పీఎఫ్‌ ఖాతాలో సర్వీస్‌ ఓవర్‌ల్యాప్‌.. ఇలా పరిష్కరించుకోండి! | EPF Service Overlap PF Withdrawal Solution | Sakshi
Sakshi News home page

పీఎఫ్‌ ఖాతాలో సర్వీస్‌ ఓవర్‌ల్యాప్‌.. ఇలా పరిష్కరించుకోండి!

Oct 14 2026 4:51 AM | Updated on Oct 14 2026 4:51 AM

EPF Service Overlap PF Withdrawal Solution

లీగల్‌

నేను పనిచేసిన పాత కంపెనీకి పలుమార్లు ఈ మెయిల్స్‌ పంపినా నా పీఎఫ్‌ ఖాతాలో సర్వీస్‌ ఓవర్‌ల్యాప్‌ సమస్య పరిష్కారం కాలేదు. దీనివల్ల పీఎఫ్‌ విత్‌డ్రాయల్‌ పరిమితులు తగ్గుతాయని, క్లెయిమ్‌ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. నేను ఉద్యోగం మారాలి అనుకుంటున్నాను. కొత్త ఉద్యోగం వచ్చేలోపు డబ్బులు అవసరమైతే పి.ఎఫ్‌. నుంచి విత్‌ డ్రా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? – లక్ష్మి, విజయవాడ

ఉద్యోగి ఒక సంస్థను విడిచిపెట్టి మరో సంస్థలో చేరినప్పుడు, పాత యజమాని ఉద్యోగ విరమణ తేదీని ఈపీఎఫ్‌ఓ రికార్డుల్లో సరిగా నమోదు చేయకపోవడం లేదా జాయినింగ్, రిజిగ్నిషన్‌ తేదీల్లో తప్పులు ఉండటం వల్ల సర్వీస్‌ ఓవర్‌ల్యాప్‌ సమస్య తలెత్తుతుంది. ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాలన్నీ ఒకే యూఏఎన్‌ కింద ఉన్నప్పటికీ, పాత ఖాతాలోని సొమ్ము బదిలీ కాకపోతే మొత్తం నిల్వను వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, ఓవర్‌ల్యాప్‌ ఉందనే ఒక్క కారణంతోనే ప్రతి బదిలీ క్లెయిమ్‌ తిరస్కరించబడుతుందని భావించకూడదు. నిజానికి ఈ.పి.ఎఫ్‌. సంస్థ ఇచ్చిన ఒక ఉత్తర్వులో ఓవర్లాప్‌ కారణంగా మాత్రమే తిరస్కరణ చేయబోమని పేర్కొన్నారు. క్లెయిమ్‌ పరిస్థితిని బట్టి ఈపీఎఫ్‌ఓ నిర్ణయం ఉంటుంది. మీరు ఈ సమస్యని తేలికగా పరిష్కరించుకోవచ్చు.

ముందుగా సభ్యుల ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లోని సర్వీస్‌ హిస్టరీని పరిశీలించి, తప్పుగా నమోదైన తేదీలను సరిచేయాలని పాత యజమానిని లిఖితపూర్వకంగా కోరాలి. స్పందన లేకపోతే సంబంధిత ్రపాంతీయ కార్యాలయానికి ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చు.

పీ.ఎఫ్‌ ఖాతాలను బదిలీ చేయడానికి ఈపీఎఫ్‌ఓ సభ్యుల పోర్టల్‌లోకి లాగిన్‌  అయి ‘‘ఆన్‌లైన్‌ సర్వీసెస్‌’’ కింద ‘‘వన్‌ మెంబర్‌’’ ఆపైన ‘‘వన్‌ ఈ.పి.ఎఫ్‌. అకౌంట్‌ ట్రాన్స్ఫర్‌’’ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. తర్వాత వెబ్‌సైట్‌లో నిర్దేశించిన బదిలీ ప్రక్రియను అనుసరించాలి. బదిలీ పూర్తయిందో లేదో పాస్‌బుక్‌లో పరిశీలించాలి. సర్వీస్‌ హిస్టరీలోని తప్పులను సరిచేయడంతో పాటు, పాతఖాతాలోని పీ.ఎఫ్‌. నిల్వ బదిలీ అయిందో లేదో నిర్ధారించుకోవాలి. అవసరమైతే ఈపీఎఫ్‌ఓ అధికారిక ఫిర్యాదు వ్యవస్థ ద్వారా సమస్యను ముందుకు తీసుకెళ్లవచ్చు.
- శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది, మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com కు మెయిల్‌ చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement