Pankaj Udhas: గజల్‌ గంధర్వుడు | Sakshi
Sakshi News home page

Pankaj Udhas: గజల్‌ గంధర్వుడు

Published Tue, Feb 27 2024 12:30 AM

Ghazal Singer Pankaj Udhas Passes Away After Prolonged Illness - Sakshi

‘ముజ్‌ కో యారో మాఫ్‌ కర్నా, మై నషేమే హూ’
‘థోడి థోడి పియా కరో’
‘షరాబ్‌ చీజ్‌ హి ఐసీ’
‘సబ్‌కో మాలూమ్‌ హై మై షరాబీ నహీ’
‘చాందీ జైసా రంగ్‌ హై తేరా’
‘కభీ సాయా హై కభీ ధూప్‌’
‘దివారోంసే మిల్‌ కర్‌ రోనా అచ్ఛా లగ్తా హై’
‘ఆయియే బారిషోం కా మౌసం హై’... ఒక్కటా రెండా పంకజ్‌ ఉధాస్‌ పేరు వినడగానే ఈ పేరుతో పాటు వినిపించే అమృత గుళికల్లాంటి గజల్స్, పాటలు ఎన్నో ఎన్నెన్నో.

గజల్స్‌ను ఎప్పుడూ వినే వాళ్లతో పాటు, ఎప్పుడూ వినని వాళ్లను కూడా తన అభిమానులుగా చేసుకున్నాడు గజల్‌ మేస్ట్రో పంకజ్‌ ఉధాస్‌. ఎప్పుడూ వినని వాళ్లు ఆయన గొంతు నుంచి ఒక్కసారి గజల్‌ వింటే మంత్రముగ్ధులయ్యే వారు. మళ్లీ మళ్లీ వినాలని తపించేవారు. ‘ఆహత్‌’ ఆల్బమ్‌తో ఆనందాశ్చర్యాలకు గురి చేసిన పంకజ్‌ గజల్‌ ప్రపంచంలో అజరామరమైన కీర్తిని సొంతం చేసుకున్నారు. సోమవారం ఆయన భౌతికంగా దూరమైనా ప్రతి శ్రోతలో, అభిమానిలో సజీవంగా నిలిచే ఉంటాడు.


గుజరాత్‌లోని జెట్‌పూర్‌లో పుట్టిన పంకజ్‌ ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడు. అన్న నిర్మల్‌ ఉధాస్‌తో ఆ ఇంట్లో గజల్‌ గజ్జె కట్టింది. మరో అన్న మన్‌హర్‌ ఉధాస్‌ బాలీవుడ్‌లో కొన్ని సినిమాలకు పాడాడు. తండ్రి కేశుభాయిదాస్‌ ప్రభుత్వ ఉద్యోగి. వైణికుడు. ప్రసిద్ధ వైణికుడు అబ్దుల్‌ కరీమ్‌ ఖాన్‌ దగ్గర దిల్‌రుబా నేర్చుకున్నాడు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఇల్లు ఒక సంగీత పాఠశాలలాగ ఉండేది. వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాల పాటల నుంచి గజల్స్‌ వరకు ఆ ఇంట్లో ఎన్నో వినిపించేవి. రాగాలు, స్వరఝరుల గురించి చర్చ జరిగేది. తనకు ఏమాత్రం సమయం దొరికినా పంకజ్‌ తండ్రి దిల్‌రుబా వాయించేవాడు.

దిల్‌రుబా నుంచి వచ్చే సుమధుర శబ్దతరంగాలు పంకజ్‌ను సంగీతం వైపు నడిపించాయి. ‘చక్కగా స్కూలు పాఠాలు చదువుకోకుండా ఈ సంగీత పాఠాలు నీకు ఎందుకు నాయనా’ అని తండ్రి మందలించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదీ తెలియదుగానీ గజల్స్‌ గురించి, దిల్‌రుబాపై వినిపించే రాగాల గురించి సందేహాలు అడిగినప్పుడు కుమారుడి సంగీతోత్సాహానికి ఆ తండ్రి మురిసిపోయేవాడు.

ఒక్క సందేహం అడిగితే మూడు సమాధానాలు చెప్పేవాడు. అంతేకాదు ముగ్గురు కుమారులను రాజ్‌కోట్‌(గుజరాత్‌)లోని‘సంగీత్‌ అకాడమీ’ లో చేర్పించాడు. ఆ కళాశాలలో తబాలా వాయించడం నేర్చుకున్న పంకజ్‌ గులామ్‌ ఖదీర్‌ ఖాన్‌ సాహెబ్‌ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు. డిగ్రీ కోసం ముంబైలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజీలో చేరిన పంకజ్‌ ‘క్లాస్‌లో సైన్స్‌ పాఠాలు’  కాలేజీ తరువాత శాస్త్రీయ సంగీత పాఠాలపై శ్రద్ధ పెట్టేవాడు.

తొలిసారిగా ‘కామ్నా’ (1972) అనే సినిమాలో పాడాడు పంకజ్‌. ఆ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ గాయకుడిగా పంకజ్‌కు మంచి పేరు వచ్చింది. అయితే ఈ మంచి పేరు తనకు వెంటనే మరో అవకాశాన్ని తీసుకు రాలేదు. ‘ఇది కూడా మంచికే జరిగింది. పంకజ్‌కు  బోలెడు అవకాశాలు వచ్చి ఉంటే తనకు అత్యంత ఇష్టమైన గజల్స్‌కు అనివార్యంగా దూరం కావాల్సి వచ్చేది’ అంటారు పంకజ్‌ అభిమానులు.

అవకాశాల సంగతి ఎలా ఉన్నా పంకజ్‌లో గజల్స్‌పై ఆసక్తి అంతకంతకూ పెరుగుతూనే పోయింది. ‘ఉద్యోగం చెయ్‌ లేదా వ్యాపారం చెయ్‌’ లాంటి సలహాలు అదేపనిగా వినిపిస్తున్న కాలంలో ఒక అద్భుత అవకాశం తనను వెదుక్కుంటూ వచ్చింది. అమెరికా, కెనడాలలో పది నెలల పాటు ఉన్న పంకజ్‌ అక్కడ ఎన్నో గజల్‌ కచేరీలు చేశాడు. ‘వాహ్వా వాహ్వాల’తో కూడిన ప్రేక్షకుల చప్పట్లు అతడి ప్రతిభను ప్రశంసించే సర్టిఫికెట్‌లు అయ్యాయి. ఇండియాకు డబ్బులతో కాదు ఉత్సాహంతో... ఆత్మవిశ్వాసంతో వచ్చాడు.

‘గజల్స్‌’ కోసమే ఉర్దూ నేర్చుకున్నాడు పంకజ్‌. గజల్స్‌ గానంలో మరింత పట్టు సాధించాడు. పంకజ్‌ ఉధాస్‌ అనే శబ్దం వినబడగానే ‘గజల్‌’ అనేది అతడి పేరు ముందు వచ్చి మెరిసేది.
1980లో తొలి గజల్‌ ఆల్బమ్‌ ‘ఆహత్‌’ను తీసుకువచ్చాడు. ఈ గజల్‌ ఆల్బమ్‌ తనకు తీసుకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. పదేళ్ల పోరాటం తరువాత పంకజ్‌ తొలి ఆల్బమ్‌ అనూహ్యమైన విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి 50 వరకు ఆల్బమ్‌లను తీసుకువచ్చాడు.

మ్యూజిక్‌ ఇండియా 1987లో లాంచ్‌ చేసిన పంకజ్‌ ‘షా గుఫ్తా’ మన దేశంలో కంపాక్ట్‌ డిస్క్‌పై రిలీజ్‌ అయిన తొలి ఆల్బమ్‌. ఇక సినిమాల విషయానికి వస్తే ‘ఘాయల్‌’ సినిమా కోసం 1990లో లతా మంగేష్కర్‌తో కలిసి మెలోడియస్‌ డ్యూయెట్‌ పాడాడు. ఇక ‘నామ్‌’ సినిమాలో ‘చిఠ్ఠీ ఆయీ హై’ పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట సూపర్‌ హిట్‌ అయిన తరువాత అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని పంకజ్‌ ఎప్పుడూ అనుకోలేదు.

ఆచితూచి నిర్ణయం తీసుకునేవాడు. రాశి కంటే వాసికి ప్రాధాన్యత ఇచ్చాడు. బహుశా ఇలాంటి విలువలే సంగీత చరిత్రలో అతడికి సమున్నత స్థానం ఇచ్చాయి. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌ కోసం ‘ఆదాబ్‌ అర్జ్‌ హై’ టాలెంట్‌ హంట్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించాడు పంకజ్‌. సినిమా కోసం పాడినా, నటించినా, టీవీ షోలు నిర్వహించినా గజల్స్‌పై తనకు ఉన్న ప్రత్యేక ప్రేమను ఎప్పుడూ కాపాడుకునేవాడు పంకజ్‌. అందుకే గజల్స్‌ను ప్రేమించే వాళ్ల మదిలో చిరస్థాయిగా, ఇంకో వందేళ్ళయినా సజీవంగానే ఉంటాడు.
 

పంకజ్‌ ఫేవరెట్‌ సాంగ్‌
రేడియోలో వినిపించే బేగం అఖ్తర్‌ గానామృతానికి చాలా చిన్న వయసులోనే ఫిదా అయ్యాడు పంకజ్‌. ‘ఆమెది ఒక వినూత్న స్వరం’ అంటాడు. భావాలు, భావోద్వేగాలు పాటలో ఎలా పలికించాలో ఆమె గొంతు వినే నేర్చుకున్నాడు. ‘యే మొహబ్బత్‌ తేరే అంజామ్‌ సే’ తనకు ఇష్టమైన పాట. ఎప్పుడు వినాలనిపించినా వినేవాడు. పద్దెనిమిది సంవత్పరాల వయసులో పంకజ్‌కు ప్రసిద్ధ గజల్‌ గాయకుడు మెహదీ హాసన్‌తో పరిచయం అయింది. చాలాకాలానికి యూకే టూర్‌లో స్నేహితుడి ఇంట్లో హాసన్‌ను కలుసుకున్నాడు. పంకజ్‌ గానప్రతిభకు కితాబు ఇచ్చాడు హాసన్‌. ఈ కితాబు కంటే హాసన్‌తో కలిసి పర్యటించడం, అతడి గొంతును గంటల తరబడి వినడాన్ని బాగా ఎంజాయ్‌ చేసేవాడు పంకజ్‌.

అదర్‌ సైడ్‌
హీరో జాన్‌ అబ్రహం పంకజ్‌కు వీరాభిమాని. విద్యాబాలన్, జాన్‌ అబ్రహమ్, సమీరా రెడ్డిలాంటి వారికి తన మ్యూజిక్‌ వీడియోలతో బ్రేక్‌ ఇచ్చాడు పంకజ్‌. ఎప్పుడూ సంగీత ప్రపంచంలో తేలియాడినట్లు కనిపించే పంకజ్‌కు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. స్కూల్, కాలేజీలలో బాగా ఆడేవాడు. పంకజ్‌ ఫేవరెట్‌ బౌలర్‌ బీఎస్‌ చంద్రశేఖర్‌. సంగీతం తప్ప ఏమీ తెలియనట్లు ఉండే పంకజ్‌ మ్యాచ్‌లకు సంబంధించి చేసే విశ్లేషణ ఆకట్టుకునేది.

‘మీరు క్రికెట్‌ వ్యాఖ్యాతగా బ్రహ్మాండంగా రాణించవచ్చు’ అని సరదాగా అనేవారు సన్నిహితులు. పంకజ్‌ను చూసీచూడగానే అంతర్ముఖుడు(ఇంట్రావర్ట్‌) అని అనిపిస్తుంది అయితే ఆయన చాలా సరదా మనిషి అని, చుట్టు పక్కల వాళ్లను తెగ నవ్విస్తారని చెబుతుంటారు సన్నిహితులు. డాక్టర్‌ కావాలనేది  పంకజ్‌ చిన్నప్పటి కల. అయితే సంగీతం అతడిని వేరే దారిలోకి తీసుకువెళ్లింది. డాక్టర్‌ కాకపోయినా ఆయన పాడే గజల్స్‌ ఔషధాలలాగే పనిచేసి మనసుకు స్వస్థతను చేకూరుస్తాయి.

ముక్కు సూటి మనిషి
సినిమా రంగంలో అవకాశాలు రావాలంటే ‘నిక్కచ్చిగా మాట్లాడే ధోరణి’ ఉండకూడదు అంటారు. అయితే పంకజ్‌ మాత్రం ‘నొప్పించక తానొవ్వక’ అన్నట్లుగా ఎప్పుడూ ఉండేవాడు కాదు. తన మనసులోని మాటను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేవాడు. బాలీవుడ్‌ మ్యూజిక్‌ ప్రస్తావన వస్తే.... ‘మ్యూజిక్‌ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. నాన్‌–ఫిల్మ్‌ మ్యూజిక్‌ను పట్టించుకోవడం లేదు. సర్వం బాలీవుడ్‌ అన్నట్లుగా ఉంది.

బాలీవుడ్‌లో తొంభై శాతం మ్యూజిక్‌ హిప్‌ హాప్, పంజాబీ, ర్యాప్‌. ఆర్డీ బర్మన్‌ క్లాసిక్స్‌లాంటివి ఇప్పడు వినే పరిస్థితి లేదు. పాటలు స్క్రీన్‌ప్లేలో భాగంగా ఉండడం లేదు. సినిమాను ప్రమోట్‌ చేయడానికి అన్నట్లుగా ఉంటున్నాయి. బాలీవుడ్‌లోని ఒకప్పటి స్వర్ణ శకం తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాలీవుడ్‌ గాయకుల్లో పాప్‌ సంగీత నేపథ్యం నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఖవ్వాలి ఎవ్వరికీ పట్టని కళ అయింది’ అని నిట్టూర్చేవాడు పంకజ్‌.

Advertisement
 
Advertisement