తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం 38వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లగొండ స్వప్న ఇంటికి గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. చుట్టుపక్కల వారు గాఢనిద్రలో చిన్న పిల్లలతో ఉన్న స్వప్న, ఆమె కుటుంబ సభ్యులను మంటల నుంచి అతి కష్టం మీద బయటకు తీసుకురాగలిగారు. నామినేషన్ విత్‌డ్రా చేసు కోకపోతే ఆమె పిల్లలను కిడ్నాప్ చేస్తానని బెదిరించగా.. వైఎస్సార్‌సీపీ శ్రేణులు వారిని రక్షించారు. మరోపక్క ఆమెను హతమారుస్తామంటూ బెదిరించగా నామినేషన్ల విత్‌డ్రా ముగిసే వరకూ ఓ ప్రాంతంలో పార్టీ శ్రేణులు ఆమెను రక్షించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటికి నిప్పు పెట్టారు.
వైఎస్సార్‌సీపీపై అభిమానంతో ఎస్టీ కేటగిరీలో రిజర్వ్‌డ్ అయిన 38వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశానని బాధితురాలు నల్లగొండ స్వప్న అన్నారు. తొలి నుంచి తనకు వేధింపులు ఎక్కువయ్యాయని, నామినేషన్ విత్‌డ్రా చేయకపోతే నరికేస్తానని, తన పిల్లలను చంపేస్తామని ప్రత్యర్థి వర్గం బెదిరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లలను కిడ్నాప్ చేసే ప్రయత్నం కూడా చేశారని, చివరకు తన ఇంటికి నిప్పు పెట్టారని వాపోయారు. తన ఇల్లు తగులబెట్టి కట్టుబట్టలతో రోడ్డుపై నిలబెట్టారని, అయినా పోటీ నుంచి వెనక్కి తగ్గేదే లేదన్నారు. ఇల్లు తగలబడిపోతుంటే చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు తట్టి లేపారని స్వప్న తల్లి అన్నా రు. చుట్టుపక్కల వారి సాయంతో చిన్న బిడ్డ లను, తన కూతురిని, మేనల్లుడిని అతికష్టం మీద మంటల నుంచి బయటకు తీసుకురాగలిగామని కన్నీటి పర్యంతమయ్యారు.


