
నవంబర్‌లో థాయ్‌లాండ్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ 2025పోటీలో పాల్గొనబోతున్న భారతీయ సుందరిగా మనికా విశ్వకర్మ(Manika Vishwakarma) ఎంపికైంది.రాజస్తాన్‌కు చెందిన మనిక విశ్వకర్మ ప్రస్తుతం పోలిటికల్ సైన్స్ చదువుతోంది. క్లాసికల్ డాన్సర్‌గా ప్రతిభ చూపడమే కాదు ‘న్యూరోనోవా’ అనే సంస్థను స్థాపించి పుట్టుకతోనే న్యూరో సమస్యలతో బాధపడే చిన్నారులకు సాయం చేస్తోంది మనిక. ఆమె పరిచయం.
దాదాపు 100కు పైగా దేశాల సుందరీమణులు పాల్గొనే ‘మిస్ యూనివర్స్’పోటీలలో 2025 సంవత్సరానికి భారతదేశం తరఫున పాల్గొనే ప్రతినిధిగా 22 సంవత్సరాల మనిక విశ్వకర్మ ఎంపికైంది. జైపూర్‌లో మంగళవారం తెల్లవారుజాము వరకూ సాగిన తుది ఎంపిక వేడుకలో మనిక విశ్వకర్మ ‘మిస్ యూనివర్స్ ఇండియా 2025’ కిరీటం దక్కించుకుంది. గత సంవత్సరం ఈ టైటిల్ గెలుచుకున్న రియా సిన్హా ఆమెకు కిరీటం తొడిగింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నర్ అప్‌గా, హర్యాణకు చెందిన మెహక్ ధింగ్రా రెండవ రన్నర్ అప్‌గా ఈపోటీలో నిలిచారు.
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల అందగత్తెలు ఈపోటీలో పాల్గొనగా రాజస్తాన్‌కు చెందిన మనిక విజేతగా నిలిచింది. నవంబర్‌లో థాయ్‌లాండ్‌లో జరగనున్న 74వ ‘మిస్ యూనివర్స్’పోటీలలో మనిక తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గతంలో మిస్ యూనివర్స్ కిరీటాన్ని మన దేశం నుంచి సుస్మితాసేన్ (1994), లారా దత్తా (2000), హర్నాజ్ సంధు (2021) గెలుచుకున్నారు.
స్త్రీ విద్య ముఖ్యమైనది
మిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేత తుది ఎంపికలో జ్యూరీ అడిగిన ప్రశ్నకు మనిక ఇచ్చిన జవాబు అందరినీ ఆకట్టుకుంది. ‘స్త్రీలకు విద్య అందించే అవకాశం ఒకవైపు, పేద కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన అందించే అవకాశం మరోవైపు నీకు ఉంటే దేనిని ఎంచుకుంటావ్’ అనే ప్రశ్నకు మనిక ‘నేను స్త్రీ విద్యనే ఎంచుకుంటాను. ఎందుకంటే స్త్రీలకు విద్య నేర్పించడం వల్ల ఆమె మాత్రమే మారదు... కుటుంబాలు... తద్వారా భవిష్యత్ తరాలు మారుతాయి’ అని సమాధానం ఇచ్చింది.
డాన్సర్, పెయింటర్
రాజస్తాన్‌లోని గంగానగర్ అనే చిన్న పట్టణానికి చెందిన మనిక విశ్వకర్మ బాల్యం నుంచి క్లాసికల్ డాన్సర్. పెయింటర్ కూడా. ఆమెను లలిత కళా అకాడెమీ, జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్ సత్కరించాయి కూడా. పోలిటికల్ సైన్స్ స్టూడెంట్‌గా ఢిల్లీలో ఉంటూపోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే అందాలపోటీలో పాల్గొంది మనిక. ఒక సాధారణ నేపథ్యం నుంచి విజేతగా నిలిచింది. ‘అందరూ ఈ సమయంలో తాము పడ్డ కష్టాల గురించి చెబుతారు. కాని నేను నాకు దొరికిన సపోర్ట్ గురించి చెబుతాను. మా అమ్మా నాన్నలు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. నాకు చదువు నేర్పిన గురువులది తర్వాతి స్థానం. నా స్నేహితులు ఎంతో ్రపోత్సహించారు. వీరందరూ లేకుంటే నేను ఇక్కడి వరకూ రాను’ అని చెప్పిందామె.
సామాజిక సేవలో...
పుట్టుకతోనే న్యూరో సంబంధ సమస్యలతో పాల్గొనే చిన్నారుల కోసం ‘న్యూరోనోవా’ అనే సంస్థను స్థాపించింది మనిక. డౌన్ సిండ్రోమ్, ఏడీహెచ్‌డీ వంటి సమస్యలతో బాధ పడే చిన్నారులకు తగిన కౌన్సెలింగ్, సపోర్ట్ ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉంది. ‘మిస్ యూనివర్స్ వంటిపోటీలు గుర్తింపును ఇవ్వడం మాత్రమే కాదు వ్యక్తిత్వాన్ని కూడా తీర్చిదిద్దుతాయి. ఈపోటీలలో సవాళ్లను ఎదుర్కొంటూ విజేత అయ్యాను. ఈ గుర్తింపుతో నా సామాజిక సేవను విస్తరిస్తాను. సమాజానికి ఏదో ఒకటి చేయడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత’ అంది మనిక.