గ్యాస్‌ కొరతకు..వంటగది వ్యర్థాలతో చెక్‌! | Pune engineer making his own cooking gas at home with kitchen waste | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కొరతకు..వంటగది వ్యర్థాలతో చెక్‌!

Mar 16 2026 4:14 PM | Updated on Mar 16 2026 4:34 PM

Pune engineer  making his own cooking gas at home with kitchen waste

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన తాజా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇండియాలో ఎల్‌పీజీ (LPG) సరఫరా,నిల్వలపై ప్రభావం పడింది. విదేశాల నుంచి ఎల్‌పీజీ సరఫరా నిలిపివేతతో భారతదేశంలో  సంక్షోభం తలెత్తింది. దాంతో గృహ అవసరాలకే కాక హోటళ్లు, అన్నదాన కార్యక్రమాలు వంటి పలు వాటిపై ఈ గ్యాస్‌ కొరత ప్రభావం మాములుగా లేదు. అంతేగాదు దీనికి ప్రత్యామ్నాయం ఏంటీ అని సర్వతా ఒకటే చర్చ. సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీ సైతం బ్యాన్‌ చేసిన కట్టెల పొయ్యిలను తిరిగి వినియోగించుకోమని ఆదేశించడం చూస్తేనే తెలుస్తోంది సంక్షోభం ఏ స్థాయిలో ఉందనేది. ఈ క్రమంలో దీనికి ప్రత్యామ్నాయాన్ని చూపిస్తూ..సరికొత్త ఆశను రేకెత్తించారు పూణెకి చెందిన ఇంజనీర్ ప్రియదర్శన్ సహస్రబుద్ధే. అది కూడా వంటింటి వ్యర్థాలతోనే ఈ ఎల్‌పీజీ గ్యాజ్‌ సమస్యకు పరిష్కారం చూపించాడు.

పూణేకు చెందిన ఇంజనీర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే పూర్వ విద్యార్థి ఈ ఎల్‌పీజీ గ్యాస్‌ కొరతకు తన ఇంటి కోసం కనిపెట్టిన ఆవిష్కరణతోనే మార్గం చూపాడు. ఆయన కొన్నాళ్ల క్రితం కుటుంబ ‍వ్యాపారం చేస్తున్నప్పుడు భోజనం తర్వాత ఎంతలా ఆహారం వృధా అవుతుందో  గమనించాడు. ఆ వ్యర్థాలను ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తూ..పలు కంపోస్టింగ్‌ ప్రయోగాలు చేశాడు. కానీ పరిష్కారం దొరకలేదు. కానీ వాటిని తిరిగి మనకు శక్తిమంతంగా ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దిశగా జీవ ఇంధనాల శాస్త్రంపై పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. 

అప్పుడే తెలుసుకున్నాడు వంటశాలలో ఉత్పత్తి అయిన సేంద్రీయ వ్యర్థాలను బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నం చేసి మీథేన్‌ వాయువుని ఉత్పత్తి చేయొచ్చని. ఇది వంట కోసం ఉపయోగించే శుభ్రమైన ఇంధనం. పైగా వ్యర్థాలను పొంగిపొర్లుతున్న పల్లపు ప్రాంతాలకు పంపే బదులు గృహాలకు శక్తిగా మారిస్తే..ఆ ఆలోచనే 2017లో 'వాయు' అనే సాధారణ గృహాల కోసం రూపొందించిన కాంపాక్ట్ దేశీయ బయోగ్యాస్ ప్లాంట్‌గా రూపుదిద్దుకుంది. ఈ వ్యవస్థ వాయురహిత జీర్ణక్రియ అని పిలువబడే సహజ ప్రక్రియ ద్వారా సేంద్రీయ వంటగది వ్యర్థాలను మీథేన్‌గా మారుస్తుంది. 

ఇలా ఉత్పత్తి అయిన వాయువు నేరుగా స్టవ్‌కు పైపుల ద్వారా పంపొచ్చు. మిగిలిపోయిన వేస్ట్‌ని ఎరువుగా ఉపయోగించొచ్చు. ఈ ప్రయోగం ముందగా సహస్రబుద్దే తన ఇంట్లోనే ప్రారంభించాడు. ప్రతిరోజు సేకరించిన ఆహార వ్యర్థాలను ఉపయోగించి దాదాపు 800 లీటర్ల బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు. ఇది అతని ఇంటి వంట అవసరాలకు సరిపోయింది. అంతేగాదు ఎల్‌పీజీ సిలిండర్లపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించింది కూడా. తన చుట్టుపక్కల అపార్ట్‌మెంట్‌ వాసులకు కూడా దీనిపై అవగాహన కల్పించి..వాళ్లు కూడా ఈ మార్గంలో పయనించేలా చేశాడు.  

ఆ తర్వాత తన వినూత్న స్టార్టప్‌ సాయంతో నాసిక్‌, హైదరాబాద్‌, ఔరంగాబాద్‌తో సహా వివిధ నగరాల్లో వందకు పైగా యూనిట్లను స్థాపించారు. ఇవి ప్రతిరోజూ దాదాపు రెండు టన్నుల ఆహార వ్యర్థాలను ప్రాసెస్‌ చేయగలవు. ఇక్కడ ఈ ఇంజనీర్‌ వ్యర్థాలను పారేసివిగా కాకుండా వినియోగించుకునే విలువైన వనరుగా ఎలా వాడాలో తెలియజేశాడు. ఓ పక్క వ్యర్థాల సమస్యకు చెక్‌పెట్టాడు, అలాగే ఎల్‌పీజీ గ్యాస్‌పై ఆధారపడకుండా స్వచ్ఛమైన మీథేన్‌ వాయువుని పొందేలా చేశాడు. పర్యావరణానికి హితంగా, వంటిల్లు పరిశుభ్రంగా ఉంచే గొప్ప పరిష్కారం కదూ ఇది..!.

(చదవండి: ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై మెరిసిన భారత డిజైనర్‌ వేర్‌లు, ఆభరణాలు..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement