ఏఐ కాలం 'మాయరోగం' | Cyberchondria doe snot allow people to be independent | Sakshi
Sakshi News home page

ఏఐ కాలం 'మాయరోగం'

Jun 28 2026 6:10 AM | Updated on Jun 28 2026 6:10 AM

Cyberchondria doe snot allow people to be independent

పన్యాల జగన్నాథదాసు

సైబర్‌కాండ్రియా

‘సైబర్‌కాండ్రియా’ మనుషులను కుదురుగా ఉండనివ్వడంలేదు. వ్యాధుల వల్ల వచ్చే బాధలను మించిన భయాలను రేకెత్తించి, కంటికి కునుకు పట్టనివ్వడంలేదు. ‘సైబర్‌కాండ్రియా’ బాధితులు తమ ఆరోగ్యంపై  లేనిపోని అనుమానాలతో డాక్టర్ల చుట్టూ తిరుగుతూ, పదేపదే రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకుంటూ బెంగతో కుదేలైపోతున్నారు. డాక్టర్లు వారించినా, మనసులోని శంకలు తీరక రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం; పెద్ద ఇబ్బందేమీ లేదని అనుభవజ్ఞులైన డాక్టర్లు నచ్చచెప్పినా, వినిపించుకోకుండా డాక్టర్లనే పదేపదే మార్చేస్తూ, లేని రోగాల ఆనవాళ్లు కనిపెట్టడానికి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం డబ్బు మంచినీళ్లలా ఖర్చుచేస్తున్నారు. వీరి కారణంగా ఉత్పాదకతకు భారీనష్టం వాటిల్లుతోంది. 

‘సైబర్‌కాండ్రియా’ సహా ఆరోగ్య సంబంధమైన రకరకాల మానసిక ఆందోళనల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా సుమారు 1 ట్రిలియన్‌ డాలర్లకుపైగా నష్టం వాటిల్లుతోందని ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) వంటి అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ‘కోవిడ్‌–19’  మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ‘సైబర్‌కాండ్రియా’ మరింతగా పెరిగింది. చిన్న చిన్న శారీరక లక్షణాలనే పెద్దగా అనుమానించడం; అందుబాటులో ఉన్న అన్ని రకాల వైద్యపక్రియల్లోనూ చికిత్స ప్రయోగాలు చేయడం; వైద్యులను తరచుగా మార్చడం; వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ప్రమాదకర సంకేతాలు ఏవీ లేనప్పటికీ పదేపదే పరీక్షలు చేయించుకోవడం; ఈ లక్షణాలతో బాధపడే ఉద్యోగులు తరచుగా విధులకు సెలవు పెట్టడం వంటివి చేస్తున్నారు. ‘సైబర్‌కాండ్రియా’ వల్ల విలువైన పనిగంటలకు, ఉత్పాదకతకు తీవ్రనష్టం వాటిల్లుతోంది.

కాస్త తలనొప్పిగా ఉన్నా, కొంచెం ఒళ్లు వెచ్చబడి జ్వరంగా ఉన్నా ఇదివరకటి జనాలు పెద్దగా కంగారు పడేవారు కాదు. తలనొప్పిగా ఉంటే నొవాల్జిన్‌ మాత్ర, జ్వరంగా ఉంటే పారాసిటమాల్‌ మాత్ర వేసుకుని, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేవారు. ఎప్పుడైనా అజీర్తిచేసి కడుపు గడబిడ చేస్తే, వంటింటి చిట్కాలు పాటించేవారు. అప్పటికీ నయం కాకుంటే, డాక్టర్‌ దగ్గరకు వెళ్లేవారు. ఇంట్లో చిన్నా పెద్దా ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా, ఇంట్లోని పెద్దలు అనుభవ వైద్యం చేసేవారు. ఇంటి వైద్యానికి కుదరని సమస్యలకైతే ఫ్యామిలీ డాక్టర్లు ఆపద్బాంధవుల్లా తగిన చికిత్స అందించేవారు. జబ్బూ జట్రా సర్వసాధారణంగా ఉన్నా, జనాలు వాటి గురించి బెంగ పెట్టేసుకోకుండా నిక్షేపంగా బతికేసేవారు. ఇప్పుడలా కాదు, ఒంటికి ఏ బాధ వచ్చినా వెంటనే ఏఐ వైపు చూస్తున్నారు. సర్వసాధారణంగా వచ్చే బాధలకు పెద్దపెద్ద వ్యాధులను ఊహించుకుని భయపడుతున్నారు.

