తాడేపల్లిగూడెం (టీఓసీ): ప్రకృతిసిద్ధమైన తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కట్టుపల్లి ధనుంజయరావు అన్నారు. వెంకట్రామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో శుక్రవారం శాసీ్త్రయ తేనెటీగల పెంపకంపై శిక్షణ ముగిసింది. 25 మందికి శిక్షణ ఇచ్చి, ఐసీఆర్–అటారీ జోన్–10, జాతీయ తేనెటీగల బోర్డు సహకారంతో శిక్షణ సామాగ్రి అందజేశారు. విస్తరణ సంచాలకులు సిహెచ్ రూత్ నివేదిక సమర్పించారు. తేనెకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని, రైతులు, గ్రామీణ మహిళలు ఆధునిక పద్ధతుల్లో తేనెటీగల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం పొందవచ్చని వీసీ సూచించారు. సమాఖ్యగా ఏర్పడితే ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వ్యాపార అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. పుట్టగొడుగుల పెంపకం, నర్సరీ నిర్వహణ వంటి కేవీకే శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో స్వామి, కిరణ్ కుమార్, పి.విజయలక్ష్మి, ఇమ్మాన్యూల్, అర్చన, రేఖ, ప్రసాద్, షాలి రాజు తదితరులు పాల్గొన్నారు.


