ఒకప్పుడు చనిపోవాలనుకున్నాడు..ఇవాళ ప్రపంచాన్నే చుట్టేసి రికార్డు..! | Benny Prasad: Musician Who Visited Every Country In The World | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు చనిపోవాలనుకున్నాడు..ఇవాళ ప్రపంచాన్నే చుట్టేసి రికార్డు..!

Jun 26 2026 12:49 PM | Updated on Jun 26 2026 1:06 PM

Benny Prasad: Musician Who Visited Every Country In The World

చదువులో రాణించలేకోపోయాడు..అడగడుగునా అవమానం, వైఫల్యమే. ఛీ ఈ బతుకు వద్దనుకున్నాడు..చివరికి దేవుడి స్రిప్ట్‌ మరోలా ఉంది. పాటే నీగమ్యం అంటూ అందులో రాణించేలా చేసింది. అక్కడితో ఆగక ప్రపంచ పర్యాటకుడిలా మారి మొత్తం ప్రపంచాన్నే చుట్టేశాడు. అది కూడా జస్ట్‌ ఆరేళ్లలోనే ఈ ఘనత సృష్టించిన తొలి పర్యాటకుడిగా నిలిచాడు. మనం ఒకటనుకుంటే..జీవితం మరోలా నడిపించి..విజేతగా నిలుపుతుంది అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ సంగీత కారుడు. 

బెంగళూరుకి చెందిన సంగీతకారుడు బెన్నీ ప్రసాద్‌ తన జీవితకాలంలోనే ఒక గొప్ప ప్రయాణ రికార్డుని ప్రదర్శించి నెట్టింట వైరల్‌గా మారాడు. మొత్తం 245 దేశాలు సందర్శించాడు. అందుకు నిదర్శనంగా ఆయా దేశాల స్టాంపులు, వీసాలతో సహా మొత్తం 16 భారతీయ పాస్‌పోర్ట్‌లను చూపించడం విశేషం. అందుకు సంబంధించిన సేకరణను రికార్డు చేసి మరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

ఆ వీడియోలో తన పాస్‌పోర్ట్‌ల జాబితా, అంటార్కిటికాతో సహా ఆరు ఖండాల ప్రవేశ స్టాంపులు, వాటిలోని వీసాల ముద్రలతో నిండిన పేజీలతో సహా విపులంగా చూపించాడు. తాను భారత దేశానికి చెందిన వాడినని, అతి తక్కువ సమయంలోనే ప్రతి దేశానికి వెళ్లానని చెబుతుండటం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. 

కేవలం ఆరేళ్ల, ఆరు నెలల, 22 రోజుల అంటార్కిటికాతో సహా సార్వభౌమ ఆధారిత 245 దేశాలకు వెళ్లాను అని వీడియో క్లిప్‌లో వెల్లడించాడు ప్రసాద్‌. అంతేగాదు కొన్ని దేశాలకు వీసా తోపాటు ఇతర పత్రాలు, అందుకోసం ఎదురైన సవాళ్ల గురించి కూడా సవివరంగా వివరించారు ప్రసాద్‌. 

స్వతహాగా సంగీతకారుడు కావడంతో సంగీత ప్రదర్శనలు ఇస్తూ మొత్తం 16 పాస్‌పోర్ట్‌లను వీసాలు, స్టాంపులు సునాయాసంగా సంపాదించాడు. అయితే ఇందుకు కొంత ఓపిక కూడా అవసరమని అన్నారు. నెటిజన్లు కూడా ఆ 16 పాస్‌పోర్ట్‌ల కట్టను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..ఇందుకు ఎన్ని పత్రాలు అవసరమయ్యాయో అని తలుచుకుంటేనే గుండెల్లో వణుకుపుడుతోందంటూ కామెంట్‌ చేస్తూ పోస్టుల పెట్టారు.

ఎవరీ బెన్నీ ప్రసాద్‌..
బెన్నీ ప్రసాద్ గిటారిస్ట్‌ కమ్‌ ప్రపంచ యాత్రికుడు. ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, సవాళ్ల గురించి తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. తాను 1975 ఆగస్టు 6న బెంగళూరులో జన్మించినట్లు పేర్కొన్నారు. కుటుంబంలో తన తరంలో అతనే మొదటివాడు కావడంతో, అతని భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుందట అతడి ఫ్యామిలీ. అయితే తన జీవితారంభం అంత బాగాలేదని, తను తీవ్రమైన ఆస్తమాతో బాధపడ్డానని, అందుకోసం కార్టిసోన్‌ స్టెరాయిడ్స్‌ వాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. దాని కారణంగా రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, 60% ఊపిరితిత్తుల నష్టం, నిరంతరం బలహీనపడే రోగనిరోధక వ్యవస్థ వంటి ఆరోగ్య సమస్యలు ఎదర్కొన్నానని అన్నారు. 

ఆ సమస్యలు ఇప్పటికీ తన ప్రాణానికి ముప్పుగానే ఉన్నాయన్నారు. అతడి పేరెంట్స్‌ తనను చదువులో బాగా రాణించాలని ఆశించారు. ఆ నేపథ్యంలోనే తనకు గణితం, సైన్సు నేర్పించే ప్రయత్నం చేశారని, కానీ అవన్నీ వృధా అయ్యాయని తెలిపారు. దాంతో అవమానం తట్టుకోలేక 16 ఏళ్ల వయసులో చనిపోవాలని అనుకున్నానని చెప్పుకొచ్చారు. అయితే తాను సంగీతం వైపుకి మళ్లడంతో తన జీవితమే మారిపోయిందన్నారు. 

అలా బెన్నీ సంగీత ద్వారా ప్రతి ఏడాది మొత్తం 40 నుంచి 50 దేశాలకు ప్రయాణిస్తూ వేలాది మందికి జీవితంపై ఆశను కలిగించే ప్రయత్నం చేస్తున్నట్లు తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. అంతేగాదు నాలాంటి వాడినే ఉపయోగపడేలా జీవితం మారేస్తే..మీ జీవితాలు ఎందుకు మారవు అని ప్రశ్నిస్తున్నాడు. అలాగే ఈ ప్రపంచంలో భగవంతుడే మార్చలేనంత చెడ్డవారు లేదా పాపాత్ములు కూడా ఎప్పటికీ ఉండరు అని గుర్తించుకోండి అని చెబుతుంటాడు బెన్నీ ప్రసాద్‌.  

 

(చదవండి: రూ. 4 కోట్ల జీతం వదిలేశాడు.. కట్‌ చేస్తే రూ. 21 కోట్లు సంపాదనతో..)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement