విద్యుత్‌ స్తంభం విరిగి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభం విరిగి యువకుడి మృతి

Nov 21 2026 12:26 AM | Updated on Nov 21 2026 12:26 AM

కామవరపుకోట : విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా విరిగిపడిన స్తంభం తగిలి ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. టి.నరసాపురం మండలం సాయంపాలెం పరిధిలో, కామవరపుకోట మండలం ఉప్పలపాడు పంచాయతీ గొల్లగూడెం శివారులో ఈ విషాదం జరిగింది. జీలకర్రగూడెంకు చెందిన కనుమూరి విశ్వ సాకేత్‌ వర్మ (23) ఇటీవల బీటెక్‌ పూర్తి చేసి, హైదరాబాద్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సు చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. బంధువుల ఇంట్లో శుభకార్యం నిమిత్తం స్వగ్రామానికి వచ్చిన అతడు, శుక్రవారం ఉదయం బంధువును జంగారెడ్డిగూడెంలో దింపేందుకు బైక్‌పై బయలుదేరాడు. జంగారెడ్డిగూడెం–ఏలూరు ప్రధాన రహదారికి ఇరువైపులా గత మూడు రోజులుగా విద్యుత్‌ సిబ్బంది చెట్ల కొమ్మలు తొలగిస్తున్నారు. గొల్లగూడెం సబ్‌స్టేషన్‌ సమీపంలో కొమ్మలు నరుకుతుండగా, నిబంధనల మేరకు వాహనం ఆపి పక్కనే నిలబడి ఉన్న సాకేత్‌ వర్మపై తీగలపై పడిన కొమ్మ బరువుతో స్తంభం విరిగిపడింది. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. టి.నరసాపురం ఎస్సై జయబాబు, తడికలపూడి ఎస్సై వల్లి పద్మ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement