ఏలూరు టౌన్: ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఒక విభాగ హెచ్‌ఓడీ పుట్టినతేదీ వివాదాస్పదంగా మారింది. సర్వీస్ రిజిస్టర్ (ఎస్‌ఆర్)లో ఒకలా.. టెన్త్ సర్టిఫికెట్‌లో మరోలా ఉండటం వివాదానికి ప్రధాన కారణమైంది. ఎస్‌ఆర్ ప్రామాణికంగా చూస్తే ఆమె ఆరు నెలల క్రితమే పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ఎస్‌ఆర్‌లో పుట్టిన తేదీ మార్చివేసి మరీ ఉద్యోగంలో కొనసాగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇదంతా రిటైర్‌మెంట్ సమీపిస్తున్న తరుణంలో సర్వీస్ వివరాలన్నీ ఎలక్ట్రానిక్ ఎస్‌ఆర్‌లో పొందుపరిచే క్రమంలో బయటపడినట్టు తె లుస్తోంది. దీనిపై ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనీరజ ప్రాథమిక విచారణ చేపట్టి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు నివేదించారని తెలిపారు. డీఎంఈ విచారణ అనంతరం రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని చెబుతున్నారు.
వివాదం ఏంటంటే..? ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒక విభాగానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా వ్యవహరిస్తున్న వైద్యురాలు పుట్టినతేదీ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపింది. జీఎంసీ అధికారి సర్వీస్ రిజిస్టర్‌లో పుట్టినతేదీ మార్పు చేసుకుని మరీ నిబంధనలకు విరుద్ధంగా కొద్దినెలలుగా నెలకు రూ.1.50 లక్షలు చొప్పున ఏకంగా ఇప్పటికే రూ.9 లక్షల ప్రభుత్వ సొమ్ము జీతంగా తీసుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. సదరు వైద్యురాలు పాఠశాల విద్య కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొనసాగినట్టు చెబుతున్నారు. టెన్త్ సర్టిఫికెట్ మేరకు పుట్టిన తేదీ 1963 కాగా.. సర్వీస్ రిజిస్టర్‌లో 1964గా నమోదయ్యింది. సర్వీస్ రిజిస్టర్ ప్రామాణికంగా తీసుకుంటే ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ 2017లో పుట్టిన తేదీని టెన్త్ సర్టిఫికెట్ ఆధారంగా 1963గా నిర్ధారిస్తూ ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌లో ఎంట్రీ ఉన్నట్టు మెడికల్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ అధికారులు పేర్కొంటున్నారు. సదరు వైద్యురాలు సోదరుడి సర్టిఫికెట్స్‌ను, వైద్యురాలి సర్టిఫికెట్లను పరిశీలించి, విచారణ చేసి ఎస్‌ఆర్‌లో ఎంట్రీ చేసినట్టు చెబుతున్నారు. వాస్తవానికి అప్పట్లో ఏ అధికారులు విచారణ చేశారు ? అనేది సందేహంగా మారింది. కేవలం అఫిడవిట్‌తో సర్వీస్ రిజిస్టర్‌లో పుట్టినరోజు తేదీలను మార్పు చేసే అవకాశం ఉందా? అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ విచారణ చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రొఫెసర్ల మధ్య పోరు
ఏలూరు మెడికల్ కళాశాల, అనుబంధ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, హెచ్‌ఓడీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు నేపథ్యంలోనే పుట్టినతేదీ వివాదం బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. వైద్య కళాశాలలో హెచ్‌ఓడీగా పనిచేస్తున్న వైద్యురాలి వ్యవహార శైలితో విసుగెత్తిన మిగిలిన ఉద్యోగులు, వైద్యులు ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చినట్టు చర్చ సాగుతుంది. ఇదే తరహాలో అక్రమ మార్గంలో సర్వీస్ నిబంధనలు మీరిన ఉద్యోగులు ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పుట్టినతేదీ మార్చి.. సర్వీసును ఏమార్చి
సర్వీసు ముగిసినా ఉద్యోగం చేస్తున్నట్టు ఆరోపణ
వైద్య కళాశాల హెచ్‌ఓడీ వ్యవహారం బట్టబయలు


