
ఆ ఊర్లు ఎక్కడో కాదు మన ఇండియాలోనే...
ప్రస్తుత బిజీ రోజుల్లో ఏ ఊరి లోనైనా సరే వీధులన్నీ నిర్మానుష్యం అవ్వాలి అంటే కరోనా అన్నా రావాలి కర్ఫ్యూ అన్నా పెట్టాలి. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే అర్ధరాత్రుళ్లు కూడా పట్టపగల్ని తలపించేంత రద్దీ కనిపిస్తుంది. రాత్రి మొత్తం చేసే ఉద్యోగాలు పెరిగిపోవడంతో నైట్ లైఫ్ కూడా అందరికీ అలవాటై పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో... కొన్ని గ్రామాలు, పట్టణాలలో మాత్రం రాత్రి 8గంటల నుంచే వీథులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆ తర్వాత ఉదయం సూర్యోదయం అయే దాకా రోడ్ల మీద జనసంచారం కోసం భూతద్ధం పెట్టి వెదకాల్సిందే. అలాంటి ఊర్లు ఇంకా ఉన్నాయా అంటే ఉన్నాయి మరి. అది కూడా మన దేశంలోనే ఉన్నాయి.
తెల్లవారుఝామునే నిద్ర లేవడం, సూర్యుడి వెలుతురులోనే పనులన్నీ చక్కబెట్టుకోవడం, సూర్యాస్తమయం తోనే ఇల్లు చేరడం, చీకటి పడకముందే రాత్రి భోజనం పూర్తి చేసి నిద్రపోవడం...ఇలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి వింటే...అబ్బో అదెప్పుడో మన తాత ముత్తాతల కాలం నాటిదిలే అనుకుంటాం కానీ.. ఇప్పటికీ చిత్కుల్, కల్ప, తీర్థన్ స్పితి వంటి గ్రామాలలో అదే జీవనశైలి కనిపిస్తోంది. ఈ గ్రామాల పేర్లు బహుశా మనలో చాలామందికి తెలియక పోవచ్చు కానీ ఆయా గ్రామాల్లో జన జీవితం మన తాత ముత్తాతల కాలం నాటి జీవనశైలినే తలపిస్తుంది. ఇలాంటి గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి కాబట్టే... హిమాచల్ ప్రదేశ్‌ను స్లీపింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అక్కడి ప్రజలు అనుసరించే ప్రశాంతమైన జీవనశైలి తత్ఫలితంగా ఆస్వాదించే నాణ్యమైన నిద్ర నుంచే ఆ రాష్ట్రానికి ఈ పేరు వచ్చింది. ఈ రాష్ట్రం దాని సహజ సౌందర్యం, స్వచ్ఛమైన పర్వత గాలితో పాటు నిశ్చింతగా నడిచే గ్రామ జీవితానికి కూడా ప్రసిద్ధి చెందింది. రద్దీగా ఉండే నగరాల మాదిరిగా కాకుండా, ఇక్కడి జీవితం నిశ్శబ్దంగా విశ్రాంతిగా ఉంటుంది.
హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజలు చాలా సరళమైన దినచర్యను అనుసరిస్తారు. ఎక్కువ మంది పెందరాళే పడుకుని సూర్యోదయంతో మేల్కొంటారు. పగటిపూట పని చేస్తారు. సూర్యాస్తమయం తర్వాత, దుకాణాలు మూసి వేస్తారు. వీధులన్నీ బోసిపోయి నిశ్శబ్దంగా మారుతాయి, కుటుంబాలు ఇంటి లోపలే ఉంటాయి. చీకటి పడకముందే భోజనం చేస్తారు రాత్రి 8 నుంచి 9గంటల మధ్యలోనే నిద్రపోయే వీరి అలవాటు ‘స్లీపింగ్ స్టేట్‘ గా కిరీటాన్ని అందించింది.
హిమాచల్ ప్రదేశ్‌లో, ప్రజలు ప్రకృతికి దగ్గరగా జీవిస్తారు. పర్వత వాతావరణం, పుష్కలమైన సూర్యరశ్మి ప్రశాంతమైన వాతావరణం ప్రజలు విశ్రాంతిగా రోజువారీ దినచర్యను నిర్వహించుకునేలా సహాయ పడతాయి. కొండలలో నదులు గాలుల ప్రవాహంలాగే వారి జీవితాలు నెమ్మదిగా సున్నితంగా కదులుతుంటాయి. పర్యాటకులు తరచుగా బిజీగా ఉన్న నగర జీవితం నుండి విరామం తీసుకొని ప్రశాంతమైన గ్రామ వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఈ ప్రదేశాలను సందర్శిస్తారు.
అయితే ‘‘స్లీపింగ్ స్టేట్’’ అంటే ఆ ప్రదేశం అభివృద్ధిలో మందగమనంతో ఉందని కొందరు అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఈ పదం ప్రశాంతమైన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది తప్ప సోమరితనం లేదా అభివృద్ధి లేకపోవడం కాదు. భారతదేశంలో. హిమాచల్ ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ఆపిల్‌లను పండిస్తుంది సిమ్లా కిన్నౌర్ వంటి పట్టణాలు వాటి ఆపిల్ తోటలకు ప్రసిద్ధి చెందాయి. ఈ రాష్ట్రం పర్యావరణ హితంగా పేరుపడింది. భారతదేశంలో మొట్ట మొదటిసారిగా పొగ రహిత రాష్ట్రంగా మారిన రాష్ట్రం ఇదే.

పర్యావరణాన్ని కాపాడటానికి, ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక్కడి ధర్మశాల దలైలామా నివాసం. ఈ పట్టణం ప్రశాంతమైన ప్రదేశం భారతదేశంలో టిబెటన్ సంస్కృతి, బౌద్ధమతానికి ముఖ్యమైన కేంద్రం. దీనితో పాటే మనాలి నుంచి స్పితి వరకు పర్యాటకులు నగర జీవితం నుంచి విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించడానికి హిమాచల్‌ను ఎంచుకోవడానికి కారణాల్లో...ప్రకృతి అందాలతో పాటు నాణ్యమైన నిద్ర కూడా ఓ కారణం కావచ్చు.