జనావాసాల్లోకి పెద్దపులి | - | Sakshi
Sakshi News home page

జనావాసాల్లోకి పెద్దపులి

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

బుట్టాయగూడెం : అటవీ ప్రాంతానికే పరిమితమైన పెద్దపులి జనావాసాల్లోకి చొరబడింది. జీలుగుమిల్లి మండలంలోని బొత్తప్పగూడెంలో వీరాలమ్మ కూపులో మకాం వేసిన పెద్దపులి ఆదివారం వేకుజామున జీలుగుమిల్లి గ్రామంలోకి ప్రవేశించింది. ప్రసిద్ధ జగదాంబ అమ్మవారి ఆలయ పరిసరాల్లో పులి సంచరించగా సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఆ సమయంలో రోడ్డుపై పులి సంచరిస్తుండగా, ఎదురుగా ఒక కారు రావడం, కారులో నుంచి పులిని చూడటంతో వారు భయంతో హారన్‌ కొట్టారు. దీంతో పులి అక్కడ నుంచి తప్పించుకుని చంద్రమ్మకాలనీ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో మకాం వేసింది. ప్రస్తుతం అక్కడే ఉన్నట్టు అటవీశాఖ అధికారులు రేడియో కాలర్‌ సిగ్నల్‌ ద్వారా గుర్తించారు. అయితే రాత్రికి మళ్లీ పులి పయనించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చంద్రమ్మకాలనీ అటవీ ప్రాంతం ఇటు ఆంధ్రా, అటు తెలంగాణ ప్రాంతాలకు సరిహద్దులో ఉండటంతో తెలంగాణకు చెందిన అటవీశాఖ అధికారులు అటువైపు రాకుండా బాంబులు వేస్తూ బెదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో పులి మళ్లీ జీలుగుమిల్లి పరిసర ప్రాంతాల్లోనే సంచరించే అవకాశం ఉండటంతో ఇక్కడ అటవీశాఖ అధికార అధికారులు పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. రాత్రి వేళల్లో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, పశువులను బయట కట్టవద్దని హెచ్చరికలు జారీ చేశారు. పులి కదలికలపై రాజమండ్రి నుంచి వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ గమనిస్తోంది. జంగారెడ్డిగూడెం రేంజ్‌ అధికారి దుర్గాకుమార్‌ బాబు ఆధ్వర్యంలో అధి కారులు పులి కదలికలపై నిఘా ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement