పీవీఎల్‌కు కూటమి షాక్‌ | - | Sakshi
Sakshi News home page

పీవీఎల్‌కు కూటమి షాక్‌

Nov 21 2026 12:26 AM | Updated on Nov 21 2026 12:26 AM

జనసేనకు ఝలక్‌.. రెండు పదవులూ టీడీపీకే

సాక్షి, భీమవరం : జెడ్పీ చైర్మన్‌ పదవిని ఆశించిన ఉండి జెడ్పీటీసీ సభ్యుడు పీవీఎల్‌ నరసింహరాజుకు కూటమి గట్టి షాక్‌ ఇచ్చింది. కొత్తగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా గణపవరం జెడ్పీటీసీ సభ్యుడు ఇందుకూరి రామకృష్ణంరాజును (టీడీపీ) ఎంపిక చేసింది. దీంతో పీవీఎల్‌కు భంగపాటు తప్పలేదు.

మ్యాండేట్‌ దక్కినా.. పదవి దూరం

గతంలో వైఎస్సార్‌సీపీ ఉండి నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేసిన పీవీఎల్‌ నాలుగు నెలల క్రితం జనసేనలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్‌ పదవి జనరల్‌కు రిజర్వ్‌ కావడం, పొత్తులో భాగంగా ఈ పీఠం జనసేనకు దక్కుతుందనే ప్రచారం జరగడంతో క్షత్రియ కోటాలో పీవీఎల్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. ఉండి జెడ్పీటీసీ స్థానానికి టీడీపీ నేత పొత్తూరి రామరాజు నామినేషన్‌ వేసినప్పటికీ, ఆయన్ను కాదని పీవీఎల్‌కే కూటమి మ్యాండేట్‌ ఇచ్చింది. ఎన్నికల్లో కూటమి మెజారిటీ స్థానాలు కై వసం చేసుకోవడంతో పీవీఎల్‌ చైర్మన్‌ కావడం లాంఛనమేనని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా టీడీపీకి చెందిన ఇందుకూరి రామకృష్ణంరాజును చైర్మన్‌గా ఎంపిక చేయడం చర్చనీయాంశమైంది. పీవీఎల్‌కు పదవి దక్కకుండా ఉండి, ఉంగుటూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. కాగా, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పీవీఎల్‌కు ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పదవితో పాటు ఉండి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు.

సభ్యుల ప్రమాణ స్వీకారం

భీమవరం పాత బస్టాండ్‌ పక్కనున్న జెడ్పీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇన్‌చార్జి కలెక్టర్‌, జేసీ కేఆర్‌ కల్పశ్రీ నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జి.రమణ తదితరులు పాల్గొన్నారు.

తమకు బలమైన పట్టుందని భావించే పశ్చిమగోదావరి జిల్లాలో చైర్మన్‌తో పాటు వైస్‌ చైర్మన్‌ పదవిని కూడా టీడీపీకే కట్టబెట్టడం జనసేన శ్రేణులకు మింగుడుపడటం లేదు. వైస్‌ చైర్మన్‌గా అత్తిలి జెడ్పీటీసీ సభ్యుడు శిరగాని నాగేశ్వరరావు (టీడీపీ) ఎన్నికయ్యారు. జిల్లాలోని 20 జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ 13, జనసేన 6, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందాయి. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముగ్గురు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, కనీసం వైస్‌ చైర్మన్‌ పదవి కూడా దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జెడ్పీ చైర్మన్‌ పదవులను జనసేనకు ఇచ్చిన కూటమి, ఆయా చోట్ల వైస్‌ చైర్మన్‌ పదవులను టీడీపీకి కేటాయించింది. తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో జనసేనకు వైస్‌ చైర్మన్‌ పదవులు దక్కగా, పశ్చిమగోదావరిలో మాత్రం మొండిచేయి ఎదురైంది.

పశ్చిమ జెడ్పీ చైర్మన్‌గా రామకృష్ణంరాజు

స్థానిక ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీని వీడి జనసేనలో చేరిన పీవీఎల్‌

జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థి అంటూ ప్రచారం

గతంలో డీసీసీబీ చైర్మన్‌ హోదా కల్పించిన వైఎస్సార్‌సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement