
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆట, పాటలతో బతుకమ్మను పూజిస్తారు. గుజరాతి, రాజస్థానీలు దుర్గాదేవిని పూజించే క్రమంలో దాండియా నృత్యాలు చేస్తారు.
దసరా నవరాత్రుల సందర్భంగా కొండాపూర్ శరత్ సిటీమాల్‌లోని స్నో కింగ్డమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దాండియా సంబురాలను ఒకే వేదికపై చేపట్టారు. ముంచు కొండలు, మంచుతో కప్పిన ప్యాలెస్‌లు, బ్లాక్ సీల్స్, ఇగ్లూ, ఓక్ చెట్లు, దృవపు ఎలుగుబంట్ల సెట్ల మధ్య ఈ ఉత్సవాలను ఆదివారం ప్రారంభించారు. ఇవి 11 రోజుల పాటు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
రెండో రోజు బతుకమ్మ ప్రత్యేకత..
బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. ఒక్కో రోజు ఒక్కో విశిష్టత కలిగి ఉంది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా జరుపగా, రెండో రోజు అటుకుల బతుకమ్మ నిర్వహిస్తారు. రెండో రోజు రంగు రంగుల పూలతో బతుకమ్మను తయారు చేసుకుని గౌరమ్మను తయారు చేసుకుంటారు.
అందులో గౌరమ్మను పెట్టి పూజిస్తారు. ఆరోజు అమ్మవారికి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం కూడా ఉంది. అందుకే అటుకులు బతుకమ్మ అని పేరు వచ్చింది. తెలంగాణ ప్రజల సంస్కృతికి అద్దం పట్టేలా బతుకమ్మ వేడుకలు జరుపుతారు.
రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరీదేవిగా భావించి మహిళలు జరుపుకునే పండుగే ఇది. తొమ్మిది రోజులపాటు ఈ వేడుకులు జరుగుతాయి. ఒకవైపు నవరాత్రులు, మరోవైపు బతుకమ్మను ఘనంగా జరుపుకొంటారు.
(చదవండి: సరదా పాటలు..దాండియా ఆటలు..!)