కూరగాయల ధరలు (కిలో రూ.లలో)
● కూరగాయల ధరలకు రెక్కలు
● వరుస తుపాన్లు, కార్తీక మాస ప్రభావం
● రెట్టింపైన ధరలు
ద్వారకాతిరుమల: కార్తీకమాసం ఎక్కువ మంది శాకాహారానికి ప్రాధాన్యమివ్వడంతో సహజంగా కూరగాయలకు డిమాండ్ పెరుగుతుంది. దీంతో ధరలు పెరుగుతుంటాయి. ఈ ఏడాది మాత్రం వీటి ధరలు మరింత పెరిగాయి. వరుస తుపాన్ల ప్రభావంతో కూరగాయల పంటలకు దెబ్బ తగలడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో గతంలో కిలోల కొద్దీ కొనుగోలు చేసిన కూరగాయలను ప్రస్తుతం అర కిలోతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.
తుపాన్లతో దెబ్బ
ఇటీవల ఆర్నబ్, మురసు తుపాన్ల ప్రభావంతో పలు ప్రాంతాల్లో వ్యవసాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కూరగాయల సాగుకు తీవ్రనష్టం వాటిల్లడంతో మార్కెట్‌కు వచ్చే దిగుబడులు తగ్గిపోయాయి. మరోవైపు వర్షాల కారణంగా కోతలు, రవాణాలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా మార్కెట్‌లో కూరగాయల లభ్యత తగ్గి ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఆకుకూరల పరిస్థితి కూడా అలానే ఉంది.
సగానికి పైగా పెరిగిన ధరలు
కార్తీకమాసానికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం కొన్ని రకాల కూరగాయల ధరలు సగానికి సగం కంటే ఎక్కువగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లోనే ధరలు అధికంగా ఉండటంతో రిటైల్ వ్యాపారులు కూడా అదనపు ధరలకు విక్రయించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.
కొనాలంటే ఆలోచించాల్సిందే..
రోజువారీ కూలీ పనులు చేసుకునేవారు, చిరుద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలపై కూరగాయల ధరల ప్రభావం తీవ్రంగా పడుతోంది. గతంలో రూ.100తో సంచి నిండా కూరగాయలు కొనుగోలు చేసేవారమని, ప్రస్తుతం అదే మొత్తంతో రెండు మూడు రకాలకే పరిమితం కావాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ అవసరాలకు అనుగుణంగా కొనుగోళ్లను తగ్గించుకుంటున్నారు. ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు.. మరోవైపు కూరగాయల ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నారు.
రకం హోల్‌సేల్ రిటైల్
పాత ఉల్లిపాయలు 53 60
కొత్త ఉల్లిపాయలు 45 50
తెల్ల వంకాయలు 70 80
నల్ల వంకాయలు 50 60
చిక్కుడు 120 140
దొండకాయలు 50 60
క్యారెట్ 60 70
బీరకాయలు 60 70
ములక్కాయలు 100 120
ఆకాకరకాయలు 120 140
ఆనపకాయ 40 45
బెండకాయలు 60 70


