తాడేపల్లిగూడెం (టీఓసీ): వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ కె. ధనుంజయరావు గ్రంథాలయ వారోత్సవాల ఐదో రోజు స్థానిక ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. గ్రంథాలయ సద్వినియోగం, గురువుల ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. గ్రంథాలయ అధికారి సాయిబాబా పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్ నినో – ప్రకృతి వైపరీత్యాలు అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కోపల్లె శ్రీనివాస్ ప్రదర్శించిన ‘అన్నదాత’ ఏకపాత్రాభినయం ఆలోచింపజేయగా, వీసీ ఆయనను సత్కరించారు. అనంతరం గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చింతా ప్రసాద్, సభ్యులు వీసీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదరణ సేవా సంస్థ అధ్యక్షురాలు మల్లిపూడి షర్మిల, విద్యార్థులు పాల్గొన్నారు.
వీరవాసరం: పశ్చిమ గోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–17 బాలబాలికల బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపికలను గురువారం తణుకు ఎస్వీకేపీ ఉమెన్స్ కాలేజ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు గుత్తుల నర్మద, మహమ్మద్ ఖుద్ధుస్ తెలిపారు. ఈ ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని వారు కోరారు.
తాడేపల్లిగూడెం: గూడెం – నవాబుపాలెం రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో సుమారు 60 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల వృద్ధుడు మృతి చెందినట్లు గూడెం రైల్వే పోలీసులు తెలిపారు. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు రైల్వే ఎస్సై పి. అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు ఇంకా తెలియరాలేదని ఆయన వెల్లడించారు.
కాళ్ల: జాతీయ జలచర జీవుల వ్యాధుల నిఘా కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర మత్స్య సాంకేతిక సంస్థ (కాకినాడ) అధికారులు బుధవారం కలవపూడి గ్రామంలోని రొయ్యల సాగు చెరువులను సందర్శించి, రైతులకు వ్యాధులపై అవగాహన కల్పించారు. గ్రామంలోని నాలుగు రొయ్యల సాగు చెరువులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రొయ్యల్లో విబ్రియో బ్యాక్టీరియా పాజిటివిటీ, బ్లాక్ గిల్ (నల్లటి మొప్పలు) లక్షణాలను క్షేత్రస్థాయిలో గుర్తించారు. వ్యాధి నిర్ధారణ, ప్రయోగశాల పరీక్షల నిమిత్తం రొయ్యల నమూనాలను సేకరించారు. రొయ్యల ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణ, మెరుగైన సాగు యాజమాన్య పద్ధతులపై రైతులకు తగిన సాంకేతిక సూచనలు అందించారు. అలాగే, మొబైల్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. రైతులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా సహకరించి, వ్యాధుల సమాచారాన్ని సకాలంలో నివేదించడం ద్వారా నష్టాలను ముందస్తుగా నివారించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి డి. శ్రీనివాస్, జిల్లా ఆక్వా ల్యాబ్ మత్స్యశాఖ అధికారి జి.శ్రీనివాసరావు, ఎఫ్‌డీఓ, ఇతర మత్స్యశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.


