ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్కూల్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ శనివారం ఘనంగా ప్రారంభమైందని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గోకరాజు ఆదిత్య వర్మ తెలిపారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వీవీఎస్‌ఎం శ్రీనివాస రాజు, పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ విజయ సారథి పర్యవేక్షణలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రికెట్ ప్రతిభను వెలికితీసి, క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడమే ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
తొలి మ్యాచ్‌లో పోలీస్ స్కూల్ విజయం
టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ స్కూల్ జట్టు, సీఆర్‌రెడ్డి పబ్లిక్ స్కూల్ జట్టుతో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన పోలీస్ స్కూల్ జట్టు 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో లోహిత్ 35 పరుగులు, చరణ్ మణికంఠం 23 పరుగులు, జగదీష్ 18 పరుగులు సాధించారు. రెడ్డి పబ్లిక్ స్కూల్ బౌలింగ్‌లో హవినాష్ 2 వికెట్లు, సాయి మణికంఠ, నాగ మనోహర్, మోహిత్ సాయి తలో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆ జట్టులో మనోహర్ 30 పరుగులు, కౌశిక్ 18 పరుగులు సాధించారు. పోలీస్ స్కూల్ బౌలర్లు విజయ్, కిరణ్ కుమార్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ స్కూల్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సూపర్ ఓవర్‌లో సుబ్బమ్మ దేవి విజయం
మధ్యాహ్నం నుంచి జరిగిన మ్యాచ్‌లో సుబ్బమ్మ దేవి స్కూల్, శ్రీ సూర్య పబ్లిక్ స్కూల్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన సుబ్బమ్మ దేవి స్కూల్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 96 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు తరఫున శ్రవణ్ 19, ప్రసాద్ 16, చరణ్ 14 పరుగులు చేశారు. శ్రీ సూర్య పబ్లిక్ స్కూల్ బౌలర్లలో ఓ ముబారక్ 4, హుసేన్ 2, హాసన్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీ సూర్య పబ్లిక్ స్కూల్ జట్టు కూడా 96 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు తరఫున హాసన్ 21, గణేష్ 14, మోక్షిత్ 11 పరుగులు చేశారు. సుబ్బమ్మ దేవి స్కూల్ బౌలర్లలో సూర్యతేజ 3, హిమసాయి 2, కరుణాకర్ 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీ సూర్య పబ్లిక్ స్కూల్ జట్టు 2 వికెట్ల నష్టానికి 4 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సుబ్బమ్మ దేవి స్కూల్ జట్టు 1 వికెట్ నష్టానికి 5 పరుగులు చేసి విజయం సాధించింది.


