సేద్యం చేయడానికి సెంటు భూమి లేదు. రోగమో రొష్టో వచ్చినప్పుడు కాస్త సేద దీరుదామంటే పెద్దలు అందించిన ఆస్తులు కానీ, కూడబెట్టుకున్న కాసులు కానీ లేవు. అయితేనేం... ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. స్వయంకృషితో పేదరిక కష్టాలు దాటింది. ఎంతోమంది గ్రామీణ మహిళలు ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడేలా చేస్తోంది... ఆమె బిహార్‌కు చెందిన బీనాదేవి. ఆమె విజయ గాథను అవలోకిద్దాం.
బిహార్‌లోని ముంగేర్ జిల్లాకు చెందిన బీనాదేవి(Binadevi) ఒకప్పుడు కడు పేదరికాన్ని అనుభవించింది. తన నలుగురు పిల్లలకు భోజనం పెట్టడానికి ఎన్నో కష్టాలు పడింది. సాధారణంగా కష్టాలు చుట్టుముట్టినప్పుడు కన్నీటి సముద్రం తప్ప ఏమీ కనిపించదు. కాని బీనాదేవి ఒక శక్తిమంతమైన మార్గాన్ని చూసింది. అది తన భవిష్యత్‌ను మార్చిన మార్గం. తనను ‘ది మష్రూమ్ లేడీ’గా మార్చిన మార్గం.
ఆ మార్గం పేరు... పుట్టగొడుగుల పెంపకం.
తన ఇంటి ఇరుకైన గదిలోనే పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించింది బీనాదేవి. చాలా చిన్న స్థాయిలో మొదలైన పుట్టగొడుగుల పెంపకం గ్రామీణ సాధికారత ఉద్యమంగా మారింది. వందకు పైగా గ్రామాలలో వేలాది మంది మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది.ఒక కిలోవిత్తనాలతో తొలి ప్రయత్నం మొదలుపెట్టింది. మొదటి అడుగు అయితే వేసిందిగానీ పుట్టగొడుగుల పెంపకం అనుకున్నంత తేలిక కాదని అర్థమైంది. అందుకు శిక్షణ తీసుకోవడం తప్పనిసరని గ్రహించింది.
భాగల్‌పూర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ తీసుకుంది. తగిన పరిజ్ఞానంతో పుట్టగొడుగుల పెంపకంప్రారంభించిన బీనాదేవికి లాభాలను అందుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఒక పూట తింటే మరో పూట పస్తు అన్నట్లుగా ఉండే బీనాదేవి సంవత్సరానికి లక్షలు అర్జించే స్థాయికి చేరుకుంది. స్థిరమైన ఆదాయం వల్ల పిల్లలను బాగా చదివించింది. ఇప్పుడామె పెద్ద కుమారుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. విజయం తనకే పరిమితం కావాలనుకోలేదు బీనాదేవి. ఆ విజయాన్ని ఇతరులకు కూడా పంచాలనుకుంది. పుట్టగొడుగుల పెంపకంలో ఎంతోమంది మహిళలకు తానే స్వయంగా శిక్షణ ఇచ్చింది.
‘మహిళలు ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో వారి పట్ల గౌరవం పెరుగుతుంది. వారి కుటుంబజీవితం మెరుగు పడుతుంది’ అంటున్న బీనాదేవి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుంచి అభినందనలు అందుకుంది. ‘కిసాన్ అభినవ’ పురస్కారాన్ని అందుకుంది.
తిల్కారి గ్రామానికి చెందిన బీనాదేవికి పేదరికం కష్టాలు ఎన్ని ఉన్నా అపారమైన సంకల్పబలం ఉంది. ఆ బలమే ఆమెను స్ఫూర్తినిచ్చే మహిళ స్థాయికి తీసుకు
వెళ్లింది.
స్ఫూర్తిదాయకమైన బీనాదేవి గురించి ‘ఎక్స్’లో రాసింది కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ. ‘మష్రూమ్ మహిళ బీనాదేవి పుట్టగొడుగుల పెంపకంలో తాను విజయం సాధించడమే కాదు ఎంతోమంది గ్రామీణ మహిళలు విజయం సాధించేలా స్ఫూర్తిని ఇచ్చింది. సహకారాన్ని అందించింది’ అని రాసింది. బీనాదేవి పుట్టగొడుగుల పెంపకం దగ్గర మాత్రమే ఆగిపోలేదు. గ్రామీణప్రాంతాలలో సేంద్రియ వ్యవసాయం, అక్షరాస్యతపై ఉద్యమ స్థాయిలో పనిచేస్తోంది.


