చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం రెండో రోజు 14 నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్‌పర్సన్, 23 వార్డులకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న దృష్ట్యా నగర పంచాయతీ కార్యాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులు మొదట పోలీసు సిబ్బంది వద్ద టోకెన్ తీసుకోవాలన్నారు. అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరిని మాత్రమే నామినేషన్ కేంద్రం లోపలికి అనుమతిస్తామన్నారు. కేంద్రం లోపలికి సెల్‌ఫోన్లను తీసుకెళ్లడంపై పూర్తి నిషేధం విధించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తామని, అభ్యర్థులు మధ్యాహ్నం 2:30 గంటల లోపు నామినేషన్ కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా సహకరించాలని పోలీసులు కోరారు.


