
భువనేశ్వర్: పవిత్ర ఆషాఢ శుక్ల పక్ష నవమి రోజున గుండిచా ఆలయంలో నవమి సంధ్యా దర్శనం ప్రాప్తిస్తుంది. అడపా మండపంపై ఒక రోజు దర్శనం శ్రీ మందిరం నీలాద్రి మండపంపై జగతినాథుడు శ్రీ జగన్నాథ స్వామి ( Lord Jagannath ) పది సంవత్సరాల దర్శనం పుణ్యఫలం ప్రసాదిస్తుందని పౌరాణిక కథనాలు సూచిస్తున్నాయి. స్వామి జన్మస్థలం అడపా మండపంపై పగటి పూట దర్శనం కంటే సంధ్య వేళ దర్శనం పుణ్యం పది రెట్లు అధికంగా లభిస్తుంది. అందుచేత నవమి సంధ్యా దర్శనం ప్రాధాన్యత సంతరించుకుంది.
అడపా మండపంపై శ్రీ నవమి సంధ్యా దర్శనం సాయంత్రం 6 గంటల వరకే పరిమితం చేశారు. స్వామి మారు రథ యాత్ర బహుడా యాత్రకు ముందస్తు సన్నాహాలు, బహుళ సేవల ఆచరణ ఒత్తిళ్ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీ మందిరం పాలక వర్గం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ గుండిచా ఆలయ సింహ ద్వారం గుండా ప్రవేశం నివారించారు. దీంతో భక్తులకు నవమి నాడు సంధ్య వేళలో దర్శనం ప్రాప్తి లేకుండా పోయింది. సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ఇదీ చదవండి: జగన్నాథుడి కల్కి అవతారం : మారు రథయాత్ర
శ్రీ గుండిచా ఆలయ శుద్ధి తర్వాత తర్వాత అడప మండపంపై అనేక ముఖ్యమైన సేవలను నిర్వహించాల్సి ఉంటుంది. బహుడా యాత్ర రోజున రథంపై మూల విరాటులను దర్శించుకునే అవకాశం భక్తులు పొందుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు భక్తజన వర్గం జగతి నాథుని పట్ల భక్తి పూర్వక సేవ, అంకితభావంతో సహకరించాలని అభ్యర్థించారు.. అనుబంధ వర్గాల సేవకుల సహకారం, సమన్వయంతో బహుడా సంబంధిత సేవల్ని సకాలంలో పూర్తి చేయాలని అభ్యర్థించారు.