ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్యక్షేత్రంలో శ్రీవారి తెప్పోత్సవ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. క్షీరాబ్ధి ద్వాదశి పురస్కరించుకుని శనివారం రాత్రి నృసింహ సాగరం (పుష్కరిణి)లో ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరిణి పరిసరాలు, గట్లు, ముందున్న రహదారిపై విద్యుద్దీపాలంకరణలు, తోరణాలు కనువిందు చేస్తున్నాయి. దీపకాంతుల మధ్య సాగరంలోని మండపం దేదీప్యమానంగా వెలుగొందుతుండగా, భారీ విద్యుత్ కటౌట్, దసరా మండపం, వృక్షాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. శనివారం రాత్రి 8 గంటలకు ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారు ఆలయం నుంచి సాగరం వద్దకు చేరుకుంటారని, అనంతరం తెప్పోత్సవం మొదలవుతుందని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి జలవిహారాన్ని వీక్షించాలని ఆయన కోరారు.
విద్యుద్దీప కాంతులీనుతున్న పుష్కరిణి మధ్యలోని మండపం, సాగరం గట్లు
శ్రీవారి పుష్కరిణి ముందు ఏర్పాటు చేసిన స్వామివారి భారీ విద్యుత్ కటౌట్


