ్యతను గుర్తించే వేదికని తెలిశాక.. ఆ పోటీల పట్ల మక్కువ పెంచుకుంది.
బ్యూటీ పాజెంట్స్‌లో పాల్గొంది. ‘రిబ్బన్ స్కర్ట్స్’ అనే కార్యక్రమం ద్వారా తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తోంది. ‘రిబ్బన్ స్కర్ట్స్’ అనేది తమ తెగ మహిళలకు సంబంధించిన ఒక సంప్రదాయ నేత. దాన్ని వాళ్లు తమ చరిత్ర, సాంస్కృతిక సంబరాలకు ఒక గుర్తుగా భావిస్తారు. దాన్నే ఆమె తన సామాజిక సేవా కార్యక్రమంగా ఎంచుకుంది. ‘ఎందుకంటే కెనడాలో మైదానప్రాంతపు అమ్మాయిల కన్నా పన్నెండింతలు మా తెగకు చెందిన అమ్మాయిలు అదీ పదిహేనేళ్లలోపే శారీరక, లైంగిక దాడులకు బలవుతున్నారు.
ఇదీ చదవండి: Yoga: ప్రాణాయామంతో అమోఘమైన ఆరోగ్య ఫలితాలు
దీన్ని నిలువరించి మా తెగలోని అమ్మాయిలు సాధికారత సాధించేందుకే నేను ‘రిబ్బన్ స్కర్ట్స్’ పేరుతో సామాజిక కార్యక్రమాలను స్టార్ట్ చేశాను. స్వావలంబన తో మావాళ్లను నాగరిక సమాజానికి కనెక్ట్ చేయాలన్నదే నా లక్ష్యం. ఇదే నా బ్యూటీ విత్ పర్పస్’ అంటుంది ఎమ్మా. మిస్ వరల్డ్ అందాల పోటీలలో సెకండ్ రన్నరప్ గెలుపు గురించి మాట్లాడుతూ ‘గొప్ప ఎక్స్‌పీరియెన్స్. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వాళ్లతో పోటీపడి విజేతగా నిలవడం మరచిపోని అనుభూతి. తర్వాత దశకు ఇదొక స్ఫూర్తి. నా బలాబలాలు తెలుసుకోవడానికి ఈ స్పోర్ట్స్ చాలెంజ్ ఈవెంట్ చాలా ఉపయోగపడింది. దీంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని చెప్పింది.