breaking news
Munger district
-
ఓ ‘మష్రూమ్ లేడీ’ విజయగాథ
సేద్యం చేయడానికి సెంటు భూమి లేదు. రోగమో రొష్టో వచ్చినప్పుడు కాస్త సేద దీరుదామంటే పెద్దలు అందించిన ఆస్తులు కానీ, కూడబెట్టుకున్న కాసులు కానీ లేవు. అయితేనేం... ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. స్వయంకృషితో పేదరిక కష్టాలు దాటింది. ఎంతోమంది గ్రామీణ మహిళలు ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడేలా చేస్తోంది... ఆమె బిహార్‌కు చెందిన బీనాదేవి. ఆమె విజయ గాథను అవలోకిద్దాం.బిహార్‌లోని ముంగేర్ జిల్లాకు చెందిన బీనాదేవి(Binadevi) ఒకప్పుడు కడు పేదరికాన్ని అనుభవించింది. తన నలుగురు పిల్లలకు భోజనం పెట్టడానికి ఎన్నో కష్టాలు పడింది. సాధారణంగా కష్టాలు చుట్టుముట్టినప్పుడు కన్నీటి సముద్రం తప్ప ఏమీ కనిపించదు. కాని బీనాదేవి ఒక శక్తిమంతమైన మార్గాన్ని చూసింది. అది తన భవిష్యత్‌ను మార్చిన మార్గం. తనను ‘ది మష్రూమ్ లేడీ’గా మార్చిన మార్గం.ఆ మార్గం పేరు... పుట్టగొడుగుల పెంపకం.తన ఇంటి ఇరుకైన గదిలోనే పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించింది బీనాదేవి. చాలా చిన్న స్థాయిలో మొదలైన పుట్టగొడుగుల పెంపకం గ్రామీణ సాధికారత ఉద్యమంగా మారింది. వందకు పైగా గ్రామాలలో వేలాది మంది మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది.ఒక కిలోవిత్తనాలతో తొలి ప్రయత్నం మొదలుపెట్టింది. మొదటి అడుగు అయితే వేసిందిగానీ పుట్టగొడుగుల పెంపకం అనుకున్నంత తేలిక కాదని అర్థమైంది. అందుకు శిక్షణ తీసుకోవడం తప్పనిసరని గ్రహించింది.భాగల్పూర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ తీసుకుంది. తగిన పరిజ్ఞానంతో పుట్టగొడుగుల పెంపకంప్రారంభించిన బీనాదేవికి లాభాలను అందుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఒక పూట తింటే మరో పూట పస్తు అన్నట్లుగా ఉండే బీనాదేవి సంవత్సరానికి లక్షలు అర్జించే స్థాయికి చేరుకుంది. స్థిరమైన ఆదాయం వల్ల పిల్లలను బాగా చదివించింది. ఇప్పుడామె పెద్ద కుమారుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. విజయం తనకే పరిమితం కావాలనుకోలేదు బీనాదేవి. ఆ విజయాన్ని ఇతరులకు కూడా పంచాలనుకుంది. పుట్టగొడుగుల పెంపకంలో ఎంతోమంది మహిళలకు తానే స్వయంగా శిక్షణ ఇచ్చింది.‘మహిళలు ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో వారి పట్ల గౌరవం పెరుగుతుంది. వారి కుటుంబజీవితం మెరుగు పడుతుంది’ అంటున్న బీనాదేవి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుంచి అభినందనలు అందుకుంది. ‘కిసాన్ అభినవ’ పురస్కారాన్ని అందుకుంది.తిల్కారి గ్రామానికి చెందిన బీనాదేవికి పేదరికం కష్టాలు ఎన్ని ఉన్నా అపారమైన సంకల్పబలం ఉంది. ఆ బలమే ఆమెను స్ఫూర్తినిచ్చే మహిళ స్థాయికి తీసుకువెళ్లింది.స్ఫూర్తిదాయకమైన బీనాదేవి గురించి ‘ఎక్స్’లో రాసింది కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ. ‘మష్రూమ్ మహిళ బీనాదేవి పుట్టగొడుగుల పెంపకంలో తాను విజయం సాధించడమే కాదు ఎంతోమంది గ్రామీణ మహిళలు విజయం సాధించేలా స్ఫూర్తిని ఇచ్చింది. సహకారాన్ని అందించింది’ అని రాసింది. బీనాదేవి పుట్టగొడుగుల పెంపకం దగ్గర మాత్రమే ఆగిపోలేదు. గ్రామీణప్రాంతాలలో సేంద్రియ వ్యవసాయం, అక్షరాస్యతపై ఉద్యమ స్థాయిలో పనిచేస్తోంది. -
Bihar: మళ్లీ పోలీసులపై దాడి
బీహార్: బీహార్‌లో పోలీసులపై దాడులు ఆగడం లేదు. ముంగేర్ జిల్లాలో ఏఎస్ఐ సంతోష్ కుమార్ సింగ్ హత్యోదంతం మరువకముందే డయల్ 112 విభాగంలో పనిచేస్తున్న మరో పోలీసు కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో మరో కానిస్టేబుల్ గాయపడ్డారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం హవేలీ ఖడంగ్ర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫసియాబాద్లో ఆదివారం రాత్రి దొంగతనం ఆరోపణతో ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకుని పంచాయతీ భవనంలో బంధించి, ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకుని, ఆ యువకులను తమతో పాటు పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే గ్రామీణులు పోలీసులను అడ్డుకుంటూ, వాగ్వాదానికి దిగారు. ఈ నేపధ్యంలో పోలీసులపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో బబ్లూ రజక్ అనే పోలీసు గాయపడ్డారు. పరిస్థితి కాస్త సద్దుమణిగాక పోలీసులు ఆ ఇద్దరు యువకులను తమతోపాటు పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రాజధానిలో మహిళల రక్షణకు యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్ -
ప్రసాదం తిని 170 మందికి అస్వస్థత
పాట్నా: దైవ ప్రసాదం తిని 170 మంది అస్వస్థతకు గురైన ఘటన బిహార్ రాష్ట్రం ముంగర్ జిల్లా కోత్వన్ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహేశ్ కోడా అనే వ్యక్తి సోమవారం సాయంత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు. ఈ వ్రతానికి దాదాపు 250 మందిని ఆహ్వానించాడు. పూజాది కార్యక్రమాల అనంతరం అతిధులకు స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రసాదం తిన్న గ్రామస్తుల్లో చాలా మంది కడుపునొప్పి, తలతిరగడం, వాంతులు వంటి లక్షణాలతో బాధపడ్డారు. ఒక్కసారిగా ఇంత మందిలో లక్షణాలు బయటపడటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇద్దరు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, మూడు అంబులెన్స్‌లను ఆ గ్రామానికి పంపింది. ప్రాధమిక చికిత్స అనంతరం బాధితుల్లో చాలా మంది కోలుకున్నట్లు జిల్లా కలెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. మరో 80 మందికి చికిత్స కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు. అయితే, ఎవరూ ప్రాణాపాయ స్థితిలో లేరని ప్రకటించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రసాదమే అనారోగ్యానికి కారణంగా పేర్కొన్న అధికారులు ప్రసాదం శాంపిల్స్‌ను పరీక్ష నిమిత్తం లేబోరేటరీకి పంపారు. -
గంగనదిలో పడవ మునక: నలుగురు గల్లంతు
ముంగేర్ జిల్లాలో ఈ రోజు ఉదయం గంగానదిలో బోటు బోల్తా పడిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారని జిల్లా ఉన్నతాధికారి ఆదివారం వెల్లడించారు. సీతాచరణ్ నది ప్రాంతం నుంచి 24 మంది ప్రయాణీకులతో వస్తున్న బోటు బాబువా ఘాట్ వద్ద అదుపు తప్పి బోల్తా పడిందని చెప్పారు. అయితే గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. అందుకోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపినట్లు చెప్పారు. గల్లంతైన వారిలో ఏడాది వయస్సు గల చిన్నారి కాకుండా మరో నలుగురు ఉన్నారని ఉన్నతాధికారి వెల్లడించారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని చెప్పారు. అయితే ఆ మహిళలు పడవ మునిగిపోతుందన్న భయంతో నదిలో దూకారని తోటి ప్రయాణీకులు తెలిపారని ఉన్నతాధికారి వివరించారు.


