క్లూషియల్
రాత్రి ఒంటి గంట దాటింది. నగర శివారు ప్రాంతం అది. మరో ఇరవై మైళ్లు దాటితే కానీ సిటీ రాదు. చుట్టూ చిమ్మ చీకటి, నిర్మానుష్యమైన రహదారి. ఆ సమయంలో దయాళ్ అనే వ్యక్తి కారు బ్రేక్ డౌన్ అవ్వడంతో రోడ్డు పక్కన నిలబడి సహాయం కోసం చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ దారిలో కారు వస్తోంది. దయాళ్ చెయ్యి అడ్డం పెట్టి, లిఫ్ట్ అడిగాడు.
ఆ కారులో ఉన్న విక్టర్ కారు ఆపాడు. దయాళ్‌ను ఎగాదిగా చూశాడు. విక్టర్ ప్రవర్తన, అతని చూపులు చూసి దయాళ్ మనసులో ఏదో కీడు శంకించింది. అయినా వేరే దారి లేక దయాళ్ కారు ఎక్కాడు. కారు ముందుకు కదిలింది. సిటీకి మరో నాలుగు మైళ్లు ఉందనగా, ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో దయాళ్ శవమై తేలాడు.
ఈ మిస్టరీ మర్డర్ కేసు క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ అభిమన్యు ముందుకు వచ్చింది. అభిమన్యు విచారణ ప్రారంభించగా ఒక దిగ్భ్రాంతికరమైన నిజం తెలిసింది.
ఒక సైకో సీరియల్ కిల్లర్ వరుసగా ఇలాంటి హత్యలు చేస్తున్నాడు. నిర్మానుష్య ప్రాంతాల్లో వాహనాలు పాడైపోయి లిఫ్ట్ అడిగే అమాయకులను తన కారులో ఎక్కించుకోవడం, ఆపై వారిని దారుణంగా హత్య చేసి, అందినంత దోచుకుని పారిపోవడం అతని అలవాటు. అప్పటికే అతడు పలువురిని ఇలాగే బలి తీసుకున్నాడు. వారి వెహికల్స్ కలర్, నంబర్ ప్లేట్‌లు మార్చి నేరాలు చేయడం అలవాటు. సీరియల్ కిల్లర్‌ను ఎలాగైనా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని అభిమన్యు ఒక వ్యూహం పన్నాడు.
∙∙ 
అర్ధరాత్రి వేళ అభిమన్యు ఆ నిర్మానుష్యమైన ప్రాంతం దగ్గర నిలబడ్డాడు. పక్కనే అతని కారును బాయ్‌నెట్ తెరచి పెట్టాడు. రోడ్డు మీద నిలబడి ‘లిఫ్ట్... లిఫ్ట్’ అని దారినపోయే వాహనాల వారిని అడుగుతున్నాడు.
కొద్దిసేపటికి చీకటిని చీల్చుకుంటూ ఒక కారు వచ్చింది. అభిమన్యు వంక, బాయ్‌నెట్ తెరిచి వున్న ఖరీదైన కారు వంక, అభిమన్యు చేతికి ఉన్న బంగారు బ్రాస్లెట్ వంక చూస్తూ ‘లిఫ్ట్’ కావాలా అని అడుగుతూనే డోర్ తెరిచాడు.
కారు కొంత దూరం వెళ్లగానే అభిమన్యు కారులో ఒక వింత వాసనను గమనించాడు. అది మనుషులను స్పహ తప్పి పడిపోయేలా చేసే ఒక రకమైన పెర్ఫ్యూమ్ (మత్తుమందు) అని అతడు గ్రహించాడు. ముందే అప్రమత్తంగా ఉన్న అభిమన్యు, తన వద్ద ఉన్న ప్రత్యేకమైన యాంటీ–గ్యాస్ మాస్క్ సహాయంతో ఆ మత్తు మందు ప్రభావం పడకుండా జాగ్రత్తపడ్డాడు. స్పృహ తప్పిపోయినట్టు సీటుపై పడిపోయాడు.
∙∙
ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న పొదల్లో కారు ఆపాడు.
అభిమన్యు పూర్తిగా స్పృహ కోల్పోయాడని విక్టర్ నమ్మాడు. కారును పక్కకు ఆపి, తన సీటు కింద ఉన్న పదునైన కత్తిని తీశాడు. అభిమన్యును బయటకు లాగాడు. కత్తిని అభిమన్యు కంఠం దగ్గర పెట్టాడు.
‘హలో మిస్టర్ విక్టర్ హౌ ఆర్యూ?’ అంటూ కళ్ళు తెరిచాడు ఇన్‌స్పెక్టర్ అభిమన్యు.
విక్టర్ షాకయ్యాడు. అప్పటికే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
‘లిఫ్ట్ పేరుతో మనుషుల ప్రాణాలు తీసి, వాళ్ళ వెహికల్స్‌ను కూడా నీ నేరాలకు వాడుకుంటూ, చిట్టచివరికి అదే వెహికల్‌లో, అదే లిఫ్ట్ ఇస్తూ దొరికిపోయావు’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ అభిమన్యు అతడిని పోలీసులకు అప్పగిస్తూ.
ఏ మాత్రం భయం లేకుండా చిన్నగా నవ్వుతూ ‘అది సరే... ఇంతకూ నన్నెలా పట్టుకున్నారు చెప్పనే లేదు?’ విక్టర్ అడిగాడు.
‘నీ ఆట కట్టించింది... నిన్ను పట్టుకోవడానికి క్లూ ఉంచింది... ఎవరో తెలుసా? జీపీఎస్ ట్రాకర్. దయాళ్ తన కారుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చాడు. అది తెలియని నువ్వు ఆ కారును తీసుకువెళ్లి కలర్ మార్చి... నంబర్ మార్చావు. నీ ప్రతి కదలిక జీపీఎస్ ట్రాకర్ ద్వారా తెలుస్తూనే వుంది. నిన్ను పట్టుకోవడానికి నేను కూడా ఒక అపరిచితుడుగా లిఫ్ట్ అడిగాను...’ అభిమన్యు చెప్పాడు.
‘ఓహ్... అయితే ఈసారి మరింత తెలివిగా మర్డర్ చేయాలన్నమాట...’ క్రూరంగా నవ్వుతూ అన్నాడు విక్టర్.
‘నువ్వు జైలులో నుంచి తప్పించుకున్నప్పుడు... నీకు శిక్ష పడకుండా ఉన్నప్పుడు కదా... అది కూడా ఈ అభిమన్యు ఇన్‌స్పెక్టర్‌గా లేనప్పుడు. నీకా ఛాన్స్ లేదు...’ చెప్పాడు అభిమన్యు.
‘సీరియల్ కిల్లర్‌ను పట్టుకున్నందుకు కంగ్రాట్స్... మీడియా ద్వారా మీరేమన్నా చెప్పదల్చుకున్నారా?’ మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ అభిమన్యు.
‘అర్ధరాత్రి వేళల్లో అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వడం ఎంత ప్రమాదకరమో, అలాగే ఎవరైనా అపరిచితులను నమ్మి లిఫ్ట్ అడిగి వాళ్ల వాహనాల్లో వెళ్లడం కూడా అంతే ప్రమాదకరం. ప్రాణాలు పోయాక బాధపడటం కంటే, ముందే జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. అంతే కాదు నేరస్తుల బారి నుంచి తప్పించుకోవడానికి టెక్నాలజీని కూడా వాడుకోవాలి.’ - శ్రీసుధామయి


