మేము ఒక ఫ్లాట్ కొందాము అనుకుంటున్నాము. అమ్మే వారి వద్ద నుండి రిజిస్టర్ అయిన దస్తావేజు (డాక్యుమెంట్) తీసుకొని చూడగా... రెండు డ్రాఫ్టింగ్ పోరపాట్లు ఉన్నాయి. స్పెల్లింగ్ తప్పులు పక్కనపెడితే పూర్తి వ్యతిరేకార్థంతో వచ్చే వాక్యాలు ఉన్నాయి. అలాగే సాధారణంగా ఉండే హక్కుల బదిలీ క్లాజ్ పూర్తిగా లేదు. అయితే పూర్తి అమ్మకపు ప్రతిఫలం చెల్లించబడినట్లు, రిజిస్ట్రేషన్ జరిగినట్లు, ఆస్తిని స్వాధీనం చేస్తున్నట్లు, కొనుగోలు దారులు యజమానులైనట్లు మాత్రం స్పష్టంగా పేర్కొనబడింది. ఇటువంటి పరిస్థితిలో టైటిల్ లోపభూయిష్టమైనదిగా పరిగణించాలా? ఇలాంటి తప్పులు దొర్లిన దస్తావేజు ఉన్నా... ఆస్తిని కొనచ్చా?
– రమ్యశ్రీ, సూర్యాపేట
ఇటువంటి పోరపాట్లు సాధారణంగా క్లెరికల్ లేదా డ్రాఫ్టింగ్ పోరపాట్లుగా పరిగణించబడతాయి. అవి మాత్రమే టైటిల్‌ను లోపభూయిష్టంగా చేయవు. అమ్మకపు దస్తావేజు మొత్తాన్ని పరిశీలించినప్పుడు అమ్మకం చేయాలనే ఉద్దేశ్యం, పూర్తి ప్రతిఫలం/నగదు స్వీకరించడం, స్వాధీనం అప్పగించడం, కొనుగోలుదారులు యజమానులైనట్లు స్పష్టంగా కనిపిస్తే, బదిలీ చట్టం (Transfer of Property Act, 1882) సెక్షన్ 54 ప్రకారం యాజమాన్య హక్కులు చెల్లుబాటుగా బదిలీ అయినట్లే పరిగణిస్తారు. సాధారణంగా ఉపయోగించే 'sells, conveys, transfers and assigns' అనే క్లాజ్ లేకపోవడం మాత్రమే అమ్మకాన్ని చెల్లనిదిగా చేయదు.
పూర్తి దస్తావేజు ఉద్దేశం ముఖ్యం. అయితే భవిష్యత్తులో ఆస్తి విక్రయం, బ్యాంకు రుణం లేదా టైటిల్ పరిశీలన సమయంలో అనవసర అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు సవరణ దస్తావేజు నమోదు చేయించుకోవడం మంచిది. తప్పనిసరి కాకపోయినప్పటికీ, వీలుంటే మీకు ఫ్లాట్ అమ్మ తలచిన వారిని సవరణ దస్తావేజు/రెక్టిఫికేషన్ డీడ్ చేయించమని అడగండి. అలా చేయకపోయినా, మరే ఇతరencumbrance ఇబ్బందులు లేకుంటే, మీరు ఆస్తిని కొనవచ్చు. మీరు రాయించుకోదగిన పత్రాలను మాత్రం ఒక అనుభవజ్ఞులైన అడ్వొకేట్‌ని సంప్రదించి మాత్రమే చేసుకోవటం ఉత్తమం.


