డీపీటీఓ షేక్ షబ్నం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇటీవల కాలంలో ఆర్టీసీ సిబ్బందిపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో, ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయడం శిక్షార్హమైన నేరం అనే హెచ్చరిక స్టిక్కర్లను ప్రతి బస్సులో అతికించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన స్టిక్కర్లను జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) షేక్ షబ్నం మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత కొద్ది నెలలుగా బస్సు ప్రయాణాల్లో సహనం కోల్పోయిన కొందరు ప్రయాణికులు భౌతిక దాడులకు దిగడం వల్ల విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. వారికి మనోధైర్యం కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడం వివిధ సెక్షన్ల కింద ఒకటి నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే తీవ్రమైన నేరమని హెచ్చరించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోలలోని బస్సులకు ఈ స్టిక్కర్లను అంటించనున్నట్లు స్పష్టం చేశారు.


