ఘనంగా క్రియా యోగ మార్గదర్శి లాహిరి మహాశయులు జయంతి వేడుకలు | Kriya Yoga Master Lahiri Mahasaya Grand Jayanti Celebrations Across India | Sakshi
Sakshi News home page

ఘనంగా క్రియా యోగ మార్గదర్శి లాహిరి మహాశయులు జయంతి వేడుకలు

Sep 29 2025 9:19 PM | Updated on Sep 29 2025 9:26 PM

Kriya Yoga Master Lahiri Mahasaya Grand Jayanti Celebrations Across India

హైదరాబాద్: క్రియాయోగాన్ని ప్రపంచానికి అందించిన యోగావతారులు లాహిరీ మహాశయుల జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా కన్నులపండువగా జరుగుతున్నాయి. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన ఆశ్రమాల్లో, ధ్యానకేంద్రాల్లో క్రియాయోగులు, భక్తులు లాహిరి మహాశయులను స్మరించుకున్నారు.

“ధ్యానం ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకోండి. లాభం లేని, మతసంబంధమైన  ఊహలకు బదులు వాస్తవమైన దైవసంస్పర్శ మీద శ్రద్ధ నిలపండి.”-లాహిరీ మహాశయులు    

మనమధ్య అప్పుడప్పుడు, ప్రపంచం దృష్టికి కనిపించకుండా రాబోయే తరాలకు ప్రకాశమానమైన ఒక మార్గాన్ని సుగమం చేసే  ఆధ్యాత్మిక మహనీయుడు నిశ్శబ్దంగా సంచరిస్తారు. అలాంటి మహనీయులలో సెప్టెంబర్ 30, 1828న బెంగాల్‌లోని ఘూర్ణిలో జన్మించిన లాహిరీ మహాశయులు ఒకరు.యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు పరమహంస యోగానంద రచించిన "ఒక యోగి ఆత్మకథ"లో వివరించినట్లుగా, వారి జీవితం ఆధ్యాత్మిక సాధన గురించిన మన అవగాహనలో ఒక మలుపును సూచించింది.

యోగావతార్‌గా ప్రసిద్ధి చెందిన లాహిరీ మహాశయులు ఒక సన్యాసి లేదా ఏకాంతవాసి కాదు. ఆయన వారణాసిలో భార్య, పిల్లలతో ఒక సాధారణ జీవితాన్ని గడిపిన ఒక గృహస్థుడు—ప్రభుత్వ అకౌంటెంట్. కానీ 1861లో, రాణీఖేత్ సమీపంలో ఉన్నప్పుడు, వారి విధి మారింది. సాధారణ ప్రజానీకానికి కనపడని, అమర యోగి మహావతార్ బాబాజీచే  హిమాలయ పర్వతపాదాల వద్దకు ఆకర్షితులై, అంతరించిపోయిన క్రియాయోగ విద్యలో దీక్ష పొందారు.  క్రియాయోగం అనేది ఆధ్యాత్మిక వికాసాన్ని వేగవంతం చేయగల ఒక సాధనం, ఎందుకంటే కేవలం ఒక క్రియ సాధన ఒక సంవత్సర కాలపు  సహజ ఆధ్యాత్మిక పురోగతికి సమానం.

ఈ సంఘటన చారిత్రాత్మకమైనది. శతాబ్దాలుగా, అటువంటి బోధనలు రక్షించబడి, సన్యాసులకు మాత్రమే ఇవ్వబడేవి. కానీ లాహిరీ మహాశయుల అభ్యర్థన మేరకు, ఈ పద్ధతిని నిజమైన దైవాన్వేషకులందరికీ ప్రసాదించవచ్చని బాబాజీ అంగీకరించారు. లాహిరీ మహాశయుల  కార్యసాధన ప్రారంభమైంది. కాషాయవస్త్రాలు ధరించిన గురువుగా కాకుండా, ప్రాచీన యోగం, ఆధునిక ప్రపంచానికి మధ్య ఒక జీవన వారధిగా.. వారణాసికి తిరిగి వచ్చిన తర్వాత, లాహిరీ మహాశయులు నిశ్శబ్దంగా నిజమైన అన్వేషకులకు క్రియాయోగం బోధించడం ప్రారంభించారు. బ్రాహ్మణులు, వ్యాపారులు, పండితులు, గృహస్థులు ఆయన విద్యార్థులయ్యారు. దేవుడు అందరివాడు అనే ఒక సాధారణ సందేశంతో ఆయన కుల భేదాలను, మత సిద్ధాంతాలను ఛేదించారు.

వారి అనేక బోధనలలో, ఒక వాక్యం ప్రసిద్ధి చెందింది: “బనత్, బనత్, బన్ జాయ్” (“శ్రమిస్తూ, శ్రమిస్తూ, చూడు! అదిగో! దివ్యలక్ష్యం”). ఆధ్యాత్మిక మార్గంలో నెమ్మదిగా పురోగతి సాధిస్తున్నారని నిరుత్సాహపడిన వారికి ఇది వారి సమాధానం. నిలకడైన, నిజాయితీతో కూడిన  సాధన ఖచ్చితంగా ఫలితాలను ఇస్తుందనే ఆయన ప్రధాన సందేశాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

లాహిరీ మహాశయుల ప్రముఖ శిష్యులలో ఒకరు స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి. ఆయన అపారమైన జ్ఞానం కలిగిన వారు. తరువాత కాలంలో పరమహంస యోగానందకు గురువు అయ్యారు. యోగానంద విధిలో లాహిరీ మహాశయులు ఒక కీలక పాత్ర పోషించారు. యోగానంద చిన్న శిశువుగా ఉన్నప్పుడు, వారి తల్లి ఆ మహర్షి వద్దకు ఆశీర్వాదం కోసం తీసుకువెళ్ళింది. లాహిరీ మహాశయులు ఆ శిశువు నుదుటిని తాకి.. "చిట్టి తల్లీ, నీ కొడుకు యోగి అవుతాడమ్మా. ఒక ఆధ్యాత్మికమైన రైలింజను మాదిరిగా ఇతను, ఎన్నో  ఆత్మలను భగవత్  సాన్నిధ్యానికి చేరుస్తాడు" అని ప్రకటించారు.

ఆ ప్రవచనం నిజమైంది. యోగానందజీ ప్రపంచంలోనే గొప్ప క్రియాయోగ సాధకులయ్యారు. లాస్ ఏంజిలిస్ లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్ ఆర్ ఎఫ్)ను, రాంచీలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వైఎస్ఎస్)ను స్థాపించారు. ఈ సంస్థలు యోగావతారుల  పరంపరలో,  యోగానంద తన దివ్యగురువు పాదాల వద్ద నేర్చుకున్న బోధనలను ప్రచారం చేస్తాయి.

అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నప్పటికీ, లాహిరీ మహాశయులు వినయంగా నిగర్విగా ఉన్నారు. సేవా  తత్వంతో కూడిన వారి ప్రశాంత  జీవితం ఆధ్యాత్మిక జ్ఞానోదయం, లౌకిక బాధ్యతల నిర్వహణ  పరస్పరం వైరుధ్యాలు  కావని చూపింది. సెప్టెంబర్ 30న లాహిరీ మహాశయుల జయంతిని పురస్కరించుకొని, కీర్తిని కోరకుండా ఆధ్యాత్మిక చరిత్ర గమనాన్ని మార్చిన ఒక గురువును మనం స్మరించుకుంటాము. ఒకప్పుడు హిమాలయాలలో నిగూఢంగా ఉన్న క్రియాయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభ్యసించబడుతోంది. లాహిరీ మహాశయులలో, మనం అంతిమ ఏకీకరణను చూస్తాము: దివ్యత్వం మానవునిలో పూర్తిగా జీవించడం, దైనిక  జీవితంలో అమరత్వం  వ్యక్తమవడం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement