ప్రత్యర్థులపై ప్రలోభాల వల | - | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థులపై ప్రలోభాల వల

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

ప్రత్యర్థులపై ప్రలోభాల వల

● సర్పంచ్‌ ఎన్నికల వేళ రాజకీయ వేడి

● ప్రతిపక్ష శ్రేణులకు గాలం

● హామీలు, ప్రలోభాలపై గ్రామాల్లో చర్చ

కుకునూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో పల్లెల్లో రాజకీయ సందడి మొదలైంది. సర్పంచ్‌ స్థానాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా అధికార కూటమి నాయకులు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల స్థానిక నాయకులు, కార్యకర్తలు, బలమైన మద్దతుదారులను తమవైపు తిప్పుకునేందుకు ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’కు తెరతీసినట్టు చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా ప్రలోభాలకు గురిచేయడంతో పాటు, రాజకీయ భవిష్యత్తుకు భ రోసా, స్థానిక సమస్యల పరిష్కార హామీలతో ఇతర పార్టీల శ్రేణులను ఆకర్షిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆర్‌అండ్‌ఆర్‌ అంశంపై..

గతంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల స మయంలోనూ జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్‌ ముంపు మండలాల్లో ఆర్‌అండ్‌ఆర్‌ (పునరావాస) పరిహారం అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తేనే పరిహారం అందుతుందనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే పునరావాస పరిహారం అనేది అర్హులైన నిర్వాసితులకు చట్టబద్ధంగా అందాల్సిన హక్కు. దానిని ఎన్నికల మద్దతుతో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

కూటమిపై అసంతృప్తి

మరోవైపు ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన పలు హామీలు ప్రభుత్వ ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. అయినా అధికారంలో ఉన్నవారితో విభేదిస్తే పరిహారాలు, ప్రభుత్వ పనులు, ఇతర లబ్ధికి ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న ఆందోళన కొందరిలో కనిపిస్తోంది. దీంతో కొందరు తమ రాజకీయ వైఖరిని మార్చుకుంటుండగా, మరికొందరు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

గెలుపు వ్యూహాలతో..

సర్పంచ్‌ ఎన్నికల్లో అధికారికంగా పార్టీ గుర్తులు లేకపోయినా, ప్రధాన పార్టీలు తమ మద్దతుతో అభ్యర్థులను బరిలోకి దింపుతూ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో చేరికల రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎన్నికల్లో ప్రజల స్వేచ్ఛాయుత నిర్ణయాన్ని ప్రభావితం చేసే ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు తావు ఉండకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామస్థాయిలో సాగుతున్న ఈ రాజకీయ పరిణామాలు చివరకు ఎవరికి లాభం చేకూరుస్తాయో, ఓటరు ఎవరికి పట్టం కడతాడో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement