అప్పటికే చక్కగా స్థిరపడి మంచి ఉద్యోగం చేస్తోందామె. కానీ ఆలివ్ కలర్ యూనిఫాంపై మక్కువతో ఆర్మీలోకి వెళ్లాలనుకుంది. పెళ్లైన మహిళ సైన్యంలో చేరడమా అన్నారు అంతా..అయినా సరే వెనక్కి తగ్గలేదామె. ఆమె ఆర్మీకి అప్లై చేసినా ప్రతిసారి రిజెక్ట్ అవుతూనే వచ్చింది. కానీ చివరికి శారీరకంగా తాను ఎంత ధృఢమైనదో నిరూపించుకుని మరి..ఆర్మీలో అత్యున్న హోదాను దక్కించుకుంది. అంతేగాదు పెళ్లైనా కూడా మహిళలు అన్ని సాధించగలరు అని నిరూపించింది.
ఆ మహిళే అస్సాంకి చెందిన ద్విపన్నీత కలితా. పెళ్లైతే చాలామటుకు మహిళలు తమ ఇష్టాలను అన్నింటిని వదులుకుంటారు. కొందరు కెరీర్లను కూడా త్యాగం చేస్తుంటారు. కానీ కలితా ఆ మూసధోరణిని బద్ధలు కొట్టి..అందరి అంచనాలను తలకిందులు చేసేలా వివాహం తర్వాత మహిళలు నచ్చిన దాంట్లో కొనసాగగలరు అని నిరూపించింది. అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలో ఉన్న ధేకియాజులి అనే చిన్న పట్టణానికి చెందిన మేజర్ కలితా విదేశాల్లో చదువునభ్యసించన తొలి మహిళ.
ఆమె ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి 2015లో ఎయిమ్స్‌లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఢిల్లీలోని ఎమర్జెన్సీ ప్రసూతి విభాగాలలో సహా పలు ఆస్పత్రులలో పనిచేసింది. ఆమెకు కావాల్సిన మంచి ఉద్యోగం, స్థిరమైన ఆదాయం, గౌరవం తదితరాలన్ని ఉన్నాయామెకు. కానీ ఆర్మీ యూనిఫాం అంటే ఎనలేని ప్రేమ. ఆ నేపథ్యంలోనే 2019లో ఆర్మీ మెడికల్ కార్ప్స్ అధికారి డాక్టర్ చరంగ్ మేట్‌ను వివాహం చేసుకున్నారు. అలా ఆమెకు కూడా ఆర్మీలో చేరాలని ఇష్టం మరింత ఎక్కువైంది.
అలా ఆమె 2020లో వందమంది దరఖాస్తుదారులతో పోటీపడి..ఏకంగా వెయ్యి జంప్‌లు చేసి మరి కెప్టెన్(మెడికల్ ఆపీసర్)గా ఎంపికైంది. 30 ఏళ్ల పెళ్లైన మహిళా సైన్యంలో చేరడామా? అసాధ్యం అని పెదవుల విరిచిన వాళ్లే తలదించుకునేలా విజయం ఢంకా మోగించింది.
2023లో, మేజర్ కలితా ఆగ్రాలోని ఆర్మీ సెంటర్‌లో కఠినమైన ఏరియల్ శిక్షణను పూర్తి చేసి, పారాట్రూపర్ బ్యాడ్జ్‌ని పొందింది. అస్సాం నుంచి ఈ ఘనతను సాధించిన తొలి మహిళ ఆమె. ఈ జనవరి 2025లో మేజర్‌గా పదోన్నతి పొందింది. ఆమె ప్రతిష్టాత్మకమైన పారాచూట్ మెడికల్ రెజిమెంట్‌లో సేవలందిస్తూ..విమానాల నుంచి దూకుతూ యుద్ధ క్షేత్రాలలో వైద్య సంరక్షణను అందిస్తున్నారు.
సింపుల్‌గా చెప్పాలంటే సినిమాల్లో చూపించే సాహసోపేతమైన జీవితం ఆమెది. అస్సాం ఆరోగ్య శాఖమంత్రి సైతం మేజర్ ద్విపన్నీత కలితాపై ప్రశంసలజల్లు కురింపించడమే కాదు కలితాని ఫెమినా ఇండియా ముఖచిత్రంపై కనిపించడం చూసి చాలా గర్వంగా ఉందని మెచ్చుకున్నారు. కాగా కలితా ముప్పై ఏళ్లు అనేది ముగింపు కాదు ఆరంభం అని అంటోందామె.
ఇదీ చదవండి: Nana Patekar: 56 ఏళ్ల వయసులో ఒక్క రాత్రిలో ధూమపానం ఎలా మానేశారంటే..!


