వినూత్న కృషి
పక్షుల గురించి మనకు ఎంత తెలుసు. సరిగ్గా అడిగితే పది పక్షుల పేర్లకన్నా ఎక్కువ చెప్పలేము. ఇక వాటి రెక్కల గురించి, ఈకల గురించి చెప్పగలమా? పక్షుల రెక్కలకు ఉండే ఈకలు వేరు... తోకకు ఉండే ఈకలు వేరు... శరీరంపై ఒక తీరున... దారిని కనిపెట్టేవి ఒక తీరున... ఈకల వెనుక ఇంత కథ ఉంది అంటారు ఈశా మున్షీ. బెంగళూరులో ఈమె పక్షిల ఈకల లైబ్రరీ నడుపుతున్నారు. అనేక జాతుల ఈకలను ప్రదర్శనకు పెట్టడం ద్వారా ఆ పక్షుల పరిరక్షణకు చైతన్యం కలిగిస్తున్నారు.
ఫెదర్ లైబ్రరీ వినూత్న కృషిపై కథనం.
‘ఈకను తీసేసినట్లు తీసేశాడు’ అని అంటూ ఉంటారు. కానీ ప్రతి ఈకకూ ఓ లెక్క ఉంటుంది అంటారామె. గాల్లో ఎగిరే ప్రతి పక్షి రెక్క వెనుకాల బోలెడన్ని విషయాలు దాగున్నాయని ఆమె కనిపెట్టారు. ఆ విషయాలను అందరికీ తెలిసేలా ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ రెక్క ఏ పక్షిది, దాని స్వభావం ఏమిటి, ఆ పక్షి ఏ జాతిది అనే సమస్త వివరాలు ఆమె వివరిస్తారు. ఆమే ఈశా మున్షీ.
ఈక ఆమెను తాకింది
2020లో కోవిడ్ మన దేశాన్ని వణికిస్తున్న కాలం. అహ్మదాబాద్‌లోని తన ఇంట్లో ఉన్న ఈశా మున్షీ పెంపుడు పిల్లి ఓ పక్షిని పట్టుకుంది. దాన్ని ఆమె విడిపించే క్రమంలో పక్షి రెక్కలు కొన్ని ఊడి కిందపడ్డాయి. తన చేతివేళ్ల కంటే చిన్నగా ఉన్న ఆ రెక్కలు ఆమెలో ఆసక్తిని రేపాయి. ఈ రెక్కల ఆధారంగా ఆ పక్షి వివరాలు గుర్తించే అవకాశం ఉందా అని ఆలోచించారు. తనకు తెలిసినవారిని అడిగారు. గూగుల్ చేసి చూశారు. కానీ ఎక్కడా సమాచారం దొరకలేదు.
తానే ఆ సమాచారాన్నే కనుక్కోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ అయిన ఆమె ఆర్నిథాలజీ (పక్షలు శాస్త్రం)కి సంబంధించి ఆన్ లైన్ కోర్సులో చేరారు. ఆ తర్వాత అక్కడే ఏఐకి పక్షుల శబ్దాలను నేర్పే ప్రాజెక్టులో చేరారు. పక్షుల మీదున్న ఆమె ఆసక్తి పెరుగుతూ మరిన్ని కొత్త విషయాలు తెలుసుకునేందుకు మార్గం ఏర్పడింది.
గ్రంథాలయం పెట్టాలన్న ఆలోచనతో
ఏడాది అనంతరం మరోసారి ఈశా ఆలోచన పక్షుల ఈకల వైపు మళ్లింది. అందరికీ పక్షుల గురించి తెలిసేలా పక్షుల ఈకల సేకరణ చేయాలని భావించారు. ఈ విషయాన్ని తన స్నేహితురాలితో పంచుకున్నారు. అదే రోజు రోడ్డుపై ఆ హూపీ పక్షి మరణించి కనిపించింది. తను అనుకున్నది మొదలుపెట్టడానికి ఇదొక సంకేతంగా ఆమె భావించారు.
దీక్షతో సాగుతూ
వాతావరణంలో ఇమడలేక, అనారోగ్య సమస్యలతో మరణించిన పక్షుల ఈకల్ని ఈశా సేకరించి, వాటి వివరాలతో వాటిని భద్రపరుస్తున్నారు. ఇదంతా అవసరమా అని ఎవరైనా ప్రశ్నిస్తే ‘పక్షులు మన జీవవైవిధ్యంలో భాగం. వాటి జీవితానికి రెక్కలు ప్రధానం. అటువంటి వాటిని సేకరించి, వాటి వివరాలను భద్రపరచడం ద్వారా వాటి సమస్యలను తెలుసుకోవచ్చు. వాటి గురించిన సమాచారాన్ని తరువాతి తరాల వారికి అందించవచ్చు’ అంటారు. ఈ ప్రయాణంలో ఎన్నోసార్లు అరుదైన పక్షుల్ని చూసే అవకాశం దక్కిందని సంబరంతో చెప్తున్నారు. బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సైన్సెస్‌లో పక్షుల విభాగానికి ఆమె గౌరవ పర్యవేక్షకురాలిగా ఉన్నారు.
లైబ్రరీగా మార్చి...
అటవీ సంరక్షణా చట్టాల ప్రకారం వ్యక్తిగతంగా ఎవరూ పక్షుల ఈకల్ని సేకరించేందుకు అనుమతి లేదు. అయితే ఒక ట్రస్టుగా ఏర్పడి, పక్షుల ఈకల సేకరణ చేయొచ్చని ఆమెకు అధికారులు సూచించారు. దీంతో రెండు నెలల్లోనే ఒక ట్రస్టు కింద ‘ఫెదర్ లైబ్రరీ’(పక్షుల ఈకల గ్రంథాలయం) బెంగళూరులో ప్రారంభించారు. ప్రస్తుతం జర్మనీ, అమెరికా దేశాల తర్వాత ఇటువంటి లైబ్రరీ కలిగిన దేశం భారత్ కావడం విశేషం. ఇక్కడ 160 రకాల పక్షుల ఈకలు, 400 పక్షుల అవశేషాలు, వాటి వివరాలు ఉంటాయి. లైబ్రరీలో పక్షుల్ని భద్రపరిచేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు ఈషా. దేశంలోని పర్యావరణవేత్తలే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా అనేకమంది ఈ లైబ్రరీకి వచ్చి, పక్షుల గురించి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఇక్కడిదాకా రాలేనివారు వెబ్‌సైట్‌ను సందర్శిస్తుంటారు.


