
నేడు పుస్తక ప్రేమికుల దినోత్సవం
జ్ఞాన దర్శిని.. పుస్తకం
మానవుని పురోగమనంలో పుస్తకాలది మహత్తర పాత్ర
పుస్తక పఠనంతోనే సంపూర్ణ పరిజ్ఞానం
ఆధునిక సాంకేతికతతో తగ్గుతున్న పుస్తక పఠనం
పుస్తక పఠనాన్ని ఖచ్చితం చేయాలంటున్న మేధావులు
కర్నూలు కల్చరల్: పుస్తక పఠనంతో సంపూర్ణ పరిజ్ఞానం సిద్ధిస్తుంది. పుస్తకాల అధ్యయనం ఒక తపన. తీరని విజ్ఞాన దాహం. పుస్తకాలకు పుస్తక ప్రియులకు ఉండే అనుబంధం బలీయమైంది. పుస్తకాన్ని తమ జీవితాన్ని ఆదర్శంగా ముందుకు నడిపించే నిజమైన స్నేహితుడిగా.. మార్గదర్శకుడిగా భావిస్తారు. కొత్త పుస్తకం వచ్చిందంటే ఇంట్లో గ్రంథాలయంలో ఉండాల్సిందే. ఆర్థిక స్తోమత లేక కొన్ని పుస్తకాలు కొనలేకపోయినా ఏ గ్రంథాలయంలోనో స్నేహితుల వద్దో సంపాదించి చదివేదాక వారికి నిద్ర పట్టదు. ఇలాంటి గొప్ప అనుబంధాన్ని పెంచుకున్న పుస్తక ప్రియుల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ‘పుస్తక ప్రేమికుల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. అయితే నేటి ఆధునిక సాంకేతి పరిజ్ఞానం పరుగుల్లో పుస్తక పఠనం బాగా తగ్గిపోయిందని.. ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుస్తక పఠనం పెంచేలా చర్యలు చేపట్టాల్సి ఉందని అభిప్రాయ పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలులో జిల్లా కేంద్ర గ్రంథాలయం ఒకటి, 58 గ్రంథాలయ శాఖలు, ఒకటి గ్రామీణ గ్రంథాలయం ఉంది. సుమారు 150 పుస్తక సంక్షిప్త కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు ఇతర గ్రంథాలయాల్లో 6,50,400 పుస్తకాలు ఉన్నాయి. కేంద్ర గ్రంథాలయంలో 10 వేల మంది, మిగతా వాటిల్లో 70 వేల మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. కేంద్ర గ్రంథాలయంలో ప్రతి రోజు సుమారు 450 మంది పఠనం చేస్తుంటారు.
విద్యార్థి దశలోనే అలవాటు చేయాలి
మేధావుల అనుభవాలకు అక్షర రూపం పుస్తకం. ఇవి పాఠకుల్లో జ్ఞానాన్ని, నైతిక విలువలను పెంపొందిస్తాయి. విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తూ మంచి మిత్రునిలా తోడుండి సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సహాయ పడతాయి. విద్యార్థులు సెల్‌ఫోన్లకు బానిసలుగా మారకుండా నిరంతరం సామాజిక మాధ్యమాల్లో మునిగిపోయి చుట్టూ ఉన్న మనుసులతో సంబంధాలు కోల్పోకుండా పుస్తకాలు కాపాడతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యార్థి దశ నుంచే పుస్తకాలు చదివించడం గ్రంథాలయాలకు తీసుకొని వెళ్లడం అలవాటు చేయాలి. – డాక్టర్ ఎం. హరికిషన్, ఉపాధ్యాయులు, బాలల కథా రచయిత
పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలి
గ్రంథాలయాల్లో అన్ని వయస్సుల వారికి అవసరమైన పుస్తకాలు లక్షల్లో అందుబాటులో ఉన్నాయి. పాఠ్యాంశాలకు సంబంధించినవే కాకుండా విజ్ఞానాభివృద్ధికి ఉపయోగపడే పుస్తకాలు చదివేలా విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి.జిల్లా కేంద్ర గ్రంథాయలంలో ఏసీ స్టడీ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చాం. పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించేందుకు తరచుగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన పోలీస్ ఉద్యోగ నియామకాల్లో గ్రంథాలయాన్ని సది్వనియోగం చేసుకున్న 13 మంది ఉద్యోగాలు సాధించారు. – కె. ప్రకాష్, కార్యదర్శి, జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