పోలవరం రూరల్: కొవ్వాడ అదనపు జలాలు, గోదావరి వరదల ఉధృతికి మండలంలోని పట్టిసం లంక ఒడ్డు భారీగా కోతకు గురైంది. పట్టిసం రేవు వద్ద ఉన్న పంచాయతీ, రెవెన్యూ, పోలీసు ఔట్‌పోస్ట్ భవనాల సమీపంలో ఒడ్డు కోసుకుపోవడంతో, పంచాయతీ భవనం బేస్‌మెంట్ వరకు దెబ్బతిని కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. గోదావరి వరద ఎగపోటుతో పాటు ఔట్‌ఫాల్ స్లూయిజ్ నుంచి వచ్చే కొవ్వాడ జలాల తాకిడికి, గతంలో నిర్మించిన కాంక్రీట్ రక్షణ గోడ దిగువ నుంచి కోత తీవ్రమైంది. దీంతో రేవులోని యాత్రికుల విశ్రాంతి భవనం, స్లూయిజ్ దిగువన ఉన్న పెద్ద లంక దిబ్బ సైతం నదిలో కలిసిపోయే పరిస్థితి నెలకొంది. మహాశివరాత్రి, కార్తీక మాస ఉత్సవాల్లో అధికారులు ఈ కార్యాలయాల నుంచే విధులు నిర్వహిస్తారు. అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టకపోతే భవనాలన్నీ వరదలో కొట్టుకుపోతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


