ఫుడ్‌ సేఫ్టీ... ఏఐ ఉందిగా... | AI is revolutionizing the food industry by driving predictive safety models | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ సేఫ్టీ... ఏఐ ఉందిగా...

Jun 7 2026 5:05 AM | Updated on Jun 7 2026 5:05 AM

AI is revolutionizing the food industry by driving predictive safety models

నేడు వరల్డ్‌ ఫుడ్‌ సేఫ్టీ డే

ఏ పుట్టలో ఏ పాముందో... అనేది పాత సామెత. ఏ ఫుడ్‌లో ఏ బాక్టీరియా ఉందో... అనేది కొత్త సామెత. ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా తినాలంటే... భయమే భయం! ఏ సమస్య వచ్చినా... ‘ఏ.ఐ ఉందిగా!’ అనుకునే ఈ కాలంలో... ఏ.ఐ అనేది ఫుడ్‌ సేఫ్టీకి సంబంధించిన భయాలను పోగొట్టి, భరోసా ఇవ్వగలదా? అంటే... ‘యస్‌’ అనే అంటున్నారు నిపుణులు. ఇప్పుడిప్పుడే ఆహారపరిశ్రమలో ఏఐ అడుగులు పడుతున్నాయి. భవిష్యత్‌కు సంబంధించి ఆశను, భరోసాను ఇస్తున్నాయి.

ఆహార భద్రతకు సంబంధించిన మూలస్తంభాలలో ఒకటి... ఆహార నాణ్యత. ఆహార పదార్థాలలో వ్యాధికారకాలు, విషపదార్థాలను గుర్తించడంలో ఏ.ఐ సాంకేతికత ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఏ.ఐ, ఆధారిత కెమెరాలు ఆహార ఉత్పత్తులలోని కలుషితాన్ని, సరిగా లేని లేబులింగ్‌ను, ఇతరత్రా అంశాలను మనిషి కంటి కంటే వేగంగా, మరింత కచ్చితత్వంతో గుర్తిస్తున్నాయి. ఏఐ–ఆధారిత సెన్సార్లు ఆహార ఉత్పత్తులలో ఇ.కోలి, సాల్మోనెల్లా వంటి హానికరమైన బాక్టీరియాను గుర్తించగలవు. మైక్రోబయాలజీ స్టార్టప్‌ ‘స్పోర్‌ బయో’ ఫుడ్‌ సేఫ్టీకి సంబంధించి పరీక్ష సమయాన్ని రోజుల నుండి నిమిషాల వ్యవధికి తగ్గించే ఏ.ఐ. సాంకేతికతను అభివృద్ధి చేసింది.

తు.చ. తప్పకుండా... ఫుడ్‌సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని, ఉద్యోగులలో ఒత్తిడిని తగ్గించడానికి అమెరికన్‌ మల్టీనేషనల్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌ చైన్‌ ‘మెక్‌డొనాల్డ్స్‌’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ శాఖలలో ఏ.ఐ. టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఏఐ–ఆధారిత డ్రైవ్‌–త్రూలు నిర్వహిస్తోంది. షెడ్యూలింగ్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌లలో రెస్టారెంట్‌ మేనేజర్‌లకు ఏ.ఐ. సాధనాలు ఉపకరిస్తున్నాయి. నిబంధనలను పాటించడం అనేది ఆహార పరిశ్రమలకు సవాలుగా, సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేలా చేయడంలో ఏ.ఐ ఆటోమేట్‌ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది.

ఆహారభద్రతా చట్టాలు, లేబులింగ్‌ నిబంధనలు, ట్రేసబిలిటీ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి ఆహార పరిశ్రమలు మాన్యువల్‌ ప్రాసెస్‌పై ఎక్కువ ఆధారపడతాయి. సంక్లిష్టమైన నిబంధనలను త్వరగా అర్థం చేసుకోవడం, నిబంధనలు పాటించడానికి సంబంధించిన సందేహాలకు తక్షణ సమాధానాలు ఇవ్వడం ద్వారా హోటల్స్, రెస్టారెంట్స్‌... మొదలైనవి ఆహార భద్రతా చట్టాలలో అప్‌డేటెడ్‌గా ఉండేలా చూడడానికి ఏ.ఐ. అనేది మాన్యువల్‌ ప్రాసెస్‌కు ప్రత్యామ్నాయంగా మారింది.

అలెర్జీలకు దూరంగా...ఆరోగ్యానికి దగ్గరగా... ఆహార భద్రతకు సంబంధించి ఏ.ఐ. సాంకేతికతను వినియోగించుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా ఫుడ్‌ సైంటిస్ట్‌లు, క్వాలిటీ అష్యూరెన్స్‌ స్పెషలిస్ట్‌లు... మొదలైన వారి నుంచి సలహాలు తీసుకుంటున్నాయి రెస్టారెంట్‌లు. 

రోబోటిక్‌ చెఫ్‌లు... ఏఐ ఆధారిత రోబోటిక్‌ చెఫ్‌లు, ప్రిడిక్టివ్‌ అనాలటిక్స్‌ ద్వారా ఆహార వ్యర్థాలను భారీగా తగ్గించడానికి వీలువుతుంది. మీల్‌ ప్లానర్, కుక్‌ బుక్‌  వంటి ఏ.ఐ. సాధనాలు వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను అందించడంలో సహాయపడుతున్నాయి. అలెర్జీల బారిన పడకుండా ఉపకరిస్తున్నాయి.
ఏ.ఐ. ఆధారిత పర్సనలైజ్‌డ్‌ న్యూట్రిషన్‌ యాప్‌ ‘ఆర్‌ఎక్స్‌డైట్‌’ కస్టమ్‌ ఫుడ్‌ ప్లాన్స్‌ను డెవలప్‌ చేసి ఆహారపదార్థాలను తాజాగా అందించడంలో తోడ్పడుతుంది. ఒకవైపు రుచిని అందిస్తూనే, మరోవైపు అలెర్జీ కారకాలను తొలగించడానికి, పోషక విలువలు మెరుగు పరచడానికి ఏ.ఐ సాధనాలు ఉపకరిస్తున్నాయి.

మరింత ప్రయోజనకరంగా... 
‘సంప్రదాయ ఆహారపదార్థాలను మరింత ప్రయోజనం కలిగించేలా చేయడానికి, పర్యావరణానికి తక్కువ హాని కలిగించే ప్రత్యామ్నాయ మార్గాలు సృష్టించడానికి ఏ.ఐ. ఉపకరిస్తుంది’ అంటున్నారు నిపుణులు.
రెస్టారెంట్‌ల ఆహారభద్రత పర్యవేక్షించడానికి యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ఏ.ఐ. టూల్స్‌ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఏ.ఐ. అనేది పని సామర్థ్యాన్ని మెరుగుపరిచే సాధనం మాత్రమే కాదు ఆహారభద్రతకు సంబంధించిన నిబంధనలను పాటించేలా చేయడంలో, పారదర్శకత, విశ్వసనీయతకు సంబంధించి ఆహార పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement