కొత్త అల్లుడికి కొసరి..కొసరి.. | Jamai Sasthi: Bengalis celebrate Jamai Sasthihonoring sons-in-law | Sakshi
Sakshi News home page

Jamai Sasthi: కొత్త అల్లుడికి కొసరి..కొసరి..

Jun 1 2025 2:09 PM | Updated on Jun 1 2025 2:09 PM

Jamai Sasthi: Bengalis celebrate Jamai Sasthihonoring sons-in-law

తెలుగు నాట సంక్రాంతి అల్లుళ్లకు ఎలాంటి ఆదరాభిమానాలు అందుతాయో పశ్చిమబెంగాల్‌కు చెందిన బెంగాలీలకు కూడా అల్లుళ్లను గౌరవించే ప్రత్యేక సంప్రదాయం ఉంది. వారి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి యేటా తిథి, నక్షత్రం ప్రకారం అల్లుళ్లను గౌరవంగా ఇంటికి ఆనించి సత్కరిస్తారు. జమై షష్టి అనే పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజించే బెంగాలీలు అమ్మవారికి అందించే సకల గౌరవ మర్యాదలు, సత్కారాలను అల్లుళ్లకు సమర్పిస్తారు. 

కొత్త బట్టలు పెట్టి ఇష్టమైన వంటకాలను వడ్డిస్తారు. జేష్ట మాసంలో జరిగే ఈ పండుగను జూన్‌ ఒకటో తేదీన జమై షష్టి మహోత్సవం పేరుతో నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే బెంగాలీలు పూర్తి చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో దశాబ్దాలుగా స్థిరపడిన బెంగాలీలు ఏడానికోసారి కన్నులు పండుగగా దీనిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అల్లుడు అత్తారింటికి వచ్చిన రోజు జరిగే హంగు ఆర్భాటాలు, అందుకు అయ్యే ఖర్చులను అత్తగారి భరిస్తారు. ఇక మరుసటి రోజు అల్లుడి వంతు ఉంటుంది.

అల్లుళ్ళకు రాజభోగం.. 
అమ్మవారి కరుణ కటాక్షం మా కుటుంబంతో పాటు అల్లుళ్లపై ఉండాలని కోరుతూ జమై షష్టి నిర్వహిస్తాం. ఒకరికొకరు కొత్త బట్టలతో, బహుమతులతో గౌరవించుకుంటాం. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. 
– మౌసమీ– బెంగాలీ మహిళ

ఖర్చంతా అల్లుడిదే.. 
అత్తారింటికి చేరిన అల్లుడు మరుసటి రోజు జరిగే ఉత్సవానికి ఆయనే ప్రధాన బాధ్యుడిగా ఉంటారు. అంటే ఆ రోజు జరిగే ఖర్చంతా అల్లుడు భరించాల్సి ఉంటుంది. ఇంట్లోని వారందరికీ బహుమతులతో పాటు అత్తగారికి చీరను బహూకరిస్తారు. ఇతర కుటుంబ సభ్యులకు మర్యాదపూర్వకంగా గిఫ్ట్‌లు అందజేస్తారు. ఈ ఖర్చంతా అల్లుడు చూసుకుంటాడు.  

జమై షష్టి.. బెంగాలీల ఆచారం.. 
జమై  షష్టి..అనేది బెంగాలీ ప్రజల సంప్రదాయ, సాంస్కృతిక ఆచారం. ఈ ఆచారాన్ని జైష్ట మాసం శుక్ల పక్ష ఆరవ తిథి నాడు నిర్వహిస్తారు. జమై అంటే అల్లుడు. షష్టి అంటే చంద్ర పక్షంలోని ఆరో రోజు. జమైషష్టి అనేది అల్లుళ్లను గౌరవించడానికి అంకితం చేసే పండుగ. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో అత్తగారు వారి శ్రేయస్సు కోసం దుర్గా దేవిని పూజిస్తారు.  

(చదవండి: మొన్న ‘గిబ్లీ’ నేడు బేబీ పాడ్‌కాస్ట్‌..)

Advertisement
 
Advertisement
Advertisement