ఏలూరు టౌన్: స్థానిక ఆర్‌ఆర్‌పేట ప్రాంతంలో గుర్తు తెలియని అగంతకుడు ఒక వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు అపహరించాడు. బాధితురాలు ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల ప్రకారం ఏలూరు ఆర్‌ఆర్‌పేట ప్రధాన రహదారిపై త్రినాథ్ ఫ్యాషన్స్ పక్క వీధిలో మడిచర్ల కుమారి అనే వృద్ధురాలు తన ఇంటివద్ద గురువారం ఉదయం మొక్కలకు నీరు పోస్తుండగా... అగంతకుడు అడ్రస్ అడుగుతూ వృద్ధురాలి సమీపానికి వచ్చి, ఒక్కసారిగా ఆమె మెడలోని 9 కాసులు (72 గ్రాముల) బంగారు గొలుసును చోరీ చేశాడు. ఈ బంగారు గొలుసు విలువ సుమారు రూ.10 లక్షల వరకూ ఉంటుందని బాధితురాలు వాపోతున్నారు. ఏలూరు టూటౌన్ సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదకరంగా ఎర్రకాలువ వంతెన
జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం): జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ వంతెనపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడటంతో పాటు, ఆ గోతుల్లోంచి ఇనుప ఊచలు ప్రమాదకరంగా పైకి తేలాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ కీలక మార్గంలో ఊచలు వాహనాల టైర్లకు గుచ్చుకుని పంక్చర్లవుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి వంతెనకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


