నిషేధిత భూముల జాబితాలోని ఆస్తుల యజమానుల ఇక్కట్లు
అమ్మడానికి, కొనడానికి వీల్లేక అవస్థలు
6 నెలలు కసరత్తు చేసి.. సరిగా అప్‌డేట్ చేయని రెవెన్యూ యంత్రాంగం
పాత జాబితాలోని భూములే కొత్త జాబితాలోకి డంప్
కోర్టు కేసుల్లో క్లియర్ అయిన భూములూ నిషేధిత జాబితాలోకి..!
యూఎల్‌సీ పరిధిలో ఉన్నాయంటూ రిజిస్ట్రేషన్లకు నిరాకరణ
నిరభ్యంతర పత్రాలు తెచ్చుకోవాలంటూ సబ్ రిజిస్ట్రార్ల సూచన
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో సమస్య
హెచ్‌ఎండీఏ, హుడా లేఅవుట్లు, పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు
విక్రయించిన చోట్లా అదే పరిస్థితి... రెవెన్యూ నిర్వాకంతో ప్రజల్లో
పెరుగుతున్న వ్యతిరేకత.. ప్రభుత్వ ఆదాయానికీ గండి
రాజధాని నడిరోడ్డున ఉన్న అమీర్‌పేటలో ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఓ అపార్ట్‌మెంట్ కట్టారు. అందులోని ఫ్లాట్లను పలువురికి విక్రయించారు. ఒక్కసారి కాదు కొన్ని ఫ్లాట్లు అయితే నాలుగైదు చేతులు మారాయి. ఎన్నిసార్లు క్రయవిక్రయాలు జరిగాయో అన్నిసార్లు సేల్‌డీడ్‌లు అయ్యాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు కట్టిన తర్వాత సబ్ రిజిస్ట్రార్లు కిమ్మనకుండా రిజిస్ట్రేషన్లు చేసేశారు. కానీ ఇప్పుడు అవే ఫ్లాట్లను అమ్మాలని వెళితే మీ అపార్ట్‌మెంట్ కట్టిన భూమి నిషేధిత జాబితాలో ఉందని, రిజిస్ట్రేషన్లు కావని చెబుతున్నారు. ఆ భూమిని క్రమబద్ధికరించుకున్న కాగితం తీసుకుని కలెక్టర్ వద్దకు వెళ్లి నిషేధిత జాబితా నుంచి తప్పించి రిజిస్ట్రేషన్‌కు రావాలంటూ సలహా ఇవ్వడంతో యజమానులు తలబాదుకుంటున్నారు.
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయేతర భూములు, ఆస్తులపై ‘అప్రకటిత నిషేధం’ అనే పిడుగు పడింది. హైకోర్టు ఆదేశాలతో జిల్లాల కలెక్టర్లు రూపొందించిన నిషేధిత జాబితా సామాన్య ప్రజలకు తిప్పలు తెచ్చి పెడుతోంది. అంతా సవ్యంగా ఉందనుకుని ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం వెళ్తున్న ప్రజలకు ఎదురుదెబ్బ తగులుతోంది.
సబ్ రిజిస్ట్రార్ల నుంచి తాము రిజిస్ట్రేషన్ చేయలేమనే సమాధానం వస్తోంది. ఎందుకు రిజిస్ట్రేషన్ చేయమని అంటున్నారో అర్థం కాక, ఏం చేయాలో పాలుపోక సదరు అమ్మకందారులు, కొనుగోలుదారులు అయోమయానికి గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఓ గ్రామంలో ఉన్న తన 3.26 ఎకరాల భూమిని అకారణంగా నిషేధిత భూముల జాబితాలో చేర్చారంటూ ఓ రిటైర్డ్ జడ్జే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆరు నెలల కసరత్తు..వీడని తలనొప్పి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిషేధిత భూముల జాబితా (22ఏ)ను సవరించలేదు. కోర్టులు మొట్టికాయలు వేసినా ఈ జాబితాలను రూపొందించడంలో రెవెన్యూ శాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. చివరకు హైకోర్టు చీవాట్లు పెట్టడంతో ఈ ప్రక్రియకు ప్రభుత్వం పూనుకుంది. ఇందుకోసం గత ఏడాది సెపె్టంబర్‌లో భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం (సీసీఎల్‌ఏ) నోటిఫికేషన్ ఇచ్చింది. ఆరునెలల పాటు జిల్లాల కలెక్టర్లు కసరత్తు చేసి సర్వే నంబర్లు, గ్రామాలు, మండలాలల వారీగా జాబితాను రూపొందించి ఫిబ్రవరిలో ప్రభుత్వానికి అందజేశారు.
ఈ జాబితాను వ్యవసాయ భూముల విషయంలో వెంటనే అమల్లోకి తీసుకురాగా, వ్యవసాయేతర భూముల విషయంలో మాత్రం కొంత జాప్యం జరిగింది. ఇబ్బడిముబ్బడిగా నిషేధిత జాబితాలోకి భూములను చేర్చారనే కారణంతో ఈ జాబితాను అమలు చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తటపటాయించింది. కానీ ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఎట్టకేలకు ఈ ఏడాది మేలో కొత్త నిషేధిత జాబితాను తమ సాఫ్ట్‌వేర్‌లోకి చేర్చింది. ఇప్పుడు ఆ జాబితా ప్రజలకు కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను మూటగడుతోంది. అంతేకాదు ప్రభుత్వ ఆదాయానికీ గండి కొడుతోంది.
40 ఏళ్లనాటి కాగితాలు కావాలంట..!
కొత్త నిషేధిత జాబితాను రూపొందించిన రెవెన్యూ శాఖ ఆ జాబితాలో నిషేధం తొలగిన భూములు సరిగా గుర్తించకుండా, అరకొర మార్పులతో సరిపెట్టిందనే విమర్శలున్నాయి. గతంలో తమ వద్ద ఉన్న జాబితానే దాదాపు యధాత«థంగా రెవెన్యూ యంత్రాంగం డంప్ చేసిందనే ఆరోపణలు విని్పస్తున్నాయి. మొత్తం మీద గత జాబితాలో నిషేధిత లిస్టులో ఉండి ఆ తర్వాత పలు మార్గాల ద్వారా క్లియర్ అయిన (ఆ జాబితా నుంచి బయటపడిన) భూములు కూడా మళ్లీ నిషేధిత జాబితాలోకి వచి్చపడ్డాయి. ముఖ్యంగా కోర్టుల ద్వారా పట్టాలుగా మారిన భూములు కూడా ఈ జాబితాలో చేరాయి. ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూముల జాబితాలో ఉండి ఆ తర్వాత రికార్డుల ఆధారంగా పట్టాలుగా మారిన భూములు కూడా ఇందులో చేరాయి.
మరో ప్రధాన సమస్య ఏమిటంటే..అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ప్రభుత్వానికి దఖలు పడిన భూములున్న సర్వే నంబర్లన్నింటినీ మళ్లీ నిషేధిత జాబితాలోకి చేర్చారు. ఈ భూములను లేదంటే అక్కడ కట్టిన అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లను, ఇళ్లను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేది లేదని సబ్ రిజిస్ట్రార్లు తెగేసి చెపుతున్నారు. గతంలో అయిన సేల్‌డీడ్‌లు చూపించినా ప్రయోజనం లేకుండా పోతోందని, ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నాటి కాగితాలు తీసుకురావాలని, లేదంటే ప్రభుత్వం నుంచి ఎన్‌వోసీ తీసుకురావాలని సబ్ రిజిస్ట్రార్లు అడుగుతున్నారని బాధితులు చెబుతున్నారు.
ఇక ప్రైవేట్ సంస్థలు నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీల్లోని ఫ్లాట్లు, విల్లాలే కాదు హెచ్‌ఎండీఏ, హుడాలాంటి ప్రభుత్వ సంస్థలు వేసిన లేఅవుట్ల సర్వే నంబర్లను కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో అక్కడ ఫ్లాట్లు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కూడా రిజిస్ట్రేషన్లు చేసేందుకు సబ్ రిజిస్ట్రార్లు నిరాకరిస్తుండడం గమనార్హం. ఈ విషయంలో తాము సొంతంగా ఏమీ చేయలేమని అంటూ ఇటీవల మేడ్చల్ జిల్లాలో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
మార్చకపోతే ముప్పు తప్పదు..!
రాష్ట్రంలో సుమారు 95 లక్షల ఎకరాల వరకు భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి. అయితే వీటిల్లో సక్రమంగా ఉన్న భూములను తొలగిస్తూ ఈ జాబితాను మార్చకపోతే రాష్ట్రంలోని వేల ఎకరాల్లో ఉన్న భూములు, ఆ భూముల్లో కట్టిన నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు నిలిచిపోతాయని అధికారులే అంటున్నారు. ఇప్పటికే ఒడిదుడుకుల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో రీసేల్ మార్కెట్ ఢమాల్ అవుతుందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అయితే ఈ సమస్య ఇప్పట్లో సమసిపోయేది కాదని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. మళ్లీ జాబితాను మార్చాలంటే క్షేత్రస్థాయికి వెళ్లి ఆ భూములను, వాటి రికార్డులను పరిశీలించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
సమస్యలు కలెక్టర్లకు చెబుతున్నాం
నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ఆ భూముల్లో కట్టిన ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయడం చట్టపరంగా సాధ్యం కాదు. అయితే ఈ జాబితా తయారీ అధికారాలు కలెక్టర్లకే ఉన్నాయి. జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన జాబితానే మా శాఖ సాఫ్ట్‌వేర్‌లో చేర్చాం. కొన్నిచోట్ల సమస్యలు వస్తున్నాయని తెలిసింది. వీటిని జిల్లా రిజిస్ట్రార్ల ద్వారా ఎప్పటికప్పుడు కలెక్టర్ల దృష్టికి తీసుకెళుతున్నాం.
– రాజీవ్‌గాంధీ హనుమంతు, ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ


