
పెట్స్ పేరుకే పెంపుడు జంతువులు కానీ వాటిని సొంత మనుషుల్లా చూసుకునే వాళ్లే ఎక్కువ. వాటికి పేర్లు పెట్టి, పుట్టినరోజులు చేసి ఎంతో ప్రేమగా చూసుకుంటారు చాలామంది. ఇంటిలో పెట్స్‌ను పెంచుకోవడం మామూలే కానీ ఒక ఆఫీసులో స్ట్రెస్ రిలీవర్‌గా.. చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్‌గా ఒక ఉత్తమజాతికి చెందిన శునకాన్ని నియమించింది ఒక స్టార్టప్ కంపెనీ. అది ఎక్కడో కాదు... హైదరాబాద్‌లోనే.
ఆఫీసులో పని ఒత్తిడి సర్వసాధారణం. ఆ ఒత్తిడి నుంచి ఉద్యోగులను బయట పడేయడం ఎలా? ఆఫీస్‌లో రిక్రియేషన్ క్లబ్ పెట్టడం కన్నా ఓ మేలుజాతి శునకాన్ని రిక్రియేషన్ ఆఫీసర్‌గా నియమిస్తే కాస్త వెరయిటీగా ఉంటుంది కదా అని ఆలోచించింది ఆ స్టార్టప్ కంపెనీ. ఇంకెందుకాలస్యం.... వెంటనే డెన్వర్ అనే ఒక శునకాన్ని కంపెనీలో చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్‌గా నియమించేసింది. ఇంతకూ ఈ డెన్వర్ ఉద్యోగుల ఒత్తిడిని ఎలా తొలగించగలదు? సంతోషాన్ని ఎలా ఇవ్వగలదనే కదా సందేహం? అక్కడికే వద్దాం...
ఇదీ చదవండి: నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్ యోగాసనాలు
ఉద్యోగులందరి దగ్గరకూ వరసబెట్టి వస్తారు ఈ ఆఫీసర్‌గారు... అందరినీ ప్రేమగా పలకరిస్తారు. స్నేహపూరితంగా షేక్ హ్యాండ్ (సారీ... ఇక్కడ లెగ్ అనాలి కాబోలు) ఇస్తారు. వీలయితే తనతో ఆడుకోవడానికి రమ్మని బాల్ తెచ్చి ఇస్తారు. ఆడుకున్న వారికి ఆడుకున్నంత సంతోషం. అన్నట్టు గూగుల్ సీయీవో సుందర్ పిచాయ్ కూడా తన స్ట్రెస్ బస్టర్ అయిన పెంపుడు శునకాన్ని తనతో పాటు ఆఫీసుకు తీసుకువస్తారట. ఒత్తిడిగా అనిపించినప్పుడు దానితో ఆడుకుంటారట. మరో విషయం... డెన్వర్‌కు లింక్డ్ ఇన్‌లో ప్రొఫైల్ కూడా ఉంది.. ఫలానా కంపెనీలో చీఫ్ హ్యానీనెస్ ఆఫీసర్‌గా పని చేస్తున్నట్లుగా.. బాగుంది కదూ...
ఇంట్లో పెట్స్ ఉన్నవాళ్లు ఒత్తిడి లేకుండా.. సంతోషంగా ఉంటారని, ఎక్కువ పని చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు.. దానిని వాకింగ్‌కి తీసుకెళ్లడం, ఫుడ్ పెట్టడం వంటి వాటివల్ల బీపీ, షుగర్ వంటివి దరిచేరవట. అందుకే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను వారి పెట్స్‌తో సహా ఆఫీసుకు వచ్చేందుకు అనుమతిస్తున్నాయట! బాగుంది కదూ..