తలనొప్పి వస్తే బ్రెయిన్‌ ట్యూమరేమోనని; కడుపునొప్పి వస్తే బొవెల్‌ క్యాన్సరేమోనని; దగ్గు వస్తే లంగ్‌ క్యాన్సరేమోనని; నడుంనొప్పి వస్తే డిస్క్‌ జారిపోయిందేమోనని అనుమానిస్తున్నారు. ఈ అర్థంలేని అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఇంటర్నెట్‌ అంతా జల్లెడ పట్టేస్తున్నారు. ఏఐ ముందు తమ సందేహాల చిట్టా విప్పుతున్నారు. ఇదంతా ఏఐ కాలం తెచ్చిన మాయరోగం. దీనికి అంతర్జాతీయ వైద్యనిపుణులు సైబర్‌కాండ్రియా అని పేరు పెట్టారు.

మొదటి స్థానంలో భారత్‌
కొన్ని ఘనతలకు సంబంధించి మొదటి స్థానంలో నిలవడం దేశానికి గర్వకారణంగా ఉంటుంది. కాని, కొన్ని ప్రతికూల అంశాల్లో మొదటి స్థానానికి చేరడం విచారించదగ్గ విషయమవుతుంది. డబ్ల్యూహెచ్‌ఓ సహా పలు అంతర్జాతీయ సంస్థలు వెల్లడించిన తాజా అంచనాల ప్రకారం ‘సైబర్‌కాండ్రియా’ బాధితుల్లో మన భారత్‌ మొదటి స్థానంలో నిలుస్తోంది. ‘సైబర్‌కాండ్రియా’ బాధితుల్లో ఎక్కువమంది చదువుకున్నవారు, పట్టణ, నగర ప్రాంతాలకు చెందినవారే ఉంటున్నారు. ‘సైబర్‌కాండ్రియా’ బాధితుల్లో మొదటి పది స్థానాల్లో ఉన్న దేశాల పరిస్థితి ఇదీ...

 
అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం ‘కోవిడ్‌–19’ కాలం నుంచి భారత్‌లో సైబర్‌కాండ్రియా బాధితుల్లో సుమారుగా 120% పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల అమెరికాలో 80%, బ్రిటన్‌లో 70%, ఇటలీలో 60%, స్పెయిన్‌లో 50% మేరకు పెరుగుదల నమోదైంది. ‘కోవిడ్‌–19’ మహమ్మారి ఫలితంగా జనాల్లో ఆరోగ్యం పట్ల అతిజాగ్రత్తలు, వాటితో పాటు ఆరోగ్య స్థితిగతులపై అర్థంలేని అనుమానాలు కూడా బాగా పెరిగాయి. 

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 560 కోట్ల ఇంటర్నెట్‌ యూజర్లు ఉంటే, వారిలో దాదాపు 190 కోట్ల మంది ఏదో ఒక స్థాయిలో ‘సైబర్‌కాండ్రియా’ బాధితులే! వీరిలో దాదాపు 55 కోట్ల మంది తీవ్రస్థాయిలో ‘సైబర్‌కాండ్రియా’ లక్షణాలతో బాధపడుతున్నారని ‘సైబర్‌కాండ్రియా సివియారిటీ స్కేల్‌’ ఆధారంగా అంతర్జాతీయ సంస్థలు వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. ‘సైబర్‌కాండ్రియా’ బాధితుల్లో ఎక్కువగా యువతరం వారే ఎక్కువగా ఉంటున్నారు. అంతర్జాతీయ లెక్కల ప్రకారం వివిధ వయసుల వారిలో ‘సైబర్‌కాండ్రియా’ బాధితుల వివరాలు...

ఈ వలయంలో చిక్కుకోకుండా ఉండాలంటే...
‘సైబర్‌కాండ్రియా’ విషవలయంలో చిక్కుకోకుండా ఉండాలంటే, ఇంటర్నెట్‌ వాడే చిన్నా పెద్దా అందరూ కొంత సంయమనంతో కూడిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వలయంలో చిక్కుకోకుండా ఉండటానికి ఏం చేయాలో, ఏం చేయకూడదో నిపుణులు చెబుతున్న సూచనలు ఇవీ...

చేయాల్సినవి
»  ఏఐని ప్రాథమిక సమాచారం కోసమే వాడాలి
» ఏఐ సమాచారాన్ని విశ్వసనీయ మార్గాల ద్వారా తనిఖీ చేసుకోవాలి    
»  శరీరంలో అసౌకర్యం కలిగితే ఆ లక్షణాలను వివరంగా రాసుకుని, వైద్యులను సంప్రదించాలి

చేయకూడనివి
» ఏఐ ఆధారంగా స్వీయ వ్యాధినిర్ధారణ తగదు
» ఏఐ ఆధారంగా స్వీయ వైద్యం ప్రారంభించవద్దు.
»   ఏఐ సమాచారం ఆధారంగా ప్రాణాంతక వ్యాధులు సోకినట్లుగా లేనిపోని భయాలు పెట్టుకోవద్దు.

వివిధ వయసుల వారిలో...
‘సైబర్‌కాండ్రియా’ మూలకారణం ఇంటర్నెట్‌– దానివల్ల అందుబాటులోకి వచ్చిన సోషల్‌మీడియా, ఏఐ ప్లాట్‌ఫామ్స్‌ అయినా, అంతర్జాతీయ అధ్యయనాలు వేర్వేరు వయసుల వారిలో వేర్వేరు కారణాలను ప్రధానంగా గుర్తించాయి. సోషల్‌ మీడియాకు కొత్తగా పరిచయమైన 13–17 ఏళ్ల వయసు వారిలో ఆరోగ్య సమస్యలపై అరకొర అవగాహన; శరీరంలో ఏవైనా తేడాలు కనిపిస్తే వెంటనే చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో వెదుకులాట సాగించి, అందులో దొరికే సమాచారం చదివి లేనిపోని భయాలు పెంచుకోవడం వల్ల ‘సైబర్‌కాండ్రియా’ బారిన పడుతున్నారు.

కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్లే 18–24 ఏళ్ల వయసు వారు మితిమీరి సోషల్‌ మీడియాకు అలవాటు పడటం, ఆరోగ్య సమస్యలపై ఇంటర్నెట్, ఏఐపై ఆధారపడటం వల్ల ‘సైబర్‌కాండ్రియా’ బాధితులవుతున్నారు. కొత్తగా కెరీర్‌ ప్రారంభించి, కెరీర్‌లో నిలదొక్కుకునే దశలో ఉన్న 25–44 ఏళ్ల వయసువారు తమ ఆరోగ్య సందేహాల కోసమే కాకుండా, కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలపై సమాచారం తెలుసుకోవడానికి సోషల్‌ మీడియా, ఏఐ ప్లాట్‌ఫామ్స్‌పై ఆధారపడుతున్నారు. వీటి ఆధారంగా పదేపదే వైద్యపరీక్షలు జరిపించుకోవడం, డాక్టర్లను సంప్రదించడం చేస్తున్నారు. 

డాక్టర్లు ఒకవేళ ఏమీ లేదని చెప్పినా, తృప్తిపడకుండా డాక్టర్లను తరచు మారుస్తున్నారు. ఇక 45–64 ఏళ్ల వయసు వారిలో చాలామందికి నిజంగానే కొన్ని ఆరోగ్య సమస్యలు మొదలై ఉంటాయి. వీటిలో బీపీ, డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉంటాయి. వీరు ఆరోగ్య సమస్యలపై తెలుసుకోవడానికి సోషల్‌ మీడియా, ఏఐ ప్లాట్‌ఫామ్స్‌లో వెదుకులాట సాగిస్తున్నా, డాక్టర్లపై కూడా కొంత నమ్మకం ఉంచుతున్నారు. అయితే, సోషల్‌ మీడియా, ఏఐ ప్లాట్‌ఫామ్స్‌లో దొరికే సమాచారం వల్ల గందరగోళానికి లోనై ఆందోళన పెంచుకుంటున్నారు.

చివరిగా 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధుల్లో ‘సైబర్‌కాండ్రియా’ తక్కువే! వీరిలో సంప్రదాయ పద్ధతులపై ఇంకా పూర్తిగా సడలిపోని నమ్మకమే ఇందుకు కారణం. ఈ వయసు వారిలో చాలా కొద్దిమంది మాత్రమే ఆరోగ్య సమాచారం కోసం సోషల్‌ మీడియా, ఏఐ ప్లాట్‌ఫామ్స్‌పై వెదుకులాట సాగిస్తున్నారు. అయినా, వీరిలో ఎక్కువమంది ఇంకా డాక్టర్లనే నమ్ముకుంటూ ఉండటం కొంత ఊరట.

ఏఐ వైద్యునికి ప్రత్యామ్నాయం కాదు
ఏఐలో ఎలాంటి సమాచారమైనా ఉండవచ్చు. అదంతా ఏఐకి మనుషులు ఇచ్చినదే! ఏఐలో ఏ అంశంపై వెదుకులాట సాగించినా, నిమిషాల్లోనే బోలెడంత సమాచారాన్ని మన ముందు పోగు పెడుతుంది. ఏఐ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నా, అది అనుభవం, నైపుణ్యం ఉన్న వైద్యులకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్య సమస్యల గురించి ఏఐలో వెదుకులాట సాగించేవారు ఈ సంగతిని గుర్తెరగాలి. ఏఐకి, నిపుణుడైన డాక్టర్‌కు తేడా చాలానే ఉంటుంది. ఆ తేడా ఏ స్థాయిలో ఉంటుందో కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం...

ఛాతీనొప్పి
ఏఐ
గుండెపోటు కావచ్చు
వైద్యుడు
రోగి వయసు, ఎత్తు, బరువు, జన్యు చరిత్ర తెలుసుకుంటారు. ఈసీజీలాంటి ప్రాథమిక పరీక్షలు జరిపి, పరిస్థితిని బట్టి వైద్యం చేస్తారు.

