Shradha Khapra: సలహాల అక్క | Sakshi
Sakshi News home page

Shradha Khapra: సలహాల అక్క

Published Tue, Aug 22 2023 12:31 AM

Apna College: Shradha Khapra Left the job and started YouTube and earned crores - Sakshi

శ్రద్ధా కాప్రాను అందరూ ‘మైక్రోసాఫ్ట్‌ వాలీ దీదీ’ అని పిలుస్తారు. శ్రద్ధ బంగారంలాంటి మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగాన్ని వదిలేసింది. ‘యువత కెరీర్‌ కోసం గైడెన్స్‌ అవసరం’ అని ‘అప్నా కాలేజ్‌’ పేరుతో ఓ యూట్యూబ్‌ చానల్‌ మొదలుపెట్టింది. రెండేళ్లలో 40 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్‌ అయ్యారు. మైక్రోసాఫ్ట్‌ జీతం కన్నా ఎన్నో రెట్ల ఆదాయం శ్రద్ధకు వస్తోంది. ఏ కోర్సు చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి లాంటి సలహాలు ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగినట్టు ఇవ్వడమే శ్రద్ధ సక్సెస్‌కు కారణం.

‘హరియాణలోని చిన్న పల్లెటూరు మాది. మా నాన్న గవర్నమెంట్‌ ఉద్యోగైనా నేను ఏం చదవాలో గైడ్‌ చేయడం ఆయనకు తెలియదు. టీచర్లు కూడా గైడ్‌ చేస్తారనుకోవడం అంత కరెక్ట్‌ కాదు. ఇప్పటికీ కాలేజీ స్థాయి నుంచి యువతకు తమ కెరీర్‌ పట్ల ఎన్నో డౌట్లు ఉంటాయి. వారికి గైడెన్స్‌ అవసరం. ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుని గైడ్‌ చేయాలి. నేను కొద్దోగొప్పో చేయగలుగుతున్నాను కాబట్టే ఈ ఆదరణ’ అంటుంది శ్రద్ధా కాప్రా.

ఈమెకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు ఈనాటి కాలేజీ విద్యార్థుల్లో. ముఖ్యంగా ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌లో. వీరంతా శ్రద్ధను ‘శద్ధ్రా దీదీ’ అని,‘మైక్రోసాఫ్ట్‌ వాలీ దీదీ’ అని పిలుస్తారు. ఆమె చేసే వీడియోలను వారు విపరీతంగా ఫాలో అవుతారు. ఆ వీడియోల్లో ఆమె చెప్పే సలహాలను వింటారు.

డాక్టర్‌ కాబోయి...
శ్రద్ధ తన బాల్యంలో టీవీలో ఒక షో చూసేది. అందులో డాక్టర్లు తాము ఎలా క్లిష్టమైన కేసులు పరిష్కరించారో చెప్పేవారు. ఆ షో చూసి తాను డాక్టర్‌ కావాలనుకుని ఇంటర్‌లో ‘పిసిఎంబి’ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్, బయాలజీ) తీసుకుంది. కాని జూనియర్‌ ఇంటర్‌ పూర్తయ్యే సరికి డాక్టర్‌ కావడం చాలా కష్టమని అర్థమైంది. అందుకే మేథ్స్‌వైపు దృష్టి సారించింది. ‘చిన్నప్పటి నుంచి రకరకాల పోటీ పరీక్షలు ఎక్కడ జరిగినా రాసేదాన్ని.

ఇంటర్‌ అయ్యాక ఎంట్రన్స్‌లు రాస్తే ర్యాంక్‌ వచ్చింది. కాని ఏ బ్రాంచ్‌ ఎన్నుకోవాలో తెలియలేదు. వరంగల్‌ ఎన్‌.ఐ.ఐ.టి.లో సివిల్‌కు అప్లై చేస్తే సీట్‌ వచ్చింది. సివిల్‌ ఎందుకు అప్లై చేశానో నాకే తెలియదు. అయితే దాంతో పాటు ఎన్‌.ఎస్‌.ఐ.టి. (నేతాజీ సుభాష్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, ద్వారకా)లో కంప్యూటర్‌ సైన్స్‌ అప్లై చేస్తే ఆ సీటు కూడా వచ్చింది. దీనికంటే అదే మెరుగనిపించి కంప్యూటర్‌ సైన్స్‌ చదివాను’ అని తెలిపింది శ్రద్ధ.

ఉద్యోగం, టీచింగ్‌
చదువు చివరలో ఉండగానే హైదరాబాద్‌ మైక్రోసాఫ్ట్‌లో ఇన్‌టెర్న్‌ వచ్చింది శ్రద్ధకు. అది పూర్తయ్యాక ఉద్యోగమూ వచ్చింది. అయితే శ్రద్ధ ఇన్‌టెర్న్‌ చేస్తున్నప్పటి నుంచే గచ్చిబౌలిలో కంప్యూటర్‌ కోర్సులను బోధించసాగింది. ఉద్యోగం వచ్చాక కూడా కంప్యూటర్‌ కోర్సులకు ఫ్యాకల్టీగా పని చేసింది.

‘ఉద్యోగంలో కంటే ఎవరి జీవితాన్నయినా తీర్చిదిద్దే బోధనే నాకు సరైందనిపించింది. అదే సమయంలో యూట్యూబ్‌ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులకు పాఠాలు చెప్పడం, కోర్సులు తెలియచేయడం, వారి స్కిల్స్‌ పెరిగేలా గైడ్‌ చేయడం అవసరం అనుకున్నాను. మైక్రోసాఫ్ట్‌లో నాది మంచి ఉద్యోగం. కాని ఏదైనా కొత్తగా చేయాలనుకోవడం కూడా మంచిదే అని జాబ్‌కు రిజైన్‌ చేశాను’ అంది శ్రద్ధ.

అప్నా కాలేజ్‌
శ్రద్ధ ‘అప్నా కాలేజ్‌’ పేరుతో యూట్యూబ్‌ చానల్‌ తెరిచింది. ఇంటర్‌ స్థాయి నుంచి విద్యార్థులకు ఏయే కోర్సులు చదివితే ఏం ఉపయోగమో, ఏ ఉద్యోగాలకు ఇప్పుడు మార్కెట్‌ ఉందో, ఆ ఉద్యోగాలు రావాలంటే ఏ కోర్సులు చదవాలో తెలిపే వీడియోలు చేసి విడుదల చేయసాగింది. 2020లో ఈ చానల్‌ మొదలుపెడితే ఇప్పుడు 40 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు తయారయ్యారు.

కోట్లాది వ్యూస్‌ ఉంటాయి. అందుకు తగ్గట్టుగా లక్షల్లో శ్రద్ధ ఆదాయం ఉంది. ‘ముప్పై ఏళ్ల క్రితం డిగ్రీల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేవారు. ఎందుకంటే డిగ్రీలు తక్కువ ఉండేవి. ఇవాళ డిగ్రీలు అందరి దగ్గరా ఉన్నాయి. కావాల్సింది స్కిల్స్‌. ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్‌ అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు ముందుకు దూసుకెళ్లవచ్చు. నా వీడియోలు ఆ మార్గంలో ఉంటాయి’ అని తెలిపింది శ్రద్ధ అలియాస్‌ సలహాల అక్క.   

Advertisement
 
Advertisement