నాన్నకు ప్రేమతో..నాన్నకు ప్రేమతో.. | Fathers Day in most parts of the world | Sakshi
Sakshi News home page

నాన్నకు ప్రేమతో..నాన్నకు ప్రేమతో..

Jun 16 2026 12:52 AM | Updated on Jun 16 2026 10:03 AM

Fathers Day in most parts of the world

ప్రతి స్టేజీ మీద అవార్డ్‌ అందుకునే చేతుల వెనుక, ఆ చేతుల్ని చిన్నప్పుడు స్కూల్‌ గేట్‌ దగ్గర వదిలిపెట్టి, వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్న ఒక జత కళ్లు ఉంటాయి. ఆ కళ్ల పేరే నాన్న.  

ఆటగాడు స్టేడియంలో సిక్స్‌ కొడితే కెమెరా అతడి మొహం చూపిస్తుంది. కానీ గ్యాలరీలో సీట్‌ దొరక్క నిలబడి, ‘వాడు మా అబ్బాయిరా’ అని పక్కవాడి భుజం తడుతూ 
గర్వంగా చెప్పే మనిషిని చూపించదు. ఆ మనిషి నాన్న.

అమ్మాయి ఐ.ఏ.ఎస్‌ అయ్యి వార్తల్లోకి వస్తే, ‘మా ఊరి అమ్మాయి’ అని 
ఊరంతా సంబరపడుతుంది. కానీ ఆ అమ్మాయిని రాత్రిళ్లు దీపం కింద కూర్చోబెట్టి, తోడుగా కునికిపాట్లు పడుతూ కూచున్న నీడని మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఆ నీడ పేరు నాన్న.

నాన్న ‘లేదు’ అనే మాటని ఇంట్లో పిల్లల ముందు పలకడు. అడిగితే ఆయన జవాబు ఒక్కటే ‘తీసుకో నాన్నా’. నాన్న జేబుకి చిల్లు ఉంటుంది. కానీ కొడుకు పాకెట్‌ మనీకి లోటు ఉండదు. నాన్న చెప్పులు అరిగిపోతాయి, కానీ కూతురి స్కూల్‌ షూస్‌ కొత్తగా మెరుస్తూ ఉంటాయి.

నాన్న తన కలల్ని ష్యూరిటీగా ఇచ్చి, పిల్లల కలలకి డౌన్ పేమెంట్‌ కడతాడు.

పిల్లల విజయం వెనుక అమ్మ ఉంటుంది నిజమే. కానీ ఆ అమ్మ చేతిలో గరిటె ఆగకుండా తిప్పడం వెనుక, ఉదయం ఐదు గంటలకు లేచి సైకిల్‌ తొక్కుతూ డ్యూటీకి వెళ్లిన, ఫ్యాక్టరీలో ఓవర్‌టైం చేసిన, ఎండలో ఆటో నడిపిన ఒక మనిషి చెమట ఉంటుంది. 
ఆ మనిషి నాన్న.

ఫాదర్స్‌ డే జూన్  21న. ఈ సందర్భంగా సమాజంలో ఎందరో సామాన్య అసామాన్య నాన్నలను గుర్తు చేసుకుందాం.

రోజుకో నాన్నకి నమస్కరించుకుందాం.

ఫోటోలో కనిపించని, ఫ్లెక్సీలో పేరు లేని, అవార్డ్‌ అందుకోని నాన్నలందరికీ...  ఈ కాలమ్‌ అంకితం.

నాణెం కాదు ప్రాణం
గొంతెమ్మె కోరికలు కోరకు.. ఉన్నదాంట్లో సర్దుకో..అన్నమాటను చిన్నప్పుడు మనమంతా ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం. మరీ ముఖ్యంగా దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఈమాట సర్వసాధారణం.. ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని జష్‌పూర్‌ జిల్లా, కేసరపాత్‌ గ్రామంలో నివసించే బజరంగ్‌ రామ్‌ భగత్‌ది అలాంటి కుటుంబమే. 

అతను గుడ్లు, శెనగలు అమ్ముతూ వ్యవసాయం చేసుకునే ఒక సన్నకారు రైతు. అతని కుమార్తె చంపా భగత్‌ బీకామ్‌ చదువుతోంది. తనకేమో స్కూటీ నడపాలని, కాలేజ్‌కి వెళ్లాలని చాలా ఆశ. పదేపదే స్కూటీ కావాలని చంపా నాన్నని అడిగేది. కాని స్కూటీ ధర అక్షరాలా లక్ష. అంత డబ్బు భగత్‌ దగ్గర లేదు. 

అప్పు చేసే ధైర్యం లేదు. అలాగని కూతురు మనసుని నొప్పించాలనీ లేదు. అందుకే ప్రతిరోజూ వ్యాపారంలో మిగిలే పది, ఇరవై రూపాయల నాణేలను పోగు చేశాడు. అలా దాదాపు ఏడు నెలలు పోగు చేశాక కూతురుని వెంటబెట్టుకుని బైక్‌ షో రూమ్‌కి వెళ్లాడు. అక్కడ సంచుల నిండా ఉన్న నాణేలను తెరచి నేలమీద పోయడం చూసి సిబ్బంది ఆశ్చర్యపోయారు. 

సిబ్బంది దాదాపు మూడు గంటలపాటు నాణేలను లెక్కపెట్టగా నలభైవేలకు తేలింది. ఆ మొత్తాన్ని అక్కడ డౌన్‌ పేమెంట్‌గా కట్టి కుమార్తెకు స్కూటీని కొనిచ్చాడు. స్కూటీ నడపాలన్న ఆశను కుటుంబ ఆర్థిక స్థోమత సవాల్‌ చేసినా, కూతురు మీదున్న ఆ తండ్రి ప్రేమ పేదరికాన్ని జయించి చూపింది.

నాన్నేనెట్‌వర్క్‌
పిల్లల కోసం తండ్రులు ఎంతటి త్యాగానికైనా... కష్టానికైనా వెనుతీయరనడానికి ఇదో ఉదాహరణ. దక్షిణ కర్ణాటకలోని బల్లక్క గ్రామంలో నారాయణ అనే రైతు తన కూతురు చదువు కోసం వర్షాన్ని సైతం లెక్క చేయలేదు. గ్రామంలో నెట్‌వర్క్‌ లేకపోవడంతో నారాయణ కూతురు గ్రామం బయటకు వెళ్లి ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యేది. నెట్‌వర్క్‌కి తోడుగా ఒకరోజు ఊరిలో భారీ వర్షం కురిసింది. ఇప్పుడు క్లాసులకు హాజరు కావడం మరింత జటిలంగా మారింది. అయినా సరే తన కూతురు క్లాసులకు మిస్‌  కాకూడదని నారాయణ కూడా వచ్చి ఇలా గొడుగుపట్టుకుని నిలబడ్డాడు. 

ఒకవైపు కూతురు తడవకుండా చూసుకుంటూ మరోవైపు తను తడుస్తూ నిలుచున్నాడు. ఈ హృద్యమైన దృశ్యాన్ని చూసిన స్థానిక జర్నలిస్ట్‌ మహేష్‌ పుచ్చప్పాడి తన కెమెరాలో క్లిక్‌మనిపించి ట్విట్టర్‌లో పెట్టాడు. ప్రతి రోజూ సాయంత్రం 4గంటలకు నారాయణ తన కూతురు ఆన్‌లైన్‌ క్లాసుల కోసం ఇదే ప్రదేశానికి తీసుకువస్తున్నాడని, మారుమూల ప్రాంతంలో నెట్‌వర్క్‌ లేక ప్రజలు పడుతున్న అవస్థలకు ఇదొక ఉదాహరణ అంటూ పేర్కొన్నాడు.

స్విగ్గీ డాడీ
కొన్ని నెలల కిందట వైరల్‌ అయిన ఫొటో ఇది. స్విగ్గీలో పని చేస్తున్న ఓ వ్యక్తి తనతో పాటు కూతుర్ని కూడా తీసుకెళ్లాడు. ఓ అపార్ట్‌మెంట్‌లో డెలివరీ ఇచ్చాక కాస్త సమయం దొరికింది. అపార్ట్‌మెంట్‌ మెట్లు దిగుతూ ఓ చోటు చూసుకుని కూర్చుని పుస్తకం తీసి తన కూతురికి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. 

ఈ చక్కటి దృశ్యాన్ని ఎవరో ఫొటో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అంతే..కొన్ని గంటల్లోనూ వేలాది లైకులు, కామెంట్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. కూతురు కోసం కష్టపడుతున్న తండ్రిని శభాష్‌ అని మెచ్చుకుంటూ రియల్‌ హీరో స్విగ్గీ డాడీ అంటూ పోస్ట్‌లు చేశారు. తండ్రి అన్నవాడు ఎంత కష్టపడ్డా, ఎంత ఇబ్బంది పడ్డా అదంతా బిడ్డ కళ్లల్లో ఆనందం చూడ్డానికేనని, బిడ్డకి మంచి భవిష్యత్‌ ఇవ్వడానికేనని ఈ ఫొటో నిరూపించింది.  

నిర్వహణ : శ్రావణ్‌ జయ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement