కేటుగాళ్లకే కేటుగాడు.. చోరకళలో మహాముదురు. గత ఏడాది కాలంలో200 విమానాలు ఎక్కి, 100 రోజుల పాటు దేశంలో వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. చేతివాటం చూపించి ఏకంగా లక్షలు కొట్టేశాడు. పోలీసులకు చుక్కలు చూపించాడు. కట్ చేస్తే.. పోలీసుల చేతికి చిక్కి కటకటాల వెనక్కి చేరాడు. అసలు స్టోరీ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతానికి చెందిన రాజేశ్ కపూర్ చోరీలోతనకు తానే తోపు అనుకున్నాడు. మొదట రైళ్లలో చోరీ చేసేవాడు. చాలాకాలానికి అక్కడ దొరికిపోవడంతో ఇక విమానాల్ని ఎంచుకున్నాడు. ఒకదాని తరువాత మరొకటి దర్జాగా లక్షల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను కొట్టేసేవాడు. కానీ ఎప్పటికైనా పాపం పండుతుంది అన్నట్టు. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ పోలీసుల పని అంత ఈజీగా అవ్వలేదు. ఢిల్లీ, హైదరాబాద్, అమృత్‌సర్ విమానాశ్రయాల్లోని కొన్ని గంటల సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసిన తర్వాత రాజేష్ కపూర్‌ను పట్టుకున్నట్టు వెల్లడించారు.
ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఉషా రంగరాణి అందించిన సమాచారం ప్రకారం, లగ్జరీ ప్రయాణికుడిలాగా పోజు కొడుతూ విమానాల్లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు, వృద్ధులును ట్రాప్ చేసి చోరీ చేయడంలో రాజేశ్ ఆరితేరిపోయాడు.కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో ప్రయాణించే వారిని టార్గెట్ చేసి చోరీలు చేసేవాడు. ప్రయాణికులతో మాటలు కలిపి వారికి సాయం చేస్తున్నట్టు నటించి నగలు, విలువైన వస్తువులు దోచేసేవాడు. ఏప్రిల్‌లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ మహిళ ఐజిఐ విమానాశ్రయం నుంచి యూఎస్‌కి కనెక్టింగ్ ఎయిరిండియా విమానంలో ఆమె బ్యాగు నుంచి రూ. 7 లక్షల విలువైన నగలు కొట్టేశాడు. అంతేకాదు అమెరికాకు చెందిన వర్జిందర్‌జిత్ సింగ్ కూడా ఇతని బాధితుడే. అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వచ్చి కనెక్టింగ్ ఫ్లైట్‌లో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళుతున్న వర్జిందర్‌జిత్ సింగ్ క్యాబిన్ బ్యాగ్ నుండి రూ. 20 లక్షల విలువైన వస్తువులు దొంగిలించాడు.
మోడస్ ఒపరాండీ
అమాయకంగా కనిపించే వృద్ధులు, మహిళా ప్రయాణీకులే ప్రధాన టార్గెట్. వారి బ్యాగేజీ డిక్లరేషన్ స్లిప్‌లోని సమాచారాన్ని దొంగచాటుగా పసిగడతాడు. బోర్డింగ్ గేట్ వద్ద వారితో మాటలు కలుపుతాడు. విమానంలో వారి పక్కకే తన సీటు మార్పించుకుంటాడు. వారి లగేజీ సర్దడానికి సాయం చేస్తున్నట్టు నటించి, సమయం చూసి అక్కడి నుంచి జారుకుంటాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు టికెట్ బుకింగ్ సమయంలో అతడు నకిలీ ఫోన్ నంబర్ ఇచ్చాడని పోలీసులు గుర్తించారు.
ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, చండీగఢ్, బెంగళూరు, ముంబై, అమృత్‌సర్ విమానాశ్రయాల్లోని అనేక మంది మహిళా ప్రయాణికుల బ్యాగుల్లోని దొంగిలించిన వస్తువులను కరోల్ బాగ్‌లోని శరద్ జైన్ అనే నగల వ్యాపారికి విక్రయించేవాడట. అంతేకాదు పహర్‌గంజ్‌లోని అతని ఇంటి నుండి పెద్ద మొత్తంలో బంగారం వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
గెస్ట్ హౌస్ ఓనర్
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఢిల్లీ పహర్‌గంజ్‌లో రాజేష్‌కి ‘రికీ డీలక్స్’ అనే గెస్ట్ హౌస్ ఉంది. ఇందులో మూడో అంతస్తులో అతడు నివసిస్తున్నాడు. మనీ క్స్చేంజ్ బిజినెస్‌తో పాటు ఢిల్లీలో మొబైల్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment