బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న చాలామంది మొదట ధనాధన్ బరువు తగ్గిపోతారు. కానీ ఆ తర్వాత మళ్లీ యథావిధిగా బరువు పెరగకుండా కాపాడుకోవడమే అత్యంత ముఖ్యం. అయితే ఇది చాలా కష్టం. ఇక్కడొక నలభైఏళ్లు పైబడిన మహిళ ఈ సమస్యనే ఎదుర్కొంటోంది. ఆరు నెలలపాటు క్రమశిక్షణతో కూడిన ఆహారం, రోజువారీ నడక తర్వాత దాదాపు పది కిలోల బరువుని విజయవంతంగా తగ్గించుకుంది. కానీ అదే దినచర్యను కొనసాగించినా..మరింత బరువు తగ్గకపోగా..మళ్లీ యథావిధిగా పెరుగుతున్నట్లు అనిపించిందామెకు. ఎందుకంటే ఆకలి కోరికలు పెరగడం, ఎక్కువ కేలరీలు ఖర్చు చేయలేకపోయినట్లు వాపోయింది. ఇది చాలామందికి ఎదురయ్యే పెనుసమస్యే. ఎందుకిలా అంటే..
ప్రపంచవ్యాప్తంగా ఇలా డైటింగ్ చేస్తున్నా లక్షలాదిమందికి ఎదురైన అనుభవమే ఇది. మనం వెయిట్‌లాస్ అవ్వాలనుకున్నప్పుడు మానవశరీరం జీవశాస్త్రపరంగా సిద్దంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. హార్మోనల్, న్యూరోలాజికల్, మెటబాలిక్ అనుసరణ కలయిక ద్వారా శరీరం కోల్పోయిన బరువుని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. అందువల్లే దీర్ఘాకాలిక బరువు నిర్వహణ సవాలుగా మారిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
ఇలా బరువు తగ్గినట్టే తగ్గి యథావిధిగా పెరగడాన్ని 'వెయిట్-లాస్ ప్లాటో'గా పిలుస్తారని అన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే..శరీరం బరువు తగ్గే కొద్దీ శక్తిని ఆదా చేసి, మరింత బరువు తగ్గకుండా నిరోధించడం మొదలుపెడుతుందట. దీనిలో బ్రెయిన్ పాత్ర కీలకంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే బరువు తగ్గాలని గట్టిగా నిశ్చయించుకుంటామో..అందుకు అనుగుణంగా మన బ్రెయిన్ కడపు నిండిన భావన, శక్తి సమతుల్యతకు సంబంధించిన సంకేతాలను శరీరానికి అందిస్తుందట.
దాంతో మనం అమాంతం బరువు తగ్గుతూ వస్తూ ఉంటామని అన్నారు. అయితే..కాలక్రమేణ శరీరం ఒక ప్రాధాన్య బరువు పరిధిని ఏర్పరచుకుంటుందట. దీనిని 'సెట్ పాయింట్' అని అంటారని అన్నారు. శరీర బరువు ఈ పరిధి కంటే తక్కువకు పడిపోయినప్పుడూ..మెదడు ఆ మార్పును ఒక సంభావ్య ముప్పుగా భావించి, కోల్పోయిన బరువును తిరిగి పొందడానికి ఉద్దేశించిన ప్రతిస్పందనలను ప్రేరేపిస్తుందట. ఇక్కడ మెదడు తరుచుగా గణనీయమైన బరువు తగ్గడాన్ని ఆకలితో అలమటించే సంకేతంగా పరిగణిస్తుంది, తద్వారా కోల్పోయిన శక్తి నిల్వలను తిరిగి పొందడంలో సహాయపడటానికి రూపొందించిన యంత్రాంగాలను ప్రేరేపిస్తుంది.
దాంతో కేలరీలను తక్కువగా ఖర్చు చేస్తాం. పైగా ఆకలి కోరికలు ఎక్కువవ్వడం మొదలవుతాయట. ఫలితంగా యథావిధాగా బరువు పెరుగుతామని అన్నారు. అలాగే బరువు తగ్గాక రోజువారీ శక్తి వ్యయం ఆటోమేటిగ్గా తగ్గుతుందట. దాంతో మొదట ఏ ఆహారం అయితే బరువు తగ్గడానికి సహాయపడిందో అదే మరింత బరువు తగ్గడానికి సరిపడకపోవచ్చని అన్నారు. అలాగే బరువు తగ్గాక హార్మోన్లలో మార్పులు సంభవిస్తాయని చెబుతున్నారు నిపుణులు.
కడుపు నిండినట్లు సంకేతం ఇచ్చే కొవ్వు కణజాలం ద్వారా ఉత్పత్తి అయ్యే లెప్టిన్ అనే హార్మోన్ స్థాయిలు బరువు తగ్గిన తర్వాత తగ్గుతాయి. అదే సమయంలో, ఆకలితో సంబంధం ఉన్న గ్రెలిన్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఆకలి ఎక్కువగా అనిపించి.. ఎక్కువ లాగించడం తోపాటు ఖర్చు చేసే కేలరీల సంఖ్య కూడా తగ్గిపోతుందట. ఈ జీవసంబంధమైన కలయికే ఎక్కువగా తినేలా చేయడానికి, కోల్పోయిన బరువుని తిరిగి పొందడానికి కారణమవుతుందని అన్నారు.
అందువల్ల బరువు తగ్గడం అనేది మెదడు, హార్మోన్లు, జీవక్రియలు మధ్య ఉన్న సంక్లిష్టసంబంధంగా పరిగణించాలి. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ తోపాటు శరీరం సహజ నిరోధకతను అర్థం చేసుకోవాలన్నారు. ప్రజలు తమ ఫిట్‌నెస్ జర్నీని సహనంతో వాస్తవిక అంచనాలతో జాగురుకతతో చేపట్టాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
(చదవండి: డెలివరి బాయ్ నుంచి ఏకంగా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌కు గ్లోబల్ హెడ్ రేంజ్‌కు!)


