ద్వారకాతిరుమల: ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం.. అదే రోజు ఓ వివాహిత పుట్టింటికి వెళ్లి రెండు రోజుల తర్వాత ఆత్మహత్యకు పాల్పడడం.. ఈ రెండు ఘటనలు ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులతో ముడిపడి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని ఎం.నాగులపల్లికి చెందిన చవటపల్లి రవితేజ (24) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 6న సాయంత్రం భీమవరం కిరాయికి వెళుతున్నానని చెప్పి వెళ్లిన అతను, మరుసటి రోజు తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. మృతికి కారణాలు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు అదే రోజు మృతదేహాన్ని ఖననం చేశారు.
రెండు రోజులకే వివాహిత ఆత్మహత్య
ఇదిలా ఉండగా, నాలుగు నెలల క్రితం ఎం.నాగులపల్లికి చెందిన యువకుడిని వివాహం చేసుకున్న నల్లజర్ల మండలం పుల్లలపాడుకు చెందిన ఓ యువతి రవితేజ మృతి చెందిన రోజు సాయంత్రం పుట్టింటికి వెళ్లి, ఈ నెల 9న ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అంత్యక్రియలు పుట్టింటి వద్దే జరిగాయి.
పోస్టుమార్టానికి ఏర్పాట్లు
ఒకే గ్రామానికి చెందిన యువకుడు, వివాహిత రోజుల వ్యవధిలో మృతి చెందడంతో పాటు వారి మధ్య వివాహేతర సంబంధం ఉందనే ప్రచారం గ్రామంలో నడిచింది. రవితేజది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో రవితేజ తల్లి రమణ శనివారం ద్వారకాతిరుమల పోలీసులకు ఫిర్యాదు చేసింది. భీమడోలు సీఐ పి. కృష్ణ, ఎస్సై టి. సుధీర్ విచారణ చేపట్టి, ఇప్పటికే ఖననం చేసిన రవితేజ మృతదేహాన్ని సోమవారం వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