కడుపు ఉబ్బరం, మంట
ఏఐ
అల్సర్‌ కావచ్చు
వైద్యుడు
రోగి ఆహారపు అలవాట్లు, అరుగుదల పరిస్థితిని తెలుసుకుంటారు. ఇతర జీర్ణ సంబంధ కారణాలను పరిశీలించి, తగిన మందులు సూచిస్తారు.

కీళ్లనొప్పులు
ఏఐ
ఆర్థరైటిస్‌ కావచ్చు.
వైద్యుడు
నొప్పి ఉన్న ప్రదేశాన్ని స్వయంగా పరిశీలిస్తారు. ఆ భాగంలో కదలికలు ఎలాఉన్నాయో పరిశీలిస్తారు. తగిన మందులు సూచిస్తారు.

తలనొప్పి
ఏఐ
బ్రెయిన్‌ ట్యూమర్‌ కావచ్చు
వైద్యుడు
తలనొప్పి ఎప్పుడెప్పుడు వస్తోందో, ఏ పరిస్థితుల్లో వస్తోందో తెలుసుకుని, అవసరమైన వైద్యం చేస్తారు.

బరువు పెరుగుదల
ఏఐ
థైరాయిడ్‌ సమస్య కావచ్చు.
వైద్యుడు
రోగి జీవనశైలిని క్షుణ్ణంగా తెలుసుకుంటారు. రోగి ఆహారపు అలవాట్లు, ఇతర మందులు ఏవైనా తీసుకుంటున్నారా అనేది కనుక్కుని, తగిన చికిత్స చేస్తారు.

అలసట, నీరసం
ఏఐ
క్యాన్సర్‌ కావచ్చు
వైద్యుడు
రోగి నిద్ర, ఒత్తిడి, ఆహారం, అనీమియా, థైరాయిడ్‌ వంటి కారణాలను పరిశీలిస్తారు. కారణం తెలుసుకుని, తగిన చికిత్స అందిస్తారు.

గుండెదడ
ఏఐ
గుండెజబ్బు కావచ్చు
వైద్యుడు
రోగి నాడి పరిశీలిస్తారు. కెఫీన్‌ మోతాదు ఎక్కువైందేమో తెలుసుకుంటారు. అవసరం అనిపిస్తే ఈసీజీ చేయిస్తారు. అప్పుడు తగిన చికిత్స చేస్తారు.

బయటపడాలంటే..?
‘సైబర్‌కాండ్రియా’ నుంచి బయటపడటం కొంత కష్టమే అయినా, అసాధ్యం కాదని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌), బ్రిటన్‌లోని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌) నిపుణులు చెబుతున్న ప్రకారం ‘సైబర్‌కాండ్రియా’ బారిన పడినవారు శరీరంలో ఏ చిన్న అసౌకర్యం కలిగినా, వెనువెంటనే ఆన్‌లైన్‌లో వెదకడం, ఏఐ ద్వారా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయడం మానుకోవాలి. కచ్చితమైన సమాచారం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సహా పలు అంతర్జాతీయ వైద్య సంస్థల వెబ్‌సైట్లను చూడవచ్చు. 

ఆన్‌లైన్‌లో సమాచారం వెదుకులాట కోసం సమయం వృథా చేసుకుని, లేనిపోని భయాలు పెట్టుకునే బదులు సమీపంలో ఉన్న వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. మరీ ముఖ్యంగా ఆరోగ్య సమస్యలపై సోషల్‌ మీడియాలో పుంఖాను పుంఖాలుగా వచ్చే వీడియోలను చూడటం మానుకోవాలి. వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా, వైద్య చికిత్సల్లో వందశాతం ఫలితాలను ఆశించడం అత్యాశే అవుతుందని గ్రహించాలి. 

కొన్ని వ్యాధులకు ఇప్పటికీ శాశ్వత చికిత్స అందుబాటులో లేదన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. వైద్యంలో కూడా అనిశ్చితి సహజమే! దానిని ఆమోదించగలిగి ఉండాలి. క్రమం తప్పని వ్యాయామం, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా మానసిక ఆందోళనను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అప్పటికీ ఆందోళన తగ్గకుంటే, మానసిక వైద్య నిపుణులను సంప్రదించి, తగిన చికిత్స పొందాలి.

‘సైబర్‌కాండ్రియా’ విషవలయం లాంటిది. ఒకసారి మొదలైతే, అది ఆగకుండా ఆరోగ్యం పట్ల లేనిపోని భయానుమానాల చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. దీని నుంచి బయటపడటం కష్టమని అంతర్జాతీయ మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ చక్రం ఎలా మొదలవుతుందంటే?...


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement