● భారీగా వస్తున్న విద్యుత్ బిల్లులతో సామాన్యుల ఆందోళన
● స్పష్టత కోరుతున్న బాధితులు
తాడేపల్లిగూడెం (టీఓసీ): అదనపు విద్యుత్ ఉపకరణాలు వాడకపోయినా, గత నెలలతో పోలిస్తే ఒకేసారి రెట్టింపు లేదా మూడింతలు కరెంట్ బిల్లులు వస్తుండటంతో పట్టణంలోని సామాన్య వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రీడింగ్ పొరపాటా, మీటర్ లోపమా అన్నది తేల్చకుండానే అధిక బిల్లులు జారీ చేయడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ సిబ్బందిని ఆశ్రయిస్తే, ముందుగా బిల్లులో సగం లేదా మొత్తం చెల్లిస్తేనే మీటర్ పరీక్ష చేస్తామని చెబుతుండటం వినియోగదారులను మరింత అయోమయానికి గురిచేస్తోంది. వాడని కరెంటుకు సొమ్ము ఎందుకు కట్టాలని, మీటర్ లోపమని తేలితే చెల్లించిన సొమ్ము తిరిగి ఇస్తారా లేదా వచ్చే బిల్లులో సర్దుబాటు చేస్తారా అన్నదానిపై స్పష్టత లేదని బాధితులు వాపోతున్నారు. సగం మొత్తం చెల్లిస్తే మిగిలినది బకాయిగా చూపిస్తుందని, పరీక్ష నివేదిక ఆలస్యమైతే ఆలస్య రుసుము పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. చెల్లించిన సొమ్ము పార్ట్ పేమెంట్‌గా నమోదైందా, వివాదాస్పద బిల్లు కిందా అన్నది రసీదులో స్పష్టంగా లేకపోతే కనెక్షన్ తొలగించే ముప్పు ఉంటుందని అంటున్నారు.
చెక్ మీటర్‌తో తనిఖీ చేయాలి
మీటర్‌ను ల్యాబ్‌కు పంపే బదులు, పక్కనే చెక్ మీటర్ అమర్చి 7 నుంచి 15 రోజుల పాటు తనిఖీ చేయడం కచ్చితమైన పద్ధతి అని పలువురు సూచిస్తున్నారు. అలాగే సీల్ తొలగించేటప్పుడు వినియోగదారుడి సమక్షంలో పరీక్షలు జరపాలని, నేరుగా ఎంఆర్‌టీ ల్యాబ్‌కు పంపడం వల్ల పారదర్శకత లోపిస్తోందని ఆరోపిస్తున్నారు.
మూడింతల బిల్లు
పాతూరుకు చెందిన ఓ వినియోగదారుడికి ఏకంగా మూడింతల బిల్లు రావడంతో నార్త్ ఏఈ కార్యాలయాన్ని సంప్రదించారు. మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న అనంతరం, సిబ్బంది సూచన మేరకు సగం బిల్లుతో పాటు మీటర్ పరీక్షకు రూ.200 చెల్లించారు. సాయంత్రానికే మీటర్ మార్చినప్పటికీ, తదుపరి బిల్లు సర్దుబాటుపై స్పష్టత లేక ఆయన ఆందోళన చెందుతున్నారు. మీటర్ లోపం తేలితే చెల్లించిన సొమ్మును సరిచేస్తామని అధికారులు తెలిపారు. ముందస్తు షరతులు లేకుండా మీటర్లు తనిఖీ చేసి బిల్లులు సవరించాలని వినియోగదారులు కోరుతున్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కారం కాకుంటే 1912 టోల్ ఫ్రీ ద్వారా సీజీఆర్‌ఎఫ్‌ను ఆశ్రయించాలని అంటున్నారు.


