● ట్రిపుల్ ఐటీలో సీనియర్లకు దక్కని ప్రాధాన్యం
● హెచ్‌ఆర్‌ఏ, పీహెచ్‌డీ ఇన్సెంటివ్స్‌లోకోతలతో అధ్యాపకుల గగ్గోలు
నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో కాంట్రాక్టు బోధనా సిబ్బందికి అమలు చేస్తున్న మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఆయా పోస్టుల పే స్కేల్‌లో ప్రారంభ వేతనం చెల్లించాలని 2022లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే, ఆర్జీయూకేటీలో దీనిని అమలు చేయకపోవడంతో సిబ్బంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు రెండు నెలల క్రితం నుంచి నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి సుమారు 250 మందికి అధికారులు ఎంటీఎస్‌ను వర్తింపజేశారు. కానీ, దీని అమలులో లోపాలు తమకు శాపంగా మారాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్లకు నష్టం.. జూనియర్లకు లాభం
ఎంటీఎస్ అమలులో సీనియర్లను, జూనియర్లను ఒకే గాటన కట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2008 నుంచి పని చేస్తున్న మెంటార్లు, ఐటీ మెంటార్లు, 2010 నుంచి సేవలందిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు ఇటీవల (2017–2024 మధ్య) నియమితులైన కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లందరికీ ఒకే విధంగా రూ.57,100 వేతనం చెల్లిస్తున్నారు. దీనివల్ల కొందరికి ఒక్కసారిగా రూ.25 వేల వరకు వేతనం పెరిగితే, దశాబ్దానికి పైగా అనుభవం ఉన్న సీనియర్లకు కేవలం రూ.10 వేలు మాత్రమే పెరిగింది. 18 ఏళ్ల అనుభవం ఉన్నవారికి, ఐదేళ్ల అనుభవం ఉన్నవారికి ఒకే వేతనం ఇవ్వడం ద్వారా యూనివర్సిటీలో సీనియారిటీకి విలువ లేకుండా పోయిందని అధ్యాపకులు వాపోతున్నారు.
క్వార్టర్స్ అద్దె పేరుతో 12 శాతం కోత
ట్రిపుల్‌ఐటీలు రెసిడెన్షియల్ విద్యాసంస్థలు కావడంతో క్యాంపస్‌ల్లోనే క్వార్టర్స్ నిర్మించారు. గత పదేళ్లకు పైగా బోధనా సిబ్బంది, ల్యాబ్ అసిస్టెంట్లు, టెక్నీషియన్లకు వీటిని ఉచితంగా కేటాయించారు. కానీ, ప్రస్తుతం ఎంటీఎస్ అమలు సాకుతో వారి వేతనాల నుంచి ఇంటి అద్దె (హెచ్‌ఆర్‌ఏ) పేరుతో 12 శాతం సొమ్మును మినహాయించుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఉచితంగా ఇచ్చిన క్వార్టర్స్‌కు ఇప్పుడు అద్దె వసూలు చేయడం దారుణమని ఉద్యోగులు మండిపడుతున్నారు.
పీహెచ్‌డీ ఇన్సెంటివ్‌కు ఎగనామం
పీహెచ్‌డీ అర్హత కలిగిన కాంట్రాక్టు అధ్యాపకులకు గతంలో నెలకు రూ.5 వేల ఇన్సెంటివ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఎంటీఎస్ అమలులోకి రావడంతో ఇతరత్రా అదనపు ప్రయోజనాలు ఉండవనే కారణంతో ఆ ఇన్సెంటివ్‌ను నిలిపివేశారు. ఒకవైపు హెచ్‌ఆర్‌ఏ కోత, మరోవైపు పీహెచ్‌డీ ఇన్సెంటివ్ రద్దుతో ఎంటీఎస్ వల్ల తమకు ఒరిగిందేమీ లేదని అధ్యాపకులు పెదవి విరుస్తున్నారు.
కోర్టుకు వెళ్లని వారికి మొండిచేయి
ప్రభుత్వ జీఓ ప్రకారం అర్హులందరికీ ఎంటీఎస్ వర్తింపజేయాల్సి ఉండగా, కేవలం కోర్టు మెట్లు ఎక్కి ఉత్తర్వులు తెచ్చుకున్న వారికి మాత్రమే అధికారులు దీనిని అమలు చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించని మెంటార్లు, ఐటీ మెంటార్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గెస్ట్ ఫ్యాకల్టీలు, ల్యాబ్ అసిస్టెంట్లకు మొండిచేయి చూపడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఎంటీఎస్ అమలుపై పునఃసమీక్ష జరపాలని, అర్హులందరికీ న్యాయం చేయాలని ట్రిపుల్‌ఐటీ వర్గాలు కోరుతున్నాయి.


