బుందేల్‌ఖండ్‌లో మారిన సాగు చిత్రం బీడు భూములు తగ్గాయి: 600 హెక్టార్ల బీడు భూమి విస్తీర్నం 200 హెక్టార్లకు తగ్గి సాగులోకి వచ్చింది.వేరుశెనగ విస్తీర్ణం: ఖరీఫ్‌లో వేరుశెనగ
సాగు 240 హెక్టార్ల నుంచి 2,100 హెక్టార్లకు పెరిగింది.రబీ పంటల జోరు: గోధుమ సాగు 225 నుంచి 900 హెక్టార్లకు, కంది 338 నుంచి 450 హెక్టార్లకు విస్తరించింది.జలసిరి: వర్షాకాలం తర్వాత కూడా 80–90% బావుల్లో పుష్కలంగా నీరునిలిచింది.
వర్షాధార లేదా మెట్ట వ్యవసాయమంటే కేవలం ఆకాశం వైపు ఆశగా చూడటం కాదు.. కురిసిన ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి, నేల స్వభావానికి తగిన పంటను ఎంచుకుంటే కరువు నేలలోనూ బంగారం పండించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. తెలంగాణలోని పటాపఖ చెరు కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్), ఐఐటీ ఖరగ్‌పూర్, ఐకార్–సెంట్రల్ అగ్రోఫారెస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఏఎఫ్ఆర్ఐ) పరిశోధకులు రూపొందించిన వినూత్న ‘వాటర్ ఫ్రేమ్‌వర్క్’ విధానం మెట్ట రైతులకు కొత్త దారి చూపిస్తోంది.
ఇదీ వాటర్ ఫ్రేమ్‌వర్క్
మెట్ట ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉండటమే కాకుండా, కురిసిన నీరు వృథాగా బయటకు వెళ్లిపోవటం ప్రధాన సమస్య. దీనికి పరిష్కారంగా శాస్త్రవేత్తలు ‘భూ వనరుల మ్యాపింగ్’, ‘నేల జలవిజ్ఞానం’, ’నీటి బడ్జెటింగ్’లను కలిపి ఒక శాస్త్రీయ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించారు. దీని ద్వారా ఏ నేలలో ఎంత తేమ నిలుస్తుంది, ఏ పంటకు ఎంత నీరు
అవసరమో ముందుగానే అంచనా వేసి సాగు ప్రణాళికలు రచించారు.పటాన్ చెరులోని ఇక్రిసాట్ వాటర్షెడ్లలో పదేళ్ల పాటు సాగిన ఈ పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఇసుక శాతం ఎక్కువగా ఉండే ఎర్ర నేలలు (ఆల్ఫిసోల్స్) త్వరగా ఎండి΄ోతుండగా, బంకమట్టి అధికంగా ఉండే నల్ల రేగడి నేలలు (వెర్టిసోల్స్) మీటరు లోతులో 150 నుంచి 200 మి.మీ. వరకు తేమను నిల్వ ఉంచుకుంటున్నాయి. చదునైన నేలల కంటే ఎత్తు మడుల (బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో–బీబీఎఫ్) విధానంలో సాగు చేయటం వల్ల నీటి వృథా తగ్గి, కరువు సంవత్సరాల్లోనూ మెరుగైన రాబడి వచ్చింది.

5 వేల హెక్టార్లు.. 4 ఏళ్లు..
ఈ విజయవంతమైన నమూనాను 2018 నుంచి 2022 వరకు ఉత్తరప్రదేశ్‌లోని కరువు పీడిత బుందేల్‌ఖండ్ ప్రాంతం (ఝాన్సీ జిల్లా సుత్తా, సింగార్ గ్రామాల)లో 5,000 హెక్టార్లలో అమలు చేశారు. చెక్ డ్యామ్‌లు, వ్యవసాయ చెరువులు, హవేలీ నిర్మాణాల ద్వారా వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకింపజేశారు.
ఫలితంగా పనికిరాకుండా పోయిన బావులు, బోర్లు జలకళ సంతరించుకున్నాయి. నీటి లభ్యత పెరగడంతో రైతుల నికర ఆదాయం హెక్టారుకు ఏడాదికి 427 డాలర్ల నుంచి ఏకంగా 1,107 డాలర్లకు (మూడు రెట్లు) ఎగబాకింది. ఉపాధి కోసం వలస వెళ్లిన 350 కుటుంబాలు తిరిగి సొంతూళ్లకు వచ్చి వ్యవసాయం చేసుకోవటం ఈ పరిశోధన సాధించిన అతిపెద్ద విజయం.
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
ఇదీ చదవండి: ఉల్లిపాయ తొక్కల ద్రావణం


