స్పందన | - | Sakshi
Sakshi News home page

స్పందన

Nov 21 2026 12:26 AM | Updated on Nov 21 2026 12:26 AM

ఘనంగా ధ్వజారోహణం రెండు కార్లు ఢీ..నలుగురికి గాయాలు మీటర్‌ లోపమే అని తేల్చిన అధికారులు ఏపీ, తెలంగాణ సరిహద్దుల పరిశీలన 22న త్రోబాల్‌ సెలెక్షన్స్‌

ఆగిరిపల్లి: శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయంలో ధ్వజారోహణం వైభవంగా నిర్వహించారు. ఉదయం అర్చకులు వేదాంతం శేషుబాబు ఆధ్వర్యంలో పంచామృత స్నపన, విశేష అలంకరణ జరిపారు. రాత్రి 7 గంటలకు నవ కుంభారాధన, సర్వదైవత్య హోమం నిర్వహించారు. కలువపల్లి రామచంద్ర శర్మ, వింత శ్రీనివాస్‌ రెడ్డి, జాలిపర్తి శేషగిరిరావు, బోయపాటి కోటేశ్వరరావు, సామల వెంకట సుబ్బారావు, మొవ్వ వెంకట్రావు దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

పాలకొల్లు సెంట్రల్‌ : పాలకొల్లు మండలం దిగమర్రు బైపాస్‌ రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అమలాపురం నుంచి పాలకొల్లు వైపు వస్తున్న కారు, పాలకొల్లు నుంచి చించినాడ వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అమలాపురం నుంచి వస్తున్న కారులోని యువకులకు తీవ్ర గాయాలు కాగా, వారిని హుటాహుటిన అమలాపురం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పాలకొల్లు కారులో ఉన్న యువతి ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో ప్రాణాలతో బయటపడినప్పటికీ షాక్‌ నుంచి ఇంకా కోలుకోలేదు.

తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని పాతూరు వినియోగదారుడికి మూడింతల విద్యుత్‌ బిల్లు రావడానికి మీటర్‌ లోపమే కారణమని ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు శుక్రవారం రాత్రి స్పష్టం చేశారు. రీడింగ్‌ పొరపాటా.. మీటర్‌ లోపమా! అనే శీర్షికతో శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. మీటర్‌ను ఎంఆర్‌టీ విభాగానికి పంపి తనిఖీ చేయగా లోపం ఉన్నట్లు తేలింది. దీంతో బిల్లును సరిచేసి వినియోగదారుడికి సమాచారం అందించారు. ఈ మేరకు వినియోగదారుడు సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు.

బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన గుబ్బల మంగమ్మతల్లి ఆలయ సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సరిహద్దు ప్రాంతాన్ని ఏసీఎఫ్‌ విజయభారతి శుక్రవారం పరిశీలించారు. త్వరలో రెండు రాష్ట్రాల అటవీ, రెవెన్యూ శాఖలు నిర్వహించనున్న సరిహద్దు పరిశీలనకు ముందస్తు సన్నాహకంగా భౌగోళిక పరిస్థితులు, అటవీ ప్రాంతాలను తనిఖీ చేశారు. ఈ ప్రాంతంలోని చెక్‌డ్యామ్‌ల పురోగతిని పరిశీలించిన అనంతరం, ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడి ఆలయ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ములగలంపల్లి సెక్షన్‌ ఆఫీసర్‌ కె.రాంబాబు, బీట్‌ అధికారులు మారేసు, శ్రీమన్నారాయణ, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం (టీఓసీ): సీనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ త్రోబాల్‌ ఎంపిక పోటీలు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 22న (ఆదివారం) నిర్వహించనున్నట్లు సెక్రటరీ ఎన్‌ఎం.శ్రీనాథ్‌ తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 28, 29 తేదీల్లో విజయవాడలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు పంపుతామన్నారు. వయోపరిమితి లేదని, అభ్యర్థులు ఆధార్‌ కార్డు జిరాక్స్‌తో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 97012 03030, 91338 59589 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement