హాట్‌ వర్సెస్‌ ఐస్‌ ప్యాక్‌: ఎలాంటప్పుడు మంచిదంటే.. | Health Tips: Ice vs Heat: What Is Best for Your Pain? | Sakshi
Sakshi News home page

హాట్‌ వర్సెస్‌ ఐస్‌ ప్యాక్‌: ఎలాంటప్పుడు మంచిదంటే..

Jun 28 2026 9:18 AM | Updated on Jun 28 2026 4:01 PM

Health Tips: Ice vs Heat: What Is Best for Your Pain?

దేహంలో ఎక్కడైనా వాపుగానీ నొప్పిగానీ వస్తే కాపడం పెట్టడం చాలా సాధారణం. ఇలా కాపడం పెట్టడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందడం ఎప్పటినుంచో అనుసరిస్తున్న ప్రక్రియ. అయితే ఏయే సందర్భాల్లో ఐస్‌ ప్యాక్‌ (ఐస్‌ కాపడం) పెట్టాలో... మరే సందర్భంలో వేడి కాపడం అవసరమవుతుందో చూద్దాం. 

ఐస్‌ప్యాక్‌ ఎప్పుడంటే... గాయం తగిలిన చోట ఐస్‌తో అద్దడం వల్ల ఉపశమనం కలగడం అన్నది తాజాగాయాల విషయంలోనే ఎక్కువ. దెబ్బతగిలినప్పుడు ఆ ప్రాంతం ఎర్రబడుతుంది. వాపు వచ్చి ఆ ప్రదేశం కాస్త వేడిగా అనిపిస్తుంటుంది. అప్పుడు అక్కడ ఐస్‌ పెట్టడం వల్ల అక్కడి (లోకల్‌) ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఆ ప్రాంతంలోని రక్తనాళాలు సంకోచిస్తాయి. కొద్ది నిమిషాల తర్వాత అవే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. 

ఇలా రక్తనాళాల సంకోచ–వ్యాకోచాలను ‘లూయీస్‌–హంటింగ్‌ చర్య’ అంటారు. దీనివల్ల చిన్న రక్తనాళాలు వ్యాకోచించగానే దెబ్బతగిలినప్పుడు ఏర్పడ్డ మలిన పదార్థాలన్నీ రక్తంలో ఒక్కసారిగా కలిసి పలచ బారిపోతాయి. దాంతో వాపు తగ్గుతుంది. ఐస్‌ పెట్టడం వల్ల కోల్డ్‌ రిసెప్టార్స్‌ ఉత్తేజం చెంది ఎండార్ఫిన్స్, ఎన్‌కెఫలిన్స్‌ అనే ఉత్ప్రేరకాలు విడుదల అవుతాయి. దాంతో నొప్పి తగ్గుతుంది. ఐస్‌ వల్ల నరాల నుంచి వెళ్లే సంకేతాల వేగం (నర్వ్‌ కండక్షన్‌ వెలాసిటీ) తగ్గుతుంది. కండరాల బిగుతు కూడా తగ్గుతుంది. ఐస్‌ప్యిక్‌ అన్నది కనీసం 10–15 నిమిషాలు పెట్టాలి. ఐస్‌ క్యూబ్స్‌ను నేరుగా అద్దడం కంటే... టవల్‌లోగాని, లేదా ఏదైనా కవర్‌లోగాని పెట్టి ఐస్‌ప్యిక్‌ పెట్టవచ్చు.  

ఎప్పుడెప్పుడు మంచిదంటే... : ఆర్థరైటిస్‌ ఉన్నప్పుడు / వాపు, మంట వచ్చిన చోట (టెండర్‌పాయింట్స్‌లో) / తాజా గాయాలు (ఫ్రెష్‌ ఇంజరీస్‌) అయినప్పుడు. హాట్‌ ప్యాక్‌ (వేడికాపడం) ఎప్పుడంటే... సాధారణంగా దీర్ఘకాలికంగా వచ్చే నొప్పులూ, అలాగే నొప్పి ఒక చోటి నుంచి మరోచోటికి పాకుతున్నప్పుడు వేడికాపడం ద్వారా మంచి ఉపశమనం దొరుకుతుంది. ఈ వెచ్చదనం ప్రభావం చర్మం పైపొరలకే పరిమితం కాకుండా, కండరాల మీద కూడా ప్రభావం చూపుతుంది. 

వేడికాపడం వల్ల ఆ పరిసరాల్లో రక్తప్రసరణ వేగవంతమవుతుంది. దాంతో అక్కడ జీవక్రియల వేగం (మెటబాలిక్‌ రేట్‌) కూడా పెరుగుతుంది. వేడికాపడంతో కండరాలు రిలాక్స్‌ అవుతాయి. ఈ చర్యలన్నింటి వల్ల ఉపశమనం కలుగుతుంది. వేడికాపడం అన్నది కాస్త కాస్తగా కాపడం పెడుతూ 10–15 నిమిషాలు కొనసాగించాలి. వేడికాపడం బట్టను వేడి చేయడం ద్వారాగానీ, హాట్‌ వాటర్‌ బ్యాగ్‌తోగాని, ఎలక్ట్రిక్‌ హీట్‌ప్యాక్‌ పెట్టవచ్చు. 

ఎప్పుడెప్పుడు మంచిదంటే... :  నడుమునొప్పి / ఏదైనా పనిచేయడం ద్వారా వచ్చిన వెన్ను నొప్పి (మెకానికల్‌ బ్యాక్‌పెయిన్‌) / డిస్క్‌ప్లాప్స్‌ / సయాటికా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement