గాయపడ్డ శరీరాలు.. బాంబులకు బదులు బంతితో సమాధానం! | Amid War Gaza's Women Turn to Football for Healing | Sakshi
Sakshi News home page

గాయపడ్డ శరీరాలు.. బాంబులకు బదులు బంతితో సమాధానం!

Jul 3 2026 8:39 AM | Updated on Jul 3 2026 10:55 AM

Amid War Gaza's Women Turn to Football for Healing

ప్రపంచమంతా ఫిఫా ప్రపంచకప్‌ ఉత్సాహంలో మునిగిపోయింది. స్టేడియాలు అభిమానుల సందడితో మారుమోగుతున్నాయి. కానీ గాజాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. కరెంట్‌ ఉండే కొద్దిసేపైనా టీవీ ముందు గుమిగూడటం.. ఇంటర్నెట్‌ సిగ్నల్‌ కోసం భవనాలపైకి ఎక్కడం.. బ్యాటరీని పొదుపుగా వాడుకుంటూ మ్యాచ్‌లు చూడటం అక్కడి ప్రజల దైనందిన దృశ్యం. అలాంటి యుద్ధ వాతావరణంలోనూ ఫుట్‌బాల్‌ మాత్రం వారికి కాసేపైనా భయాన్ని మరిచిపోయే ప్రపంచంగా మారింది.

అయితే అక్కడి నుంచే ఇప్పుడు మరో ఫుట్‌బాల్‌ కథ ప్రపంచాన్ని కదిలిస్తోంది. ఇజ్రాయెల్‌ దాడుల్లో అవయవాలు కోల్పోయిన గాజా యువతులు.. ఇప్పుడు ఫుట్‌బాల్‌ మైదానంలో తమ జీవితానికి కొత్త అర్థం వెతుకుతున్నారు. పుట్టుకతోనే వైకల్యం ఉన్న అమ్మాయిలతో కలిసి పాలస్తీనాలో తొలి మహిళల అంప్యూటీ ఫుట్‌బాల్‌ జట్టుగా ఏర్పడి(amputee).. చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతి వారం.. డీర్‌ అల్‌-బలాహ్‌లో దాడుల్లో మిలిగిన కొద్దిపాటి గడ్డి మైదానంలో వారు సాధన చేస్తున్నారు. వారి లక్ష్యం ఒక్కటే.. ఒకరోజు ప్రపంచ వేదికపై పాలస్తీనా జెండాను ఎగురవేయడం.

గాజా ఆరోగ్య శాఖ అంచనా ప్రకారం యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడ దాదాపు ఆరు వేల మంది అవయవాలు కోల్పోయారు. వీరందరికీ కృత్రిమ అవయవాలు, దీర్ఘకాలిక పునరావాసం అవసరమైంది. ఈ పరిస్థితుల్లోనే 2018లో స్థాపించబడిన పాలస్తీనా అంప్యూటీ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కొత్త ఆశాకిరణంగా మారింది. యుద్ధం తర్వాత వికలాంగుల సంఖ్య పెరగడంతో మహిళల జట్టులో చేరిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

‘‘మా మైదానాలు ధ్వంసమయ్యాయి. సామగ్రి లేదు. అయినా ఈ అమ్మాయిల సంకల్పమే మమ్మల్ని ముందుకు నడిపించింది" అని అసోసియేషన్‌ వ్యవస్థాపకుడు ఫౌద్‌ అబూ ఘూలియన్‌ చెబుతున్నారు. ప్రపంచకప్‌ సందర్భంగా గాజా నుంచి వినిపించాల్సిన గొంతులు కూడా ఉన్నాయని, ముఖ్యంగా ఈ మహిళలు నిజమైన ఛాంపియన్లని ఆయన అంటున్నారు. 2027లో జరగనున్న మహిళల అంప్యూటీ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో పాల్గొనడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

24 ఏళ్ల రోజాన్‌ ఖైరా జీవితాన్ని మాత్రం యుద్ధమే ఒక్కసారిగా మార్చేసింది. 2023 నవంబరులో జరిగిన ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో కుటుంబ ఇంటిపై బాంబు పడటంతో ఆమె ఒక కాలును కోల్పోయింది. ఒకప్పుడు పరుగుపందేల్లో పతకాలు గెలిచిన ఆమెకు అది పెద్ద దెబ్బే. కానీ అదే సంఘటన ఆమె సంకల్పాన్ని మరింత బలపరిచింది. ఇప్పుడు అంప్యూటీ ఫుట్‌బాల్‌ జట్టులో చేరి తన జీవితానికి కొత్త అర్థం వెతుక్కుంటోంది.

గోల్‌కీపర్‌ ఐషా అల్‌ అబద్లా కథ మరింత హృదయవిదారకం. 2008 యుద్ధ సమయంలో ఆమె తల్లి తెల్ల భాస్వర(వైట్‌ పాస్పరస్‌) రసాయన ప్రభావానికి గురికావడంతో ఐషా ఒక చేయి పూర్తిగా అభివృద్ధి చెందకుండా జన్మించింది. అయినా దానిని ఆమె ఎప్పుడూ బలహీనతగా భావించలేదు. ఎనిమిదేళ్లుగా ఫుట్‌బాల్‌ ఆడుతున్న ఆమెకు ఆటే జీవితం. "మైదానంలోకి దిగితే యుద్ధానికి ముందు ఉన్న రోజులు గుర్తొస్తాయి. మా జీవితంలో ఆనందం మళ్లీ తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది" అని చెబుతోంది.

అయితే వీరి పోరాటం మైదానంలోనే ముగియడం లేదు. చాలామందికి శరణార్థి శిబిరాల నుంచి సాధనకు రావడానికి ప్రయాణ ఖర్చులే భారంగా మారుతున్నాయి. ఆహార కొరత, పోషకాహార లోపం, క్రీడా సామగ్రి కొరత వంటి సమస్యలు ప్రతిరోజూ వెంటాడుతున్నాయి. అయినా "పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మా పట్టుదల మాత్రం తగ్గదు" అని రోజాన్‌ ధైర్యంగా చెబుతోంది.

ప్రపంచం మొత్తం ఫిఫా ప్రపంచకప్‌ను చూస్తుంటే... డీర్‌ అల్‌-బలాహ్‌లోని ఈ యువతులు కూడా వీలైనప్పుడల్లా ఆ మ్యాచ్‌లను చూస్తున్నారు. కానీ వారు కేవలం ప్రేక్షకులుగా ఉండాలని కోరుకోవడం లేదు. ఒకరోజు అదే ప్రపంచం తమ ఆటను కూడా చూడాలని... తమ గాయాలను కాదు, తమ గెలుపును గుర్తించాలని కలలు కంటున్నారు. యుద్ధం వారి అవయవాలను దూరం చేసినా... ఫుట్‌బాల్‌పై ప్రేమను, జీవితంపై ఆశను మాత్రం ఏ బాంబూ చెరిపేయలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement