ఆకివీడు: వెంకయ్య వయ్యేరు పంట కాలువ మురుగు కాలువను తలపిస్తూ కలుషిత నీటితో ప్రవహిస్తోంది. ముసురు తుపాను ధాటికి వరి చేలు ముంపునకు గురై పంట వ్యర్థాలు కుళ్లిపోవడంతో పంట కాలువలు, మురుగు కాలువలు, పలు గ్రామాల్లోని చెరువులు కలుషితమయ్యాయి. కాలువల్లోని గుర్రపుడెక్క, తూడు, పచ్చగడ్డి కుళ్లిపోగా, గట్ల వెంబడి గడ్డి మాడిమసైంది. కాలువ నల్ల సముద్రాన్ని తలపిస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు దొరకక, పశువులను సైతం కలుషిత నీటితోనే కడగాల్సి వస్తోందని వాపోతున్నారు. పేరుకుపోయిన చెత్త, అడ్డంకులను వెంటనే తొలగించి నీటి ప్రవాహ వేగాన్ని పెంచాలని కోరుతున్నారు.


